పవన్‌కల్యాణ్‌ మద్దతూ ప్లస్ పాయింటే..

25 Jan, 2015 01:06 IST|Sakshi
పవన్‌కల్యాణ్‌ మద్దతూ ప్లస్ పాయింటే..

సాక్షి ప్రతినిధి, కాకినాడ : జిల్లాలోని కమలదళంలో కొత్త ఆశలు చిగురిస్తున్నాయి. నిఘా వర్గాల నివేదికల ఆధారంగా భవిష్యత్‌లో మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ జరుగుతుందని అటు టీడీపీ, ఇటు బీజేపీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఆ ముహూర్తం ఎప్పుడొస్తే అప్పుడు జిల్లాకు మరో మంత్రి పదవి, అది కూడా బీజేపీ కోటాలో అవకాశం దక్కుతుందని కమళశ్రేణు మధ్య చర్చ జరుగుతోంది. పొరుగున ఉన్న పశ్చిమగోదావరి జిల్లా నుంచి  కేబినెట్‌లో ప్రాతినిధ్యం వహిస్తున్న దేవాదాయ శాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు స్థానే జిల్లా నుంచి బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు, ఆ పార్టీ సీనియర్ నేత సోము వీర్రాజు పేరు కమాండ్ పరిశీలనలో ఉందనే ప్రచారం ఆ పార్టీలో జోరుగా సాగుతోంది.
 
 మంత్రి మాణిక్యాలరావు, వీర్రాజులది ఒకే సామాజికవర్గం. విస్తరణలో మాణిక్యాలరావు స్థానే మంత్రి పదవిని వీర్రాజుకు కట్టబెట్టే ఆలోచనతో పార్టీ అధిష్టానం ఏకాభిప్రాయం కోసం ప్రయత్నిస్తోందని సమాచారం. నిఘా వర్గాలతో పాటు సీఎం చంద్రబాబు సొంత నివేదికలు మాణిక్యాలరావుకు వ్యతిరేకంగా వచ్చాయంటున్నారు. అదేవిధంగా తన శాఖలో ఉన్నతాధికారి మార్పు కోసం మంత్రి కోరిన సందర్భంలో కూడా సీఎం సుముఖత వ్యక్తం చేయలేదని చెబుతున్నారు. అవసరమైతే అమాత్య పదవినే మార్పు చేస్తాం కానీ ఆ అధికారిని మార్పు చేసేది లేదని ఖండితంగా చెప్పినట్టు విశ్వసనీయ సమాచారం. ఈ నేపథ్యంలోనే మంత్రివర్గ విస్తరణలో మాణిక్యాలరావు విషయంపై నిర్ణయం తీసుకోవాలనుకుంటున్నారు. ఈ విషయాన్ని పసిగట్టారో ఏమో తెలియదు కానీ.. మాణిక్యాలరావు ఇటీవల చంద్రబాబుని అవకాశమొచ్చినప్పుడల్లా ప్రసన్నం చేసుకునే ప్రయత్నాలు చేస్తున్నట్టు కనిపిస్తోందని కమలం పార్టీలో చర్చించుకుంటున్నారు. ఆయన టీడీపీ నేతలకంటే పోటీపడి మరీ బాబును పొగడ్తలతో ముంచెత్తుతున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి.
 
 పవన్ మద్దతూ ప్లస్ పాయింటే..
 ఎన్నికల్లో అధిష్టానం టిక్కెట్టు ఇస్తానన్నా వీర్రాజు తిరస్కరించారు. తన స్థానే రాజమండ్రి సిటీకి డాక్టర్ ఆకుల సత్యనారాయణ పేరును వీర్రాజే ప్రతిపాదించారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. కాగా మంత్రి విస్తరణలో ఆకుల కూడా మంత్రి పదవి కోసం ప్రయత్నిస్తున్న వారిలో లేకపోలేదు. ఇప్పటికే రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే పదవిలో ఆకుల ఉండగా.. ఇప్పుడు అదే ప్రాంతానికి, అదే సామాజిక వర్గానికి చెందిన వీర్రాజుకు ఎమ్మెల్సీ పదవి కేటాయించి మంత్రి పదవిని ఇస్తే జిల్లాలోని ఇతర ప్రాంతాలకు, ఇతర సామాజిక వర్గాల నుంచి వచ్చే అసంతృప్తులపై కూడా అధిష్టానం ఆరా తీస్తోంది. అయితే ఆవిర్భావం నుంచి క్రమశిక్షణ కలిగిన నేతగా హైకమాండ్‌లో పేరున్న వీర్రాజుకు ఇవేమీ అడ్డురావనే వాదన కూడా ఉంది.
 
 గత ఎన్నికల  సమయంలో జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ను నరేంద్రమోడీ వద్దకు తీసుకువెళ్లింది కూడా ఆయనేనంటున్నారు. ఈ క్రమంలో పవన్ మద్దతు పుష్కలంగా ఉండటం కూడా తోడై వీర్రాజుకు ఎమ్మెల్సీ ఖాయమైందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. సీఎం చంద్రబాబు రప్పించుకున్న నివేదికలు, బీజేపీ హై కమాండ్‌లో  పలుకుబడి వెరసి మాణిక్యాలరావు స్థానే వీర్రాజు పేరును బీజేపీ ప్రతిపాదిస్తుందనే ప్రచారం ఆ పార్టీ వర్గాల్లో జోరుగా సాగుతోంది. ఈ పరిణామాలతోనే.. పదవిని పదిలం చేసుకునే ఆరాటంతో మాణిక్యాలరావు సీఎం బాబును ఆకాశానికి ఎత్తుతున్నట్టు విశ్లేషకులు భావిస్తున్నారు.
 
 అయినా పార్టీ అధిష్టానం నిర్ణయం వీర్రాజుకు సానుకూలంగా ఉంటే మాణిక్యాలరావు మంత్రి పదవికి ఎసరు ఖాయమంటున్నారు. బీజేపీ కోటాలో పశ్చిమకు దక్కిన అమాత్య పదవిని తూర్పులో భర్తీ చేస్తారంటున్నారు. వారిద్దరిది ఒకే సామాజికవర్గం కావడంతో సామాజికంగా పెద్దగా వచ్చే ఇబ్బంది కూడా ఉండదన్న కమలం పార్టీ ఆలోచనగా ఉంది. అదే జరిగితే జిల్లాలో ప్రస్తుతం ఉన్న రెండు మంత్రి పదవులకు (ఉప ముఖ్యమంత్రి చినరాజప్ప, ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు) అదనంగా మరోటి చేరనుంది.
 

మరిన్ని వార్తలు