-

తమ్ముళ్ల బాహాబాహీ

21 Jul, 2015 11:22 IST|Sakshi
  •     టీడీపీ సమన్వయ సమావేశంలో రచ్చ
  •      నేతల ఎదుటే వాకాటి వర్సెస్ వేనాటి...
  •      రసాభాసగా మారిన సమావేశం.
  •      అర్థంతరంగా వాయిదా..
  • నెల్లూరు(సూళ్లూరుపేట): టీడీపీ అగ్రనేతల ఎదురుగానే నియోజకవర్గ తెలుగు తమ్ముళ్లు బాహాబాహీకి దిగారు. నువ్వెంత అంటే నువ్వెంతరా.. అనుకునే స్థాయిలో సుమారు గంటకుపైగా వాదులాడుకోవడంతో కార్యకర్తలు నిశ్చేష్టులయ్యారు. వారంతా సమావేశం నుంచి బయటకు వెళ్లడం కనిపించింది. సూళ్లూరుపేట నియోజకవర్గ టీడీపీ సమన్వయ సమావేశాన్ని సోమవారం రాత్రి స్థానిక సత్యసాయి కల్యాణమండపంలో నియోజకవర్గ సమన్వయకర్త ఆనం జయకుమార్‌రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సమావేశానికి ఎమ్మెల్సీ వాకాటి నారాయణరెడ్డి, పార్టీ అగ్రనేతలు కొండేపాటి గంగాప్రసాద్, వేనాటి రామచంద్రారెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు పరసా వెంకటరత్నయ్య, నెలవల సుబ్రమణ్యంలు హాజరయ్యారు. ముందుగా వాకాటి టీడీపీ, సీఎం గురించి పొగుడుతుండగా తడ మండలం భీములవారిపాళెంకు చెందిన అవుల మనోహర్ లేచి పార్టీలో సీనియర్లం మేం... నువ్వు నిన్న వచ్చావు. నువ్వు చెప్పితే నేర్చుకునే పరిస్థితిలో లేం’ అని అనడంతో వాకాటి ఆగ్రహంతో కూర్చోవోయ్.. మాకు తెలుసుగాని అన్నారు. వెంటనే తడ నాయకులు వేనాటి పరంధామిరెడ్డి లేచి వాకాటి మీద ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఏం తెలుసని మాట్లాడుతున్నావ్.. నువ్వు నిన్న పార్టీలో చేరావ్.. నువ్వు చెబితే నేర్చుకుంటామా! మా పార్టీ కార్యకర్తను అరే ఒరేయ్ అంటావా! అని వాదనకు దిగడంతో ఈ గొడవ చినికిచినికి గాలివానగా మారిపోయింది. బాబు రమ్మని కోరితే పార్టీలో చేరా..! నువ్వు చెప్పేది ఏందీ అని వాకాటి కూడా ఎదురుదాడికి దిగారు. వాకాటి పార్టీలో చేరినప్పటి నుంచి వారిద్దరి మధ్య వివాదం నివురుగప్పిన నిప్పులా రగులుతూనే వుంది.

    వాకాటి, వేనాటి పరంధామిరెడ్డిది ఒకే గ్రామం కావడం, రాజకీయ ప్రత్యర్థులుగా చిరకాలంగా కొనసాగుతున్నారు. సమన్యయ సమావేశాన్ని ఆదునుగా తీసుకుని వేనాటి వర్గీయులు వాకాటిపై పథకం ప్రకారం దాడిచేయాలని ముందుగా ప్లాన్ చేసుకున్నారనే ఆరోపణలు విని పించాయి. దీంతో వేనాటి వర్గీయులంతా వాకాటిపై మాటల దాడి మొదలుపెట్టడంతో వాకాటి ఒంటరిగా మిగిలారు. ఆయనకు మద్దతుగా మాట్లాడేవారు కరువయ్యారు. వెంటనే సమన్వయకర్త జయకుమార్‌రెడ్డి, గంగాప్రసాద్, ఇతర నాయకులు సర్దుబాటు చేసినా వ్యవహారం సద్దుమణగలేదు. సుమారు గంటపాటు వివాదం భారీస్థాయిలో జరిగింది. అరేయ్.. ఒరేయ్.. అని తిట్టాడు కదా! దానికి క్షమాపణ చెప్పాలని, కాంగ్రెస్ పార్టీలో ఉన్నపుడు తమపై అన్యాయంగా పెట్టించిన అట్రాసిటీ కేసులు ఎత్తించేసి పార్టీలోకి రమ్మనండి.. అని వేనాటి వర్గీయులు పట్టుబట్టారు. వెంటనే పరంధామిరెడ్డికి మద్దతుగా వేనాటి సురేష్‌రెడ్డి ప్రవేశించి పదేళ్లు దెబ్బలుతిన్నాం. అవమానాలు పడ్డాం. ఆ పార్టీలో ఉన్నపుడు ఆవమానాలు పడ్డాం. మళ్లీ ఆ పార్టీలో నాయకులు మాపార్టీలోకి వచ్చి పెత్తనం చలాయిస్తే ఊరుకోం అంటూ గొడవకు దిగారు. 30 ఏళ్లుగా పార్టీకి పనిచేస్తుంటే ఈరోజున వచ్చిన వాళ్లు పెత్తనం చేస్తే ఊరుకునేది లేదన్నారు. ఇంత వివాదంలో వేనాటి రామచంద్రారెడ్డి ప్రేక్షకుడిలా ఉండిపోయారు. ఆ తర్వాత జయకుమార్‌రెడ్డి, గంగాప్రసాద్, పరసా, నెలవలలు సమావేశాన్ని అర్ధంతరంగా రద్దు చేసి అందరూ కలిసి అంతర్గతంగా సమావేశం నిర్వహించారు. ఆ సమావేశంలో కూడా ఈ ఇద్దరు నాయకులు వారి అనుచరులు వాగ్వాదానికి దిగినట్టు సమాచారం. మొత్తానికి సూళ్లూరుపేట తెలుగుదేశంలో ముసలం పుట్టింది. ఒకే ఒరలో మూడు కత్తులన్నట్టుగా పరిస్థితి తయారైంది. సూళ్లూరుపేట టీడీపీ మూడుముక్కలుగా మారిందని ఈ సమావేశం బహిర్గతం చేసింది. కార్యకర్తలు స్పందిస్తూ మీరు కొట్లాడుకునే దానికి మమ్మల్ని ఎందుకు రమ్మన్నారని నాయకులను నిలదీశారు.

మరిన్ని వార్తలు