హలో.. అమరావతి నుంచి మాట్లాడుతున్నాం..

28 Mar, 2019 12:15 IST|Sakshi

అమరావతి నుంచి కాలర్‌ : హలో అమరావతి నుంచి మాట్లాడుతున్నాం.. మీకు పసుపు–కుంకుమ పథకం రూ.10 వేల చెక్కులు అందాయా...? మరో రూ.10 వేలు ఇచ్చేందుకు ఏర్పాట్లు జరగుతున్నాయి... ఇప్పటి వరకూ ఏ ముఖ్యమంత్రీ ఇలా చేయలేదు కదా.. దీనిపై మీ అభిప్రాయమేమిటి...?  
డ్వాక్రా మహిళ : రూ.10 వేలు ఎక్కడ అందాయి. రూ.2,500 ఓ సారి, రూ.3,500 మరోసారి రెండు చెక్కులు మారాయి అంతేగా.. మిగిలిన రూ.నాలుగు వేలు ఎప్పుడు వేస్తారు?
అమరావతి నుంచి కాలర్‌ : ఏప్రిల్‌ మొదటి వారంలోనే అదీ పోలింగ్‌కు ముందే మీ డబ్బులు పడిపోతాయి. మరో రూ.10 వేలు ఇచ్చేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.’’ ఇదండీ ఎన్నికల వేళ టీడీపీ డ్వాక్రామహిళలకు చేస్తున్న తాయిలాల ఫోన్‌ కాల్స్‌ సంభాషణ..


సాక్షి, అమలాపురం టౌన్‌: అమలాపురం పట్టణంలోని ఎర్రవంతెన ప్రాంతానికి చెందిన కొందరు డ్వాక్రా మహిళలకు బుధవారం ఈ తరహాలోనే అమరావతి నుంచి అంటూ ఫోన్లు వచ్చినప్పుడు ‘ఇప్పటి వరకూ ఏ ముఖ్యమంత్రీ ఇలా చేయలేదు కదా.... అని అవతలి గొంతు ఒకటికి రెండు సార్లు అడిగినప్పుడు కొంతమంది డ్వాక్రా మహిళలు కాస్త అసహనానికి గురై అవునండి అంటూ ముక్తసరిగా సమాధానం చెప్పినట్టు తెలిసింది. పట్టణంలోనే ఎర్రవంతెన ప్రాంతానికి చెందిన ఓ డ్వాక్రా మహిళ ఇచ్చిన ఫోన్‌ నెంబర్‌కు చేయగా ఆ ఫోన్‌ ఆమె భర్త వద్ద ఉండడంతో ఆయనే బదులిచ్చాడు. ఇంత వరకూ ఏ ముఖ్యమంత్రీ  చేయలేదు కదా.. మీ అభిప్రాయమేమిటి? అని అడిగినప్పుడు ఆ భర్త ‘‘అవునండి ఏ ముఖ్యమంత్రీ చేయలేదు నిజమే.. ప్రభుత్వ డబ్బులతోనే మాకే ఓట్లు వేయండని ముందే ఇవ్వడం ఇప్పటి వరకూ ఎవరు చేయలేదు కదా? అంటూ వ్యంగ్యంగా సమాధానం చెప్పడం గమనార్హం. టీడీపీకి ఓటు వేయండని ఆ ఒక్క మాట చెప్పకుండానే చంద్రబాబు ఇచ్చారు కాబట్టి తిరిగి ఆయనకే ఓటు వేయండన్న సూచన మాత్రం ఫోన్లలో మాట్లాడుతున్న వ్యక్తుల ఆత్రుతలను చాలా మంది మహిళలు పరోక్షంగా గమనించారు. ఓ పక్క ఎన్నికల తేదీ ప్రకటితమైంది.

నామినేషన్ల ప్రక్రియ దాదాపు పూర్తవుతోంది. అభ్యర్థులు ప్రచారాల్లో ముమ్మరంగా ఉన్న వేళ అమరావతి నుంచి అంటూ అదేదో రాజధాని ప్రభుత్వ ప్రధాన కార్యాలయం నుంచి మాట్లాడుతున్నంత బిల్డప్‌ ఇస్తున్నారు. అయితే అమరావతిలోని టీడీపీ ప్రధాన కార్యాలయం నుంచి ఆ ఫోన్లు వస్తున్నాయని డ్వాక్రా మహిళల్లో కొందరు నాయకత్వ లక్షణాలు ఉన్న మహిళలు అభిప్రాయపడుతున్నారు. ఇవి కచ్చితంగా కోడ్‌ ఆఫ్‌ కాండక్ట్‌ పరిధిలోకి వస్తాయని టీడీపీయేతర రాజకీయ పక్షాల నాయకులు అధికార యంత్రాంగాన్ని సూటిగా ప్రశ్నిస్తున్నారు. ఇది ముమ్మాటికీ ప్రభుత్వ సొమ్ములతోనే పరోక్షంగా ఓటర్లను ప్రలోభపెట్టడమని వ్యాఖ్యానిస్తున్నారు.  

మరిన్ని వార్తలు