రహదారా.. మీ జాగీరా..!

16 Mar, 2019 12:55 IST|Sakshi

నిబంధనలు ఉల్లంఘించి మరీ టీడీపీ ప్రచారం నిర్వహణ

వేదికపై భారీ స్క్రీన్‌లో ప్రభుత్వ పథకాల వీడియోలు

రోడ్డు మీదే పాటకచేరి పెట్టి మరీ పొగిడించుకున్న దామచర్ల

సాక్షి, ఒంగోలు సబర్బన్‌: అధికార పార్టీ నాయకులు ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించి మరీ అడ్డగోలుగా వ్యవహరించారు. టీడీపీ జిల్లా అధ్యక్షుడు, ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్‌ ఎన్నికల ప్రచారం నిబంధనలు ఉల్లంఘించి మరీ చేపట్టారు. ఒంగోలు నగరంలోని పాత మార్కెట్‌ సమీపంలో నీలాయపాలెం సెంటర్‌ వద్ద పార్టీ కార్యకర్తలు దామచర్ల జనార్దన్‌ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం వేదికను ఏర్పాటు చేశారు. ఆ వేదికపై భారీ స్క్రీన్‌ పెట్టి తెలుగుదేశం పార్టీ అభివృద్ధి కార్యక్రమాలను పెద్ద ఎత్తున ప్రచారం చేపట్టారు. ప్రజలను ఆకట్టుకోవటానికి భారీ స్థాయిలో పాట కచేరి నిర్వహించారు. రోడ్డు మీదనే స్టేజీ ఏర్పాటు చేయటంతో నిత్యం రద్దీగా ఉండే ట్రంకు రోడ్డులో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు.  అక్కడ షాపుల యజమానులు వ్యాపారాలు జరగక అసహనానికి లోనయ్యారు. సాయంత్రం 6.30 గంటల నుంచి రాత్రి పొద్దు పోయే వరకు రోడ్డు మీదనే కార్యక్రమం ఏర్పాటు చేయటంతో ప్రజల అవస్థలు అంతా ఇంతా కాదు.  

ఇదిలా ఉంటే స్టేజీ మీద ఏర్పాటు చేసిన భారీ స్క్రీన్‌  మీద ఒంగోలు అసెంబ్లీ నియోజక వర్గంలో దామచర్ల చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రదర్శించి మరీ ప్రచార కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఫొటోలు, ఎమ్మెల్యే జనార్ధన్‌ ఫొటోలు, టీడీపీ జెండాలు, దామచర్ల బైక్‌ ర్యాలీలు, సైకిల్‌ ర్యాలీలు, ప్రసంగాలు ఇలా చాలానే ప్రచారం చేశారు. పోలవరం నిర్మాణ పనులు, రాజధాని అమరావతి నిర్మాణ పనులు గురించి కూడా వీడియోలతో కూడిన ప్రచారాన్ని నిర్వహించారు.  అర్ధరాత్రి పొద్దుపోయే వరకు కార్యక్రమాన్ని నిర్వహించి ప్రజలకు అసౌకర్యం కల్పించటంతో పాటు ఎన్నికల నిబంధనలను నిలువునా ఉల్లంఘించారు. సాక్షాత్తు పోలీసులే దగ్గరుండి మరీ కార్యక్రమాన్ని కొనసాగేలా సహకరించారు. రాత్రి గం.9.52కు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్‌ వేదిక దగ్గరకు వచ్చి మాట్లాడారు. ఆ తరువాత సమయం అయిపోయిందంటూ పోలీసులు వచ్చి ఆపడంతో కార్యక్రమాన్ని ముగించారు. రోడ్డు మీద వేదిక నిర్వహణకు, మైక్‌ పర్మిషన్‌ ఇచ్చినట్లు పోలీసు అధికారులే అంగీకరించారు. ప్రజలకు అసౌకర్యం కలిగేలా రోడ్డు మీదనే ఏర్పాటు చేసినా పట్టించుకోలేదంటే పోలీసులు అధికార పార్టీ నాయకుల అడుగులకు మడుగులు వత్తుతున్నారన్న విమర్శలు గుప్పుమంటున్నాయి.  

మరిన్ని వార్తలు