అమరావతి వెళ్లినా...తేలని టీడీపీ అభ్యర్థి!

13 Mar, 2019 09:00 IST|Sakshi
ఎన్నికల ప్రచారంలో ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి, మాజీ ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి, సురేష్‌బాబు (ఫైల్‌) 

సాక్షి, ప్రొద్దుటూరు : ప్రొద్దుటూరు సిట్టింగ్‌ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి నెల రోజులు ముందుగానే ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించి జోరుగా కొనసాగిస్తున్నారు. ఇప్పటికే దాదాపు సగం నియోజకవర్గంలో   ప్రచారాన్ని పూర్తి చేశారు. అధికార పార్టీని గత ఐదేళ్లలో గట్టిగా ఎదుర్కోవడంతోపాటు ఆపదలో ఉన్న వారికి అండగా నిలుస్తున్నారనే మంచి పేరు రాచమల్లుకు ఉంది. ఈ కారణాల వల్ల ఆయన విజయం ఖాయమని, మెజారిటీపైనే స్పష్టత రావాల్సి ఉందని  చర్చ జరుగుతోంది.

ఇది ఇలా ఉండగా టీడీపీ అభ్యర్థిని ఇంత వరకు ఆ పార్టీ అధిష్టానం ప్రకటించలేదు. గతంతో పోల్చుకుంటే ప్రస్తుతం టీడీపీ అభ్యర్థి ఎంపిక అయోమయంగా మారింది. కొత్తపేర్లు సైతం ప్రచారంలోకి వస్తున్నాయి. ఆ పేర్లు వింటున్న టీడీపీ కార్యకర్తలు తమ అధిష్టానం ఇలా చేయడం ఏమిటని లోలోన ఆవేదనచెందుతూ బయటికి చెప్పుకోలేకపోతున్నారు. దాదాపు డజను పేర్లు తెరమీదికి వచ్చి కనుమరగైపోయాయి. ఇంకా స్పష్టత మాత్రం రాలేదు. పలు మార్లు స్థానిక నేతలు అమరావతికి వెళ్లడం, తిరిగి రావడం జరుగుతోంది. ఈనెల 18 నుంచి నామినేషన్ల కార్యక్రమానికి అధికారులు శ్రీకారం చుడుతుండగా అధిష్టానం ఇంకా అభ్యర్థిని ప్రకటించలేదు. 

ఫిబ్రవరి 6 నుంచే ప్రచారం 
 ప్లాన్‌ ప్రకారం ఎన్నికల బరిలోకి దిగుతున్న ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి ఫిబ్రవరి 6వ తేదీ నుంచే ఎన్నికల ప్రచారాన్ని మాజీ ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డితో కలిసి ప్రారంభించారు.  ఈకార్యక్రమానికి వైఎస్సార్‌సీపీ కడప పార్లమెంటరీ కన్వీనర్‌ కె.సురేష్‌బాబు హాజరయ్యారు. నియోజకవర్గ పరిధిలో ప్రొద్దుటూరు, రాజుపాళెం మండలాలకు సంబంధించి 30 గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీ పరిధిలో 40 వార్డులు ఉన్నాయి. రాజుపాళెం మండలంలో రాజుపాళెం గ్రామ మినహా మిగతా మండలమంతా ప్రచారం దాదాపుగా పూర్తయింది.  
ప్రొద్దుటూరు మండలంలో కాకిరేనిపల్లె, చౌడూరు, నరసింహాపురం, రామాపురం, రేగుళ్లపల్లి, సీతంపల్లి, ఎర్రగుంట్లపల్లి, కొట్టాల, నంగనూరుపల్లి, సోములవారిపల్లి గ్రామాల్లో ఎన్నికల ప్రచారాన్ని ఎమ్మెల్యే పూర్తి చేశారు.   ఎమ్మెల్యే రాచమల్లు ప్రచారం ఓటర్లను ఆకర్షిస్తుండటంతోపాటు వైఎస్సార్‌సీపీ నాయకుల్లో ఉత్సాహాన్ని నింపుతోంది. మంగళవారం నుంచి ప్రొద్దుటూరు మున్సిపాలిటీ పరిధిలో ఒకటో వార్డు నుంచి ఎమ్మెల్యే ఎన్నికల ప్రచారం ప్రారంభించారు.

30 రోజుల్లో ప్రచారం చేస్తారా.. 
షెడ్యూల్‌ ప్రకారం ఈనెల 18 నుంచి అసెంబ్లీ అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయాల్సి ఉండగా ఏప్రిల్‌ 11న ఎన్నికలు జరగనున్నాయి. అన్నింటికి కలిపి నెల రోజుల వ్యవధి మాత్రమే ఉంది. ఇప్పటి వరకు టీడీపీ అధిష్టానం అభ్యర్థిని ఎంపిక చేయలేదు. మాజీ ఎమ్మెల్యేలు నంద్యాల వరదరాజులరెడ్డి, మల్లేల లింగారెడ్డి, కమలాపురం మాజీ ఎమ్మెల్యే వీరశివారెడ్డితోపాటు వరద కుమారుడు కొండారెడ్డి, ఉక్కు ప్రవీణ్‌కమార్‌రెడ్డి, డాక్టర్‌ వైవీ స్వరూప్‌కుమార్‌రెడ్డి, ఆప్కో చైర్మన్‌ గుజ్జల శ్రీను, టీటీడీ చైర్మన్‌ పుట్టా సుధాకర్‌ యాదవ్‌ పేర్లు పార్టీ వైపు నుంచి వినిపించగా స్థానికంగా పలువురు తామూ టికెట్‌ రేసులో ఉన్నామని ప్ర చారం చేసుకుంటున్నారు. ఇప్పటికిప్పుడు అభ్యర్థి ని అధిష్టానం ఎంపిక చేసినా నియోజకవర్గమంతా తిరిగి ప్రచారాన్ని పూర్తి చేయడం అంత సులు వు కాదని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. 

జగన్‌ నాయకత్వాన్ని ప్రజలు విశ్వసిస్తున్నారు
ప్రొద్దుటూరు : వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నాయకత్వాన్ని ప్రజలు పూర్తిగా కోరుకుంటున్నారని ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి అన్నారు. ప్రొద్దుటూరు మున్సిపాలిటీ పరిధిలోని ఒకటో వార్డులో మంగళవారం ఉదయం ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ ఎన్నికల నోటిఫికేషన్‌ వచ్చిన తొలి రోజు ఇక్కడ ప్రచారం చేస్తున్నానన్నారు. రైతులు, వ్యవసాయ కార్మికులు, కూలీలు, చిన్న వ్యాపారులు జగన్‌ను ముఖ్యమంత్రిని చేయాలని కోరుకుంటున్నారని తెలుస్తోందన్నారు.

ఈ వార్డు పూర్తిగా వైఎస్సార్‌సీపీకి పట్టుకొమ్మలాంటిదన్నారు. ఈ కారణంగా 2014 ఎన్నికల్లో ఇక్కడ మంచి మెజారిటీ వచ్చిందని అన్నారు. అంతకు రెండింతలు ఈ ఎన్నికల్లో మెజారిటీ వస్తుందని తెలిపారు. జగన్‌కు ఒక్క అవకాశం ఇవ్వాలని సర్వత్రా అభిప్రాయం ఏర్పడిందన్నారు. రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో ఇదే పరిస్థితి ఉందన్నారు. దీనిని బట్టి చూస్తే ఆ బ్రహ్మదేవుడు వచ్చినా చంద్రబాబును కాపాడలేరన్నారు. 

వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఏర్పాటైతే 
వైఎస్సార్‌ కాంగ్రెస్‌పార్టీ ప్రభుత్వం ఏర్పాటైతే తాను నియోజకవర్గాన్ని పూర్తిగా అభివృద్ధి చేస్తానని ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి అన్నారు. ప్రతిపక్ష పార్టీకి చెందిన ఎమ్మెల్యేగా తన వంతు ప్రజా సేవ చేశానన్నారు. టీడీపీ ప్రభుత్వం మాత్రం దృష్టి సారించకపోవడంతో నియోజకవర్గం అభివృద్ధికి ఆమడ దూరంలో ఉందన్నారు. అభివృద్ధి విషయంలో ప్రొద్దుటూరుకు పట్టిన దరిద్రం వదలాలంటే జగన్‌ ప్రభుత్వం ఏర్పాటు కావాలని చెప్పారు.

సమావేశంలో వైఎస్సార్‌సీపీ వార్డు నాయకులు పోరెడ్డి నరసింహారెడ్డి, కౌన్సిలర్‌ గోనా సరస్వతీ ప్రభాకర్‌రెడ్డి, పోరెడ్డి ప్రదీప్‌రెడ్డి, సందీప్‌రెడ్డి, మున్సిపల్‌ ఫ్లోర్‌లీడర్‌ వంగనూరు మురళీధర్‌రెడ్డి, కొనిరెడ్డి శివచంద్రారెడ్డి, వైఎస్సార్‌సీపీ మండల కన్వీనర్‌ దేవీ ప్రసాదరెడ్డి, రాజుపాళెం మండల కన్వీనర్‌ ఎస్‌ఏ నారాయణరెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి కల్లూరు నాగేంద్రారెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి ఓబయ్య, ఎస్సీసెల్‌ జిల్లా కార్యదర్శి స్నూకర్‌ భాస్కర్, గోకుల్‌ సుధాకర్, మాజీ కౌన్సిలర్‌ వరికూటి ఓబుళరెడ్డి, ఆయిల్‌ మిల్‌ ఖాజా, మార్కెట్‌ దాదాపీర్, 24వ వార్డు మహ్మద్‌రఫి పాల్గొన్నారు.
 

మరిన్ని వార్తలు