చంద్రగిరి: ‘నాని’గిరి

18 May, 2019 12:19 IST|Sakshi
వెంకట్రామాపురంలో ప్రచారానికి వెళ్తున్న చెవిరెడ్డిని అడ్డుకుంటున్న నాని అనుచరులు

ఓటు హక్కుకు టీడీపీ అడ్డు    

రెచ్చిపోయిన నాని అనుచరులు 

రీపోలింగ్‌ గ్రామాల్లో అడుగడుగునా అరాచకం  

దళితులను భయభ్రాంతులకు గురిచేస్తున్న వైనం

వైఎస్సార్‌సీపీకి ఓటు వేస్తే ప్రాణాలతో ఉండరంటూ హెచ్చరిక

పచ్చమూకల దాడిలో గాయపడ్డ దళితులు 

వారిని పరామర్శించిన ఎమ్మెల్యే చెవిరెడ్డి

సీఎం సొంత నియోజకవర్గం చంద్రగిరిలో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నాని అనుచరులు రెచ్చిపోయారు. మరోసారి గ్రామంలోకి రానివ్వకుండా స్థానిక ఎమ్మెల్యే చెవిరెడ్డికి అడ్డుతగిలారు. ఆయనకు అండగా నిలిచిన దళితులపై దాడులకు తెగబడ్డారు. అవ్వాతాతలనీ లాగిపడేశారు. అడ్డొచ్చిన పోలీసులపైనా చిందులేశారు. బతుకు తెరువు కోసం కొనుగోలు చేసిన ఆటోనూ ధ్వంసం చేశారు. తమ గ్రామంలోకి రావొద్దంటూ హెచ్చరికలు జారీచేశారు. వైఎస్సార్‌సీపీకి ఓటేస్తే మీ అంతుచూస్తామంటూ దళితులను గదమాయించారు. ఓటర్లను గృహనిర్బంధం చేస్తూ అలజడి సృష్టించారు. చంద్రగిరిలో శుక్రవారం చోటు చేసుకున్న ఈ పరిణామాలు విస్మయానికి గురిచేశాయి. రీపోలింగ్‌ జరిగే పల్లెల్లో రణరంగం తలపించింది. 
సాక్షి, తిరుపతి/తిరుపతి రూరల్‌: సీఎం సొంత నియోజకవర్గం చంద్రగిరి పరిధిలోని వెంకట్రామాపురం, ఎన్‌ఆర్‌ కమ్మపల్లి, కమ్మపల్లి, కొత్తకండ్రిగ, పాకాల మండలం పులివర్తివారిపల్లెలో ఎన్నికల కమిషన్‌ రీపోలింగ్‌కు ఆదేశించిన విషయం తెలిసిందే. చంద్రబాబు నియోజక వర్గంలోనే ఈ పరిస్థితి రావటంతో పరువుపోగొట్టుకున్న టీడీపీ శ్రేణులు మరింతగా రెచ్చిపోతున్నారు. రెండు రోజులుగా పచ్చమూకలు దళితులు, సామాన్యులపై యథేచ్ఛగా దాడులకు తెగబడుతున్నారు.

రాజ్యాంగం కల్పించిన ఓటుహక్కును ఏళ్ల తరబడి అందుకోలేకపోయిన దళితులు, మొదటిసారిగా ఓటింగ్‌కు ధైర్యంగా ముందుకు వస్తుండటంపై తట్టుకోలేకపోతున్నారు. దీంతో స్థానికులు ఎవ్వరూ బయటకు రాకుండా గృహ నిర్బంధంలో ఉంచారు. దళితులు, గిరిజనులను భయపెట్టి వారిని ఓటు హక్కుకు దూరం చేయాలని ప్రయత్నిస్తున్నారు. రీ–పోలింగ్‌ జరుగుతున్న గ్రామాల్లో ఎస్సీ, ఎస్టీలపై భౌతిక దాడులకు తెగబడుతున్నారు. 

దళితవాడలోకి వెళ్లి మరీ.. దాడులు
రామచంద్రాపురం మండలం ఎన్‌ఆర్‌ కమ్మపల్లిలో టీడీపీ గుండాలు రెచ్చిపోయారు. గ్రామానికి చెందిన హనుమంతునాయుడు, రధీస్, జనార్దన్‌ చౌదరి, నాగరాజు, మోహన్‌నాయుడు, మధు, సుబ్రమణ్యం నాయుడు, పద్మనాభ నాయుడు, మునిరత్నం నాయుడు, దామోధర్‌ నాయుడు, నారాయణస్వామి, హరీష్‌నాయుడు, రాజేశ్వరి, లక్ష్మీ, సాయి, జ్యోతి, హేమంత్‌నాయుడు మరికొందరు కలిసి కర్రలు, రాడ్లు, కారంతో దాడికి పాల్పడ్డారని స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. తమను కాదని 19న జరిగే ఓటింగ్‌కు వెళ్లవద్దని టీడీపీ నేతలు కులం పేరుతో దూషించారని, వైఎస్సార్‌సీపీకి ఓటు వేస్తే చంపేస్తామని బెదిరించినట్లు దళితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ‘మా ఓటు మమ్మల్ని వేయనీయకుండా అడ్డుకోవటం వల్లే రీ–పోలింగ్‌ వచ్చిందని, మా ఇష్టం వచ్చిన పార్టీకి ఓటు వేసుకుంటాం’ అని చెప్పిన వెంటనే టీడీపీ శ్రేణులు కర్రలు, రాడ్లు, కారం పొడితో మూకుమ్మడిగా దాడికి పాల్పడ్డారని వాపోయారు. జీవనోపాధి కోసం అప్పు చేసి కొనుగోలు చేసుకున్న ఆటోను సైతం ధ్వంసం చేశారు. టీడీపీ శ్రేణుల దాడిలో దళితవాడకు చెందిన నలుగురికి గాయాలు అయ్యాయి. మిమ్మల్ని చంపేస్తే ఎవరు వచ్చి కాపాడుతారో చూస్తామంటూ హెచ్చరికలు చేసినట్లు దళితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దాడికి పాల్పడిన వారిపై శుక్రవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాగా దళితులపై దాడికి పాల్పడిన వారిపై అట్రాసిటీ, హత్యాయత్నం కింద కేసులు నమోదు చేసినట్లు రేణిగుంట సీఐ శ్రీనివాసులు తెలిపారు. 

అధికారులపై వేటు పడే అవకాశం..
గత నెల 11న పోలింగ్‌ విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన అదికారులపై వేటు వేసే అకాశాలు కనిపిస్తున్నాయి. ముగ్గురు సెక్టోరియల్‌ అధికారులు, ఐదుగురు పోలింగ్‌ అధికారులు, టీడీపీకి అనుకూలంగా వ్యవహరించిన ఇతర సిబ్బందిపైనా కఠిన చర్యలకు రంగం సిద్ధమైనట్లు తెలిసింది. 

వెంకట్రామాపురంలో ప్రచారాన్ని అడ్డుకునే యత్నం
రామచంద్రాపురం మండలం వెంకట్రామాపురంలో ప్రచారానికి వెళ్లిన ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, వైఎస్సార్‌సీపీ కార్యకర్తలను టీడీపీ వర్గాలు అడ్డుకునే యత్నం చేశాయి. ‘మా ఊరులో మీ ప్రచారం వద్దు.. ఊరు నుంచి వెళ్లిపోండి’ అంటూ బెదిరించే ప్రయత్నం చేశారు. దీంతో వైఎస్సార్‌సీపీ శ్రేణలు దీటుగా సమాధానం ఇవ్వడం.. ప్రచారాన్ని అడ్డుకుంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని పోలీసులు సైతం హెచ్చరికలు జారీ చేయటంతో టీడీపీ నాయకులు వెనక్కితగ్గారు. అనంతరం ఎమ్మెల్యే చెవిరెడ్డి ఇంటింటికీ  వెళ్లి ప్రచారం చేశారు.

పాకాల మండలం పులివర్తివారిపల్లిలో వైఎస్సార్‌సీపీ చిత్తూరు ఎంపీ అభ్యర్థి రెడ్డెప్పను సైతం టీడీపీ అడ్డుకునే ప్రయత్నం చేసింది. ‘మా ఊరులోకి దళితుడు కాలుపెట్టొద్దు’ అంటూ కొందరు హెచ్చరించారు. అదేవిధంగా ఆయన్ని కారు దిగకుండా చేసేందుకు కారుపై పిడిగుద్దులు గుద్దారు. అయితే రెడ్డెప్ప సైతం వారికి దీటుగా సమాధానం ఇచ్చారు.  ప్రచారం  చేస్తాను, మీ ఇష్టం వచ్చింది చేసుకోండి’ అంటూ గ్రామంలోకి వెళ్లారు. దీంతో ఉద్రిక్తత పరిస్థితలు నెలకొన్నాయి. పోలీసులు జోక్యంతో టీడీపీ వర్గాలు వెనుదిరిగాయి. 

అండగా ఉంటా.. ధైర్యంగా ఓటు హక్కును వినియోగించుకోండి
దాడిలో గాయపడిన ఎన్‌ఆర్‌ కమ్మపల్లి దళితవాడకు చెందిన దళితులను శుక్రవారం చంద్రగిరి ఎమ్మెల్యే డాక్టర్‌ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, వైఎస్సార్‌సీపీ చిత్తూరు ఎంపీ అభ్యర్థి రెడ్డెప్ప పరామర్శించి టీడీపీ దాడులను ఖండించారు. అండగా ఉంటామని, ధైర్యంగా ఓటుహక్కును వినియోగించుకోవాలని కోరారు.  దాడికి పాల్పడిన వారిని వెంటనే అరెస్ట్‌ చేయాలని డిమాండ్‌ చేశారు.  

మరిన్ని వార్తలు