ఎస్సీ, ఎస్టీలే టార్గెట్‌!

22 Jan, 2019 12:29 IST|Sakshi
అరెస్టు చేయడానికి కంబదూరు ఎస్సీ కాలనీకి వచ్చిన విజిలెన్స్‌ పోలీసులు

విద్యుత్‌ చౌర్యం     పేరుతో వేధింపులు

మీటర్లు ఉన్నా కేసుల నమోదు

భారీ మొత్తంలో జరిమానా

భయాందోళనలో         అణగారిన వర్గాలు

నాటి టీడీపీ తొమ్మిదేళ్ల పాలన చరిత్ర పునరావృతమైంది. ఎస్సీ, ఎస్టీ సామాజిక వర్గాలను టార్గెట్‌ చేస్తూ విద్యుత్‌ చౌర్యం కేసుల బనాయింపు పెద్ద ఎత్తున సాగుతోంది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా దగా చేయడమే కాక.. పేదరికంలో కొట్టుమిట్టాడుతున్న ఎస్సీ, ఎస్టీలను దొంగలుగా చిత్రీకరిస్తూ ప్రభుత్వం భయభ్రాంతులకు గురిచేస్తోంది. సంక్షేమ ఫలాలు అందక దగాబడిన అణగారిన వర్గాల వారు.. ప్రస్తుతం కేసుల భయంతో కొట్టుమిట్టాడుతున్నారు. చేయని తప్పిదానికి అప్పులు చేసి అపరాధ రుసుం చెల్లిస్తున్నారు.

అనంతపురం ,కంబదూరు :కంబదూరు మండలంలో కొన్ని నెలలుగా విద్యుత్‌ విజిలెన్స్‌ అధికారుల దాడులు జోరుగా సాగుతున్నాయి. విద్యుత్‌ శాఖ, విజిలెన్స్‌ పోలీసులు సంయుక్తంగా చేపట్టిన ఈ దాడుల్లో ఇప్పటి వరకు 300 మందిపై విద్యుత్‌ చౌర్యం కేసులు నమోదయ్యాయి. ఇందులో అత్యధికుల ఇళ్లకు గృహ వినియోగ విద్యుత్‌ మీటర్లు ఉండడం గమనార్హం. ఇది అన్యాయమంటూ ఆవేదన వ్యక్తం చేసే పరిస్థితి కూడా బాధితులకు లేకుండా మాటలతో మరింత బెదిరిస్తూ భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. సోమవారం ఈ పరిస్థితి పరాకాష్టకు చేరుకుంది. విజిలెన్స్‌ పోలీసులు, విద్యుత్‌ శాఖ అధికారులు కంబదూరులోని ఎస్సీ కాలనీకి చేరుకుని పలువురిపై కేసులు నమోదు చేయడంతో పాటు పెద్ద మొత్తంలో విధించిన జరిమానాను చెల్లించి తీరాలంటూ పట్టుబట్టారు. చేతిలో చిల్లిగవ్వ కూడా లేని దుస్థితిలో అతి కష్టంపై కాలం నెట్టుకొస్తున్న ఎస్సీలకు జరిమానా చెల్లింపులు తలకు మించిన భారమయ్యాయి. తెలిసిన వారి వద్ద అప్పులు చేసి మరీ జరిమానా చెల్లించాల్సి వచ్చింది. 

వైఎస్సార్‌ హయాంలోనేవెలుగులు
ఎస్సీ, ఎస్టీ వ్యతిరేక విధానాలు అవలంబించడం టీడీపీకి ఆది నుంచి అలవాటు. ఎన్నికల సమయంలో కల్లబొల్లి మాటలతో మభ్య పెట్టి, గద్దెనెక్కాక ఎస్సీ, ఎస్టీలను టీడీపీ పెద్దలు చిన్నచూపు చూస్తున్నారు. గతంలో తొమ్మిదేళ్ల పాలన సాగించిన చంద్రబాబు.. అప్పట్లో విద్యుత్‌ చౌర్యం పేరుతో రైతులు, దళిత, గిరిజనులపై పలు రకాల కేసులు పెట్టించి భయభ్రాంతులకు గురి చేశారు. వైఎస్‌ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక ఆయా వర్గాలపై ఉన్న విద్యుత్‌ కేసులను రద్దు చేయడమే కాక ఎస్సీ, ఎస్టీ కాలనీలకు ఉచితంగా విద్యుత్‌ అందించారు.

అమలు కాని వంద యూనిట్లు
వంద యూనిట్ల వరకు ఎస్సీ, ఎస్టీల కుటుంబాలు ఉచితంగా విద్యుత్‌ వాడుకునేందుకు అవకాశం కల్పిస్తున్నట్లు టీడీపీ ప్రభుత్వం ప్రకటించింది. అయితే ఈ పథకం ఎక్కడా అమలు కావడం లేదు. విద్యుత్‌ వాడినా.. వాడకున్నా.. రూ. వేలల్లో బిల్లులు చూపుతూ బెదిరించి వసూలు చేస్తున్నారు. దీనికి తోడు విద్యుత్‌ చౌర్యం కేసులతో ముప్పేట దాడి మొదలు పెట్టారు. కంబదూరు మండలంలో ఇప్పటి వరకు నమోదు చేసిన 300 కేసుల్లో అత్యధికంగా ఎస్సీ, ఎస్టీ సామాజిక వర్గాలకు చెందిన వారిపైనే ఉండడం గమనార్హం. ఇందులో విద్యుత్‌ మీటర్లు వినియోగిస్తున్న వారు కూడా ఉన్నారు. ప్రతి నెలా తాము సక్రమంగా విద్యుత్‌ బిల్లులు చెల్లిస్తున్నా.. అక్రమంగా కేసుల పేరుతో వేధిస్తున్నారంటూ పలువురు వాపోతున్నారు. 

ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన ఈమె పేరు పద్మావతమ్మ. కంబదూరు గ్రామం. ఈమె ఇంటికి విద్యుత్‌ మీటర్‌ ఉంది. కొన్ని నెలల క్రితం కురిసిన వర్షానికి ఆ మీటర్‌ చెడిపోయింది. దీనిపై అప్పట్లోనే ఆమె సంబంధిత శాఖ అధికారులకు ఫిర్యాదు చేసింది. వారు మరమ్మతులు చేపట్టలేదు. మరో మీటర్‌ ఏర్పాటు చేయలేదు. పైగా పద్మావతమ్మ విద్యుత్‌ చౌర్యానికి పాల్పడుతున్నట్లు గత ఏడాది డిసెంబర్‌లో కేసు నమోదు చేసి, నోటీసులు జారీ చేశారు. అయోమయంలో ఉన్న ఆమెను సోమవారం విజిలెన్స్‌ పోలీసులు కలిసి సొమ్ము చెల్లించకపోతే కోర్టులో దోషిగా నిలబెడతామంటూ బెదిరించారు. దిక్కుతోచని ఆమె తెలిసిన వారి వద్ద రూ. వెయ్యి ఇప్పించుకుని అధికారులకు చెల్లించింది. ఇదే తరహాలో కంబదూరు మండల వ్యాప్తంగా ఎస్సీ, ఎస్టీ సామాజిక వర్గాలకు చెందిన పలువురిపై విద్యుత్‌ చౌర్యం కేసులు నమోదు చేసి వేధింపులకు గురి చేస్తున్నారు.

రూ.150కే విద్యుత్‌ కనెక్షన్‌
ప్రస్తుతం ఎస్సీ, ఎస్టీలకు జగ్జీవన్‌ జ్యోతి పథకం కింద రూ.150కే కొత్త విద్యుత్‌ సర్వీస్‌ను అందజేస్తున్నాం. ఎస్సీ, ఎస్టీలకు 100 యూనిట్ల వరకు ఉచితంగా విద్యుత్‌ వాడుకునే వెసులుబాటు ఉంది. అయితే చాలా మంది విద్యుత్‌ మీటర్లను వేసుకోలేదు. విద్యుత్‌ను చౌర్యం చేసిన వారిపై కేసులు పెడుతున్నాం.        – గురుమూర్తి,ఏఈ, ఏపీఎస్పీడీసీఎల్, కంబదూరు

మరిన్ని వార్తలు