తెలంగాణలో టీడీపీ విజయోత్సవాలు

23 Feb, 2014 01:56 IST|Sakshi
తెలంగాణలో టీడీపీ విజయోత్సవాలు

 తెలంగాణ తమ్ముళ్లతో బాబు సమావేశం.. పార్టీ ఖాళీ కాదని భరోసా
 రెండు ప్రాంతాల్లోనూ మేం గెలుస్తాం... కేంద్రంలో చక్రం తిప్పుతాం
 
 సాక్షి, హైదరాబాద్: తెలంగాణ వ్యాప్తంగా తెలంగాణ విజయోత్సవ సభలు నిర్వహించాలని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు అధ్యక్షతన జరిగిన ఆ పార్టీ టీ-నేతల విస్తృత సమావేశంలో నిర్ణయించారు. తొలి సభ ఈ నెల 25న వరంగల్‌లో, రెండో సభ 26న రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో నిర్వహించాలని తీర్మానించారు. ఎన్‌టీఆర్ భవన్‌లో జరిగిన ఈ సమావేశంలో చంద్రబాబు ప్రసంగిస్తూ.. తెలంగాణ ప్రాంతంలో తెలుగుదేశం పార్టీ ఖాళీ కాదని పార్టీ నేతలకు భరోసా ఇచ్చే ప్రయత్నం చేశారు. చంద్రబాబు రెండు కళ్ల సిద్ధాంతం, సమన్యాయం పేరుతో చేసిన ఆందోళనలతో పార్టీ ఇబ్బందికర పరిస్థితుల్లోకి వెళ్లటం.. ఒక్కో నేత పార్టీ నుంచి వెళ్లిపోతుండటం.. ఇంకా చాలా మంది వీడిపోతారని ప్రచారం జరుగుతుండటంతో.. పార్టీకి మంచి భవిష్యత్ ఉంటుందని తెలంగాణ నేతలకు నమ్మకం కలిగించే ందుకు చంద్రబాబు ప్రయత్నించారు. టీడీపీ ఖాళీ అవుతుందని ప్రచారం చేస్తున్న పార్టీలే ఖాళీ అవుతాయన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని పున ర్నిర్మించే శక్తి టీడీపీకే ఉందన్నారు.
 
 టీడీపీని దెబ్బతీయటానికే రాష్ట్రాన్ని విభజిస్తున్నారు..
 
 తెలంగాణ ప్రాంతం పార్టీకి ఆది నుంచి అండగా ఉందని, అందుకే ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు విషయంలో పార్టీ ఎప్పుడూ వెనక్కు పోలేదన్న చంద్రబాబు.. బలంగా ఉన్న టీడీపీని దెబ్బతీయాలనే ఏకైక లక్ష్యంతో రాష్ట్రాన్ని విభజిస్తున్నారని వ్యాఖ్యానించటం విశేషం. పలు పార్టీలు తొలుత చెప్పిన వైఖరి నుంచి పక్కకు జరిగినా తాము మాత్రం 2008లో తెలంగాణ ఏర్పాటు చేయాలని చెప్పిన మాటకు చివరి వరకూ కట్టుబడి ఉన్నామని బాబు పేర్కొన్నారు. వచ్చే సాధారణ ఎన్నికల్లో రెండు ప్రాంతాల్లోనూ తమ పార్టీ విజయం సాధిస్తుందని, జాతీయ రాజకీయాల్లో టీడీపీ చక్రం తిప్పటం ఖాయమని ధీమా వ్యక్తంచేశారు. దేశానికి పట్టిన శని కాంగ్రెస్ పార్టీ అని, దాన్ని తరిమి కొట్టాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించారు.
 
 పొత్తుపై చంద్రబాబే నిర్ణయిస్తారు: ఎర్రబెల్లి
 
 తెలంగాణ టీడీపీ ఫోరం కన్వీనర్ ఎర్రబెల్లి దయాకరరావు మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో బీజేపీ, వామపక్షాలు, ఫెడర ల్ ఫ్రంట్‌లలో దేనితో పొత్తు పెట్టుకోవాలో పార్టీ అధినేత చంద్రబాబు నిర్ణయిస్తారని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడటం టీఆర్‌ఎస్‌కు ఇష్టం లేదని, ఒకవేళ తెలంగాణ ఏర్పడకపోతే ఆ నెపం టీడీపీపై పెట్టి లబ్ధిపొందాలని టీఆర్‌ఎస్ యోచించిందని విమర్శించారు. సమావేశంలో చంద్రబాబు ప్రసంగిస్తున్న సమయంలో ఒక నాయకురాలు లేచి వ చ్చే ఎన్నికల్లో తెలంగాణలో మహిళలకు ఎన్ని సీట్లు ఇస్తారో చెప్పాలని కోరారు. చంద్రబాబు సమాధానం చెప్పకుండా దాటవేశారు. సమావేశంలో ఎనుముల రేవంత్‌రెడ్డి, రేవూరి ప్రకాష్‌రెడ్డి, రమేష్‌రాథోడ్ తదితరులు ప్రసంగించారు. నామా నాగేశ్వరరావు, టి.దేవేందర్‌గౌడ్, మోత్కుపల్లి నర్సింహులు, తలసాని శ్రీనివాసయాదవ్; ఎం.అరవిందకుమార్‌గౌడ్, మండవ వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. సమావేశానంతరం చంద్రబాబు జిల్లాల వారీగా సమీక్షలు నిర్వహించారు.  తెలంగాణకు అనుకూలంగా లేఖ ఇచ్చామని పైకి ఎంత గట్టిగా చెప్పుకుంటున్నప్పటికీ కిందిస్థాయిలో ప్రజల్లో పార్టీ పట్ల ఏమాత్రం నమ్మకం కలగటం లేదని పలువురు నేతలు చంద్రబాబుకు నేరుగా చెప్పినట్టు తెలిసింది.
 

మరిన్ని వార్తలు