ఓటమి భయం

16 Sep, 2018 09:34 IST|Sakshi

ప్రజల్లో పెరిగిన వ్యతిరేకత 

టీడీపీలో భయం భయం

అభ్యర్థుల మార్పు కోసం సర్వేలు

మారుస్తామంటూ సంకేతాలు

మార్కాపురం నుంచి మంత్రి శిద్దా ?

దర్శి నుంచి కరణం వెంకటేశ్‌ ?

అద్దంకి నుంచి ఎమ్మెల్యే ఏలూరి ?

మరోవైపు తిరుగుబాటు భయం

ఎటూ తేల్చకోలేని అధిష్టానం 

సాక్షి ప్రతినిధి, ఒంగోలు: ప్రతిపక్ష వైఎస్సార్‌ కాగ్రెస్‌ పార్టీకి జిల్లాలో రోజురోజుకూ ఆదరణ పెరుగుతుండడం, అదే సమయంలో క్షేత్ర స్థాయిలో టీడీపీ పట్ల వ్యతిరేకత పెరుగుతుండడంతో అధికార టీడీపీకి ఓటమి భయం పట్టుకుంది. దీంతో రాబోయే ఎన్నికల కోసం టీడీపీ అధిష్టానం సర్వేల మీద సర్వేలు చేయించుకొంటోంది. ఎవర్ని నిలిపితే గట్టెక్కుతామో అర్థం కాక  సర్వేలపై ఆధారపడుతోంది. జిల్లాలోని 80 శాతం నియోజకవర్గాల్లో ప్రస్తుత ఎమ్మెల్యేలు ఆదరణ కోల్పోయినట్లు సర్వే నివేదికలు స్పష్టం చేసినట్లు సమాచారం. దీంతో అభ్యర్థులను మార్చాలని టీడీపీ అధిష్టానం భావిస్తోంది. అదే సమయంలో కొత్త అభ్యర్థులకు పాత

నేతలు సహకరించే పరిస్థితి కానరావడం లేదు. ఇది వారిని మరింత ఇరుకున పెడుతోంది. ప్రధానంగా అధికార పార్టీ ఎమ్మెల్యేలు అవినీతి అక్రమాలు జిల్లాలో మరింతగా పెరిగాయి. ఒకరిద్దరు మినహా మిగిలిన వారు  ప్రతిపనికీ  పది నుంచి 15 శాతం వరకూ కమీషన్లు పుచ్చుకుంటున్నారు. క్షేత్ర స్థాయిలోనూ నేతలు సంక్షేమ పథకాల లబ్ధిదారుల నుంచి అందినకాడికి దండుకుంటున్నారు. జిల్లాకు సంబంధించి స్థానిక నేతలతోపాటు సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబు ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటీ నెరవేర్చలేదు. ఇది ఆ పార్టీని మరింత ఇరుకున పెడుతోంది.  దీంతో వారి క్యాడర్‌ తో పాటు ప్రజల్లో  తీవ్ర వ్యతిరేకత పెళ్లుబుకుతోంది. ఇదే విషయం సర్వేల్లోనూ ప్రతిబింబించినట్లు సమాచారం. దీంతో పలు నియోజకవర్గాల్లో అభ్యర్థులను మార్చి  ఎన్నికల బరిలో నిలవాలని టీడీపీ భావిస్తున్నట్లు సమాచారం. ఇందులో భాగంగా  అధిష్టానం కసరత్తు చేపట్టినట్లు  ఆ పార్టీ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది. కొందరు ఎమ్మెల్యేలను అటూ ఇటూ మార్చడంతో పాటు మరికొందరికి ఉద్వాసన పలకాలని నిర్ణయించినట్లు సమాచారం. ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యేల పనితీరును  బేరీజువేసిన అధిష్టానం ఇటీవల  అమరావతిలో జరిగిన సమావేశంలో నివేదికను ఎమ్మెల్యేల ముందుంచింది. వారి పనితీరును  సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబు నేతలకు తెలియజెప్పి పద్ధతి మార్చుకోవాలని, లేకపోతే సీటు గల్లంతే అని  చెప్పినట్లు సమాచారం. 

యర్రగొండపాలెం ఎమ్మెల్యే  డేవిడ్‌రాజును వచ్చే ఎన్నికల్లో  యర్రగొండపాలెం నుంచి తప్పించి ఆయన స్థానంలో గతంలో  ప్రకాశం జిల్లా కలెక్టర్‌గా పనిచేసిన వ్యక్తిని పోటీలో నిలపాలని చంద్రబాబు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఎమ్మెల్సీ మాగుంట శ్రీనివాసులురెడ్డి సైతం ఇదే ప్రతిపాదన తెచ్చినట్లు సమాచారం. యర్రగొండపాలెం టికెట్‌ ఇవ్వని పక్షంలో డేవిడ్‌రాజు తో పాటు ఆయనవర్గం కొత్త అభ్యర్థికి సహకరించే పరిస్థితి  లేదు. 

♦ ఇక కనిగిరి ఎమ్మెల్యే బాబూరావు పనితీరుపైనా సీఎం మండిపడినట్లు సమాచారం. కమీషన్ల వ్యవహారంతోపాటు  బాబూరావు కనిగిరిలో ప్రజలకు అందుబాటులో ఉండక హైదరాబాదులో ఉంటుండడం వల్ల ప్రజల్లో వ్యతిరేకత వచ్చిందని సీఎం ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.  మరోవైపు ఇప్పటికే కనిగిరి నుంచి మాజీ ఎమ్మెల్యే ఉగ్రనరసింహారెడ్డికి టీడీపీ టికెట్‌ ఇస్తారన్న ప్రచారం సాగుతోంది. ఇప్పటికే ఉగ్ర సీఎంతో సైతం పలుమార్లు సమావేశమయ్యారు.  ఉగ్రను టీడపీ అభ్యర్థిగా ఎంపిక చేస్తే బాబూరావు సహకరించరన్న ప్రచారమూ ఉంది.

♦ కొండపి టీడీపీ రచ్చ జిల్లాలో  చర్చనీయాంశంగా ఉంది.  ఈ సారి ఎన్నికల్లో  ఎమ్మెల్యే స్వామికి  టీడీపీ జిల్లా అధ్యక్షుడు దామచర్ల జనార్ధన్, కందుకూరు ఎమ్మెల్యే పోతుల రామారావు వర్గాలు సహకరించే పరిస్థితి  కానరావడంలేదు. ఇప్పటికే  కొండపి టీడీపీ అభ్యర్థిగా  జూపూడి ప్రభాకరరావును నిలపాలని దామచర్ల పావులు కదుపుతున్నట్లు  ప్రచారం ఉంది. అదే జరిగితే ఎమ్మెల్యే స్వామితోపాటు దామచర్ల సత్య కుటుంబం వ్యతిరేకంగా  పనిచేసే అవకాశముంది.

♦ సంతనూతలపాడు టీడీపీలో వర్గ విభేదాలు ఏకంగా ముఖ్యమంత్రికి పాకాయి. ఇక్కడి ముఖ్యమంత్రి సామాజికవర్గం నేతలు  ఏకమై మాజీ ఎమ్మెల్యే విజయకుమార్‌ను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. విజయకుమార్‌ను మార్చే పక్షంలో ఆయన వర్గం టీడీపీ విజయం కోసం పనిచేసే పరిస్థితి లేదు.

♦ మార్కాపురంలోనూ ఈ దఫా అభ్యర్థిని మారుస్తారన్న ప్రచారం సాగుతోంది. మంత్రి శిద్దా రాఘవరావును  మార్కాపురం నుంచి పోటీ చేయిస్తారన్న ప్రచారం ఉంది. ఇదే జరిగితే కందుల వర్గం టీడీపీ అభ్యర్థి విజయం కోసం  పనిచేసే పరిస్థితి  కానరావడం లేదు.

♦ దర్శి రాజకీయాల్లోనూ  మార్పులు జరిగే అవకాశమున్నట్లు తెలుస్తోంది. మంత్రి శిద్దా రాఘవరావును మార్కాపురం లేదా నరసరావుపేట  పార్లమెంట్‌ నుంచి పోటీ చేయించి కరణం బలరాం తనయుడు కరణం వెంకటేశ్‌ను దర్శి టీడీపీ అభ్యర్థిగా నిలుపుతారన్న  ప్రచారమూ ఉంది.

♦ అద్దంకి రాజకీయాలు గందరగోళంగా ఉన్నాయి. వైఎస్సార్సీపీ  నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన  గొట్టిపాటి రవికుమార్‌ ఆ తరువాత టీడీపీలో చేరారు. అద్దంకి బాధ్యతలు గొట్టిపాటికే అప్పగిస్తున్నట్లు  ఒక దశలో సీఎం ప్రకటించారు. కొద్ది కాలం అద్దంకి రాజకీయాలకు దూరంగా ఉన్న  కరణం కుటుంబం  మళ్లీ అద్దంకి రాజకీయాల్లో క్రియాశీలకంగా పాల్గొంటోంది. పై పెచ్చు  అద్దంకి నుంచే పోటీలో ఉంటామంటూ వారు ప్రకటించడంతో మరింత గందరగోళం నెలకొంది. ఒక దశలో  పర్చూరు ఎమ్మెల్యే ఏలూరు సాంబశివరావును అద్దంకిలో నిలిపి గొట్టిపాటిని పర్చూరు పంపుతారన్న ప్రచారమూ సాగింది. అయితే  చంద్రబాబు అద్దంకి నుంచి ఎవరిని బరిలో నిలుపుతారన్నది  వేచిచూడాల్సిందే.  మొత్తంగా ఓటమి భయం నేపథ్యంలో  జిల్లా టీడీపీలో రాబోయే ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపిక ఆ పార్టీ అధిష్టానానికి మరింత తలనొప్పిగా మారింది.

మరిన్ని వార్తలు