నంద్యాలలో ‘దేశం’ దిగజారుడు రాజకీయం

13 Jul, 2017 01:48 IST|Sakshi
నంద్యాలలో ‘దేశం’ దిగజారుడు రాజకీయం

నంద్యాల ఉప ఎన్నికలో గెలుపు కోసం టీడీపీ అడ్డదారులు ∙
మంత్రుల తిష్ట.. ప్రలోభాలు, పదవుల ఎర
మాట వినకపోతే బెదిరింపులు.. హెచ్చరికలు
అర్ధ్దరాత్రిళ్లు పోలీసుల సోదాలలో భయపెడుతున్న వైనం
కులాల వారీగా తాయిలాలు, నజరానాలకు వ్యూహం


ఇప్పుడు కాకపోతే మరెప్పుడూ కాదన్నట్లు తయారైంది టీడీపీ పరిస్థితి. ప్రభుత్వ నిధులతో పాటు అడ్డంగా సంపాదించిన అక్రమ డబ్బులూ వెదజల్లుతోంది. ప్రలోభపెట్టి గల్లీ లీడర్లను లొంగదీసుకుంటోంది. కాదు కూడదంటే కేసులు పెడతామంటూ బెదిరిస్తోంది. విలువలను తుంగలో తొక్కి అన్ని అడ్డదారులనూ వెదుకుతోంది. మంత్రులనూ రంగంలోకి దింపి కుట్రలు, కుతంత్రాలకు పావులు కదిపింది. నిజానికి టీడీపీకి తన విధానాలపై నమ్మకం ఉండి ఉంటే పార్టీ ఫిరాయించిన మిగతా 20 మంది ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లోనూ ఉప ఎన్నికలు పెట్టి ఉండేది. తప్పని పరిస్థితిలో జీవన్మరణ సమస్యగా నంద్యాలలో గెలుపు కోసం సర్వశక్తులూ ఒడ్డి పడరాని పాట్లు పడుతోంది.

సాక్షి ప్రతినిధి, కర్నూలు : కర్నూలు జిల్లా నంద్యాల అసెంబ్లీ స్థానానికి జరిగే ఉప ఎన్నికలో గెలుపొందడం కోసం చంద్రబాబు ప్రభుత్వం దిగజారి వ్యవహరిస్తుండటం ప్రజాస్వామ్య స్ఫూర్తికే కళంకం తెస్తోంది. దేశానికి ఒక రాష్ట్రపతిని,  ఒక ప్రధానిని అందించిన ప్రాంతమిది. భారతదేశ తొలి స్వాతంత్య్ర సంగ్రామంలో బ్రిటీష్‌ వారిని ఎదిరించి పోరాడిన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి తిరుగాడిన నేల ఇక్కడికి కూతవేటు దూరం. ఇంతటి రాజకీయ చైతన్య వేదికపై చంద్రబాబు సర్కారు సాగిస్తున్న కుత్సిత రాజకీయం ఏవగింపు కలిగిస్తోంది. ప్రలోభాలు, బెదిరింపులు, దాడులతో పాటు ఉప ఎన్నిక షెడ్యూల్‌ విడుదల అయితే ఇబ్బంది అని అభివృద్ధి పనులంటూ హడావుడి చేస్తోంది. ప్రతిపక్ష కార్యకర్తలు, ఓటర్ల కొనుగోలుకు రూ.100 కోట్లు కేటాయించారని టీడీపీ నేతలే చెప్పుకుంటున్నారు. ఒక్క నంద్యాల ఉప ఎన్నిక కోసమే ఇంతగా ఖర్చు చేస్తుంటే.. రేపటి ఎన్నికల్లో 175 నియోజకవర్గాల్లో  ఎన్ని వేల కోట్లు వెదజల్లుతుందోనని ప్రజలు చర్చించుకుంటున్నారు.

మాట వింటే సరి.. లేదంటే బెదిరింపులే
నంద్యాల ఉప ఎన్నికలో గెలవడానికి అధికార పార్టీ అరాచకాలకు అడ్డే లేకుండా పోయింది. పార్టీ మారేందుకు సిద్ధపడే నేతలకు తాయిలాలను ప్రకటిస్తోంది. ఒకవేళ పార్టీ మారేందుకు ముందుకు రాకపోతే అర్దరాత్రి వేళల్లో పోలీసులతో సోదాలు నిర్వహిస్తూ బెదిరింపులకు దిగుతోంది. నంద్యాలను ఎంతో అభివృద్ధి చేస్తున్నామంటూ ప్రతి రోజూ ఇద్దరు, ముగ్గురు మంత్రులు పర్యటిస్తూ ప్రజలకు పట్టపగలే చుక్కలు చూపించే యత్నం చేస్తున్నారు. రూ.1100 కోట్లతో నంద్యాలను అభివృద్ధి చేస్తున్నామని మంత్రులు ప్రతీ రోజూ ఊదరగొడుతున్నారు. రోడ్ల విస్తరణతో పాటు వివిధ అభివృద్ధి పనులు చేపడతామని ప్రకటిస్తున్నారు. టీడీపీలోకి వలువురు చోటా మోటా నేతలను చేర్చుకునేందుకు మంత్రులు వారి ఇంటి చుట్టూ తిరుగుతున్నారు.

 నేతల స్థాయిని బట్టి భారీ ప్యాకేజీలు ప్రకటిస్తున్నారు. కొద్ది మందికి ప్యాకేజీతో పాటు పదవులను కూడా కట్టబెడుతున్నారు. మాట వినని, పార్టీ మారమని తెగేసి చెప్పిన ప్రతిపక్ష పార్టీ నేతలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. పార్టీ మారిన కౌన్సిలర్లు తిరిగి టీడీపీలోకి రావాలని లేనిపక్షంలో అనర్హత వేటు వేస్తామని భయపెట్టారు. ఏకంగా మునిసిపల్‌ చైర్‌పర్సన్‌ను దించేస్తామని హెచ్చరిస్తున్నారు. అది వీలుకాదని తెలిసి పలువురు కౌన్సిలర్ల ఇళ్లపై అర్ధరాత్రిళ్లు దాడులు చేసి భయభ్రాంతులకు గురిచేసే ప్రయత్నం చేస్తున్నారు. ఆయుధాలు, డబ్బు ఉన్నాయని అక్రమ కేసులు పెడతామనే రీతిలో పోలీసుల ద్వారా భయపెట్టే యత్నాలూ సాగిస్తున్నారు. తుదకు ఇవన్నీ ఫలితం ఇవ్వబోవని భావించి.. అభివృద్ధి నమూనా అంటూ తెరపైకి తెచ్చారు.  

ఒత్తిళ్లు.. ప్రలోభాలు
నంద్యాల ఉప ఎన్నికల్లో గెలిచే పరిస్థితి లేదనుకున్న సీఎం చంద్రబాబు తొలుత ఏకంగా ప్రజలపైనే బెదిరింపులకు దిగారు. నంద్యాల పర్యటన సందర్భంగా ‘నేను వేసిన రోడ్లపై నడుస్తూ, నేను ఇచ్చిన పింఛన్‌ తీసుకుంటూ నాకు ఓటు వేయరా’ అని ప్రశ్నించారు. ఓటు వేయకపోతే పింఛను తీసుకోవద్దని.. రోడ్లపై నడవద్దని హూంకరించారు. ఇక్కడితో మొదలైన బెదిరింపుల పర్వం కాస్తా ప్రలోభాలకూ దారి తీసింది. మరోవైపు ఓటుకు తాను రూ.5 వేలైనా ఇవ్వగలనని పేర్కొనడం ద్వారా నంద్యాల ఉప ఎన్నికల్లో నిధుల వరద పారించనున్నట్టు చంద్రబాబు స్పష్టం చేశారు. వైఎస్సార్‌ కాంగ్రెస్‌పార్టీకి చెందిన కౌన్సిలర్‌ ఇంట్లో అర్ధరాత్రి సమయంలో సోదాలు నిర్వహించారు.

పార్టీ మారావు కదా అని బెదిరింపులకు దిగారు. పక్కనే ఉన్న బంధువుల ఇళ్లల్లోనూ సోదాలు నిర్వహించారు. బలవంతంగా తలుపులు తెరిపించి, ఇంటిలో ఆయుధాలు, కోట్ల డబ్బు ఉందంటూ పోలీసులు దౌర్జన్యానికి తెగబడ్డారు. ఇదే రీతిలో పలువురిపై పార్టీ మారాలంటూ తీవ్రస్థాయిలో ఒత్తిళ్లు చేస్తున్నారు. తప్పులను ఎత్తిచూపితే సొంత పార్టీకి చెందిన నేతలకు కూడా బెదిరింపుల పర్వం తప్పడం లేదు. గతంలో ఆర్యవైశ్య వర్గానికి చెందిన గంగిశెట్టి విజయ్‌కుమార్‌పై జరిగిన దాడి వివరాలను సామాజిక మాధ్యమాల్లో షేర్‌ చేసిన మైనార్టీ నేత ఎంబీటీ బాబును ఫోన్‌లో అధికార పార్టీ నేత ఏవీ సుబ్బారెడ్డి బెదిరించారు.

ఏకంగా ‘చెప్పుతో కొడతా నా కొ....’ అని బెదిరించారు. తాను మంచోడిని కాదని, పోలీసులకూ భయపడనని అంతుచూస్తామని హెచ్చరించారు. ప్రజాదరణ ఉన్న మార్క్‌ఫెడ్‌ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పీపీ నాగిరెడ్డికి అనేక ఆశలు చూపుతూ పార్టీ మారాలని  మంత్రులు ఒత్తిళ్లు తెస్తున్నారు. మరోవైపు పార్టీ మారే వారికి భారీగా నజరానాలతో పాటు పదవుల ఆఫర్లు ఇస్తున్నారు. ఇన్నాళ్లుగా కనీసం పట్టించుకోని మాజీ మంత్రి ఫరూక్‌కు  గవర్నర్‌ కోటాలో ఎమ్మెల్సీ ప్రకటించాలని నిర్ణయించారు.

 ఇక నౌమోన్‌ను ఉర్దూ అకాడమీ చైర్మన్‌గా నియమించారు. మైనార్టీల ఓట్లకు గాలం వేసేందుకు ఈ చర్యలు తీసుకున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. గతంలో టీడీపీ జిల్లా అధ్యక్షుడిగా ప్రకటించి.. ఇవ్వకుండా మరీ అవమానించిన సోమిశెట్టి వెంకటేశ్వర్లుకే మళ్లీ జిల్లా అధ్యక్ష పగ్గాలు అప్పగించారు. ‘కుడా’ చైర్మన్‌గా కూడా ప్రకటించి ఆర్యవైశ్య ఓట్లకు గాలం  వేస్తున్నారు. ఇక కులాల వారీగా సంక్షేమ పథకాలు ప్రకటిస్తూ ఆకర్షించే ప్రయత్నాలకు అధికార పార్టీ తెరలేపింది.  

అనుకూల అధికారుల నియామకం
నంద్యాల ఉప ఎన్నిక నేపథ్యంలో అధికా ర పార్టీ అనుకూల అధికారులను జిల్లాలో నియమించుకుంది. పోలీసు యంత్రాం గంలో డీఐజీ మొదలు, డీఎస్పీ.. సీఐల వరకు అనుకూలంగా వ్యవహరించే అధి కారులను నియమించుకుందన్న ఆరోప ణలు వినిపిస్తున్నాయి. జిల్లాలో చాలా రోజులుగా ఉన్న ఓ డీఎస్పీని బదిలీ చేయకుండా కేవలం నంద్యాల డీఎస్పీని మాత్రమే బదిలీ చేయడం గమనార్హం.  నంద్యాల నియోజకవర్గంలో సీఐగా నియ మితులైన ఒక అధికారిని కాదని ఆయన స్థానంలో రాత్రికి రాత్రే మరో అధికారిని నియమించారు. తద్వారా ఉప ఎన్నికల్లో పోలీసులను ప్రయోగించి ప్రతిపక్ష నేతలను, కార్యకర్తలను భయపెట్టి గెలవాలని అధికార పార్టీ భావిస్తోంది.

మరిన్ని వార్తలు