టీడీపీ కమిటీల తీర్మానాల మేరకే పల్లెల్లో అభివృద్ధి

22 May, 2015 03:11 IST|Sakshi

- జూన్‌లో ఖరీఫ్ నారుమళ్లకు నీరు
- రానున్న నాలుగేళ్లలో సాగర్ పనులకు రూ.2 వేల కోట్ల నిధులు
- మినీ మహానాడులో మంత్రి దేవినేని ఉమ
కంచికచర్ల :
తెలుగుదేశం పార్టీ గ్రామ కమిటీల తీర్మానాల మేరకు పల్లెల్లో అభివృద్ధి పనులు జరుగుతాయని రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. అందుకనుగుణంగా నిధులు మంజూరు చేయటం జరుగుతుందని ఆయన చెప్పారు. మండలంలోని పరిటాల శివారు దొనబండ ఉమా హాలిడే ఇన్స్‌లో గురువారం జిల్లా స్థాయి మినీ మహానాడు నిర్వహించారు. ఈ సమావేశానికి పార్టీ జిల్లా అధ్యక్షుడు బచ్చుల అర్జునుడు అధ్యక్షత వహించారు.

ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి ఉమ మాట్లాడుతూ గ్రామాల్లో సీసీ రోడ్లు, డొంక రోడ్ల అభివృద్ధి, తాగునీటి పథకం తదితర పనులకు ప్రాధాన్యత క్రమంలో కాకుండా పార్టీ సూచించిన మేరకే నిధులు మంజూరు చేయడం జరుగుతుందని చెప్పారు. పార్టీలో పెత్తనాలు చేసే నాయకులకు పనులు చేయబోమని, పార్టీ కోసం పనిచేసే కార్యకర్తలకే చేస్తామని తెలిపారు. జూన్‌లో డెల్టాలోని నారుమళ్లకు కృష్ణానదీ జలా లు అందిస్తామని, రానున్న నాలుగేళ్ల కాలంలో నాగార్జునసాగర్ కాల్వల పనులకు రూ.2 వేల కోట్ల నిధులు మంజూరు చేస్తామని వివరించారు.

టీడీపీ హయాంలో అభివృద్ధికి కృషి...
జిల్లా ఇన్‌చార్జి మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు మాట్లాడుతూ కాంగ్రెస్ పాలనలో అభివృద్ధి కుంటుపడిందని, టీడీపీ అధికారంలోకి వచ్చాక అభివృద్ధికి కృషిచేస్తోందని చెప్పారు.  రైతులకు రూ.23 వేల కోట్ల రుణాలు మాఫీ చేసినట్లు చెప్పారు.

టీడీపీపై బీజేపీ కన్ను...
ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ మిత్రపక్షమైన బీజేపీ ప్రభుత్వం టీడీపీపై కన్నేసిందని చెప్పారు. పార్టీ కార్యకర్తలు జాగ్రత్తగా ఉండాలన్నారు. ఎన్నికల అనంతరం పార్టీ అధికారంలోకి వచ్చాక కూడా కార్యకర్తల్లో నిరుత్సాహం ఉందన్నారు.  

గుంటూరుపై చంద్రబాబుకు ప్రేమ...
ఎంపీ కేశినేని శ్రీనివాస్ (నాని) మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు గుం టూరు జిల్లాపై ప్రేమ ఉందని, అందుకే రాజధాని నిర్మాణం ఆ జిల్లాలో ఏర్పాటు చేస్తున్నారని చెప్పారు. గుంటూరు జిల్లాకు సీఎం ఆశీస్సులుంటే కృష్ణాజిల్లాకు ప్రజల ఆశీస్సులు ఉన్నాయన్నారు. కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ గద్దె అనూరాధ, మచిలీపట్నం ఎంపీ కొనకళ్ల నారాయణ, ఎమ్మెల్సీ ఏఎస్ రామకృష్ణ, ఎమ్మెల్యేలు తంగిరాల సౌమ్య, బోడె ప్రసాద్, వల్లభనేని వంశీ, శ్రీరాంరాజగోపాల్, విజయవాడ మేయర్ శ్రీధర్, మాజీ ఎమ్మెల్యేలు రావి వెంకటేశ్వరరావు, జయమంగళ వెంకటరమణ, నల్లగట్ల స్వామిదాసు, కమ్మిలి విఠల్‌రావు, జెడ్పీ మాజీ చైర్‌పర్సన్ నల్లగట్ల సుధారాణి, నాయకులు వర్ల రామయ్య, గొట్టిపాటి రామకృష్ణ, ఆచంట సునీత తదితరులు పాల్గొన్నారు.

నేతల గైర్హాజరుపై ఉమ రుసరుస
పశ్చిమ కృష్ణా నేతలకే ఎక్కువ పదవులు దక్కుతుండటంతో తూర్పు కృష్ణాకు చెందిన ద్వితీయ శ్రేణి నాయకులు మినీ మహానాడుకు దూరంగా ఉన్నారు. వీరుగైర్హాజరవడంతో సభా ప్రాంగణం వెలవెలబోయింది. దీంతో మంత్రి ఉమ రుసరుసలాడారు.  కార్యకర్తలు లేక కుర్చీలు ఖాళీగా దర్శనమిచ్చాయి.

మరిన్ని వార్తలు