టీడీపీ కుట్ర

9 Mar, 2015 03:17 IST|Sakshi

అనంతపురం అగ్రికల్చర్ :  పెద్దవడుగూరు మండలం కిష్టపాడు ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం (పీఏసీఎస్) అధ్యక్ష పీఠాన్ని అడ్డదారుల్లో కైవసం చేసుకునేందుకు టీడీపీ కుట్ర చేస్తోంది. గతంలో సొసైటీ పరిధిలోని 13 డెరైక్టర్ స్థానాలకు ఎన్నికలు నిర్వహించారు. మెజార్టీ స్థానాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులు విజయం సాధించారు. దీంతో ఆ పార్టీకి చెందిన అప్పేచెర్ల విజయభాస్కర్‌రెడ్డి సొసైటీ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు.
 
 ఇటీవల గోపాల్‌రెడ్డి అనే డెరైక్టర్ చనిపోవడంతో డెరైక్టర్ల సంఖ్య 12కు చేరింది. దీన్ని ఆసరాగా చేసుకుని అధ్యక్ష పీఠాన్ని ఎలాగైనా చేజిక్కించుకునేందుకు టీడీపీ నేతలు రంగంలోకి దిగారు. కొందరు డెరైక్టర్లను ప్రలోభాలకు గురి చేశారు. అధ్యక్షుడికి మెజార్టీ లేదంటూ అవిశ్వాస తీర్మానం నోటీసు ఇప్పించారు. సోమవారం అవిశ్వాస తీర్మానం జరగనుంది. వాస్తవానికి నోటీసు ఇవ్వాలంటే తొమ్మిది మంది డెరైక్టర్ల సంతకాలు తప్పినిసరి. అయితే, ఏడుగురి సంతకాలతోనే నోటీసు ఇచ్చినా.. అధికారులు ఆమోదముద్ర వేయడం గమనార్హం. ఈ ఏడుగురిలోనూ కంబన్న అనే డెరైక్టర్ అవిశ్వాస తీర్మానం నోటీసుపై వేలిముద్ర వేయలేదని, వేరొక వ్యక్తితో వేయించి కంబన్నవిగా చూపారని కొందరు డెరైక్టర్లు ఆరోపిస్తున్నారు.
 
 రెండు వర్గాల్లో ఆరుగురు చొప్పున డెరైక్టర్లు
 ప్రస్తుతం టీడీపీ, వైఎస్సార్‌సీపీ శిబిరాల్లో ఆరుగురు చొప్పున డెరైక్టర్లు ఉన్నారు. వైఎస్సార్‌సీపీకి చెందిన చింతలచెరువు శేషు, రావులుడికి జయశంకర్, అప్పేచెర్ల విజయభాస్కర్‌రెడ్డి, జయరామిరెడ్డి, భీమునిపల్లి కంబన్న, రావులుడికి రామలక్ష్మమ్మ అవిశ్వాస తీర్మానానికి గైర్హాజరు కానున్నారు.
 
 ఈ విషయాన్ని కొందరు డెరైక్టర్లు  ఫోన్ ద్వారా ‘సాక్షి’కి తెలిపారు. ఈ క్రమంలోనే టీడీపీ నాయకులు పెద్ద కుట్రకు వ్యూహం పన్నినట్లు వారు వివరించారు. తాము అందుబాటులో లేకపోయినా తమ పేర్లతో బయటి వ్యక్తులను డెరైక్టర్లుగా హాజరుపరిచి.. ఓటింగ్ నెగ్గాలని చూస్తున్నారని వారు తెలిపారు.  కాబట్టి సొసైటీ సీఈవో దాదాపీర్, డివిజనల్ సహకార అధికారి (డీఎల్‌సీవో) ఇ.అరుణకుమారి అప్రమత్తంగా వ్యవహరించాలని వారు సూచించారు. డెరైక్టర్లుగా ఎన్నికైన తర్వాత గుర్తింపుకార్డులు ఇచ్చారని, వాటితో పాటు ఆధార్‌కార్డులను పరిశీలించి డెరైక్టర్లు ఎవరనేది గుర్తించాలని వారు తెలిపారు.
 
 ఈ క్రమంలో అధికారులు ఎలా వ్యవహరిస్తారనేది అంతుచిక్కడం లేదు. అవిశ్వాస తీర్మానం ముందుకెళ్లాలంటే కచ్చితంగా ఏడుగురు డెరైక్టర్లు హాజరుకావాలి. లేదంటే కోరం సమస్య తలెత్తుతుంది. తీర్మానం మరుసటి రోజుకు వాయిదా పడుతుంది. మరుసటి రోజు కూడా కోరం లేకపోతే ప్రస్తుతమున్న పాలకవర్గాన్నే కొనసాగించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో సోమవారం జరిగే అవిశ్వాస తీర్మానానికి హాజరయ్యే డెరైక్టర్లను గుర్తించడానికి అధికారులు చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరముంది.
 

మరిన్ని వార్తలు