బలవంతంగా డ్వాక్రా మహిళల తరలింపు

30 Sep, 2018 07:59 IST|Sakshi
హైవేపై భారీగా నిలిచిన వాహనాలు

రాకపోతే రుణాలు ఇవ్వమని టీడీపీ నేతల బెదిరింపులు

తాగునీరు కూడా లేక అవస్థలు 

 రోడ్డు మీదే నాయకులను తిట్టిపోసిన మహిళలు

తణుకు : ధర్మపోరాట దీక్ష పేరుతో ముఖ్యమంత్రి చంద్రబాబు ఆధ్వర్యంలో శనివారం తాడేపల్లిగూడెంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభ అన్ని వర్గాలను ఇబ్బందులపాల్జేసింది. జిల్లా వ్యాప్తంగా డ్వాక్రా మహిళలను భారీగా తరలించాలని ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. అందుకు అనుగుణంగానే డ్వాక్రా మహిళలను నయానో భయానో బెదిరించి ఆర్టీసీ, స్కూల్‌ బస్సులు ఏర్పాటు చేసి బలవంతంగా వారిని సభాస్థలికి తరలించారు. అయితే చాలామంది మహిళలు సభాస్థలికి వెళ్లకుండానే బస్సుల్లోనే సేదతీరారు. మండుటెండలో ఇదేం ఖర్మరాబాబూ అనుకుంటూ తిరిగి ఇంటిముఖం పట్టారు. డ్వాక్రా సంఘాల్లోని మహిళలను భారీఎత్తున తరలించాలని అధికారులు మొదట్నుంచీ ప్రణాళికలు తయారు చేశారు. ఆయా గ్రామాలు, వార్డుల్లోని మహిళలను సంఘాలు వారీగా సమన్వయం చేసి వారికి మధ్యాహ్నం భోజన ఏర్పాట్లు చేశారు. వీరిని ప్రభుత్వం ఏర్పాటు చేసిన బస్సుల్లో తాడేపల్లిగూడెంలోని సభాస్థలికి తరలించారు. 

తిరుగు ప్రయాణం నరకం
ధర్మపోరాట దీక్షలో చంద్రబాబు మాట్లాడుతుండగానే మహిళలు బయటకు వచ్చి వారిని తీసుకువచ్చిన బస్సులను వెతుక్కునే పనిలో పడ్డారు. తణుకువైపు నుంచి వెళ్లిన బస్సులను ప్రత్తిపాడు జంక్షన్‌ వద్ద నిలిపివేశారు. అయితే అక్కడి నుంచి హైవే వెంబడి అలంపురం వరకు బస్సులను నిలిపివేయడంతో వారిని తీసుకువచ్చిన బస్సులు ఎక్కడ ఉన్నాయో తెలియక మహిళలు దిక్కుతోచని స్థితిలో నడిరోడ్డుపై పడిగాపులు పడ్డారు. సభాస్థలి నుంచి కిలోమీటర్లు మేర నడిచిన మహిళలు తమ వాహనాలు వెతుక్కునేందుకు అవస్థలు పడ్డారు. 

అయితే కొన్ని వాహనాలు కనిపించకపోవడంతో కార్యకర్తలు, మహిళలు చీకట్లోనే నడుచుకుంటూ గమ్యస్థానాలకు బయల్దేరారు. మరోవైపు సాధారణ ప్రయాణికులు సైతం తీవ్ర అవస్థలు పడ్డారు. మహిళలు, కార్యకర్తలను తరలించేందుకు వచ్చిన బస్సులు ఎక్కడికక్కడే నిలిపివేయడంతో హైవేపై ట్రాఫిక్‌ భారీగా స్తంభించిపోయింది. ప్రత్తిపాడు నుంచి తణుకు మండలం దువ్వ గ్రామం వరకు ట్రాఫిక్‌ నిలిచిపోవడంతో లారీలు, ఆర్టీసీ బస్సులు, కారులు పెద్ద ఎత్తున నిలిచిపోయాయి. బస్సుల్లోని చిన్నారులు, వృద్ధులు, గర్భిణులు తీవ్ర అవస్థలు పడ్డారు. తాడేపల్లిగూడెం నుంచి తణుకు రావడానికి గంటన్నర సమయం పట్టడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

మరిన్ని వార్తలు