చంద్రబాబు వద్దకు టీడీపీ పంచాయితీ!

27 Dec, 2014 11:08 IST|Sakshi

విజయవాడ: బెజవాడలో ఆధిపత్య పోరుపై చిచ్చు మరింత రాజుకుంది.  నగరంలో టీడీపీ నేతల మధ్య చాపకింద నీరులా మారిన విభేదాలు తారాస్థాయికి చేరడంతో ఆధిపత్య పంచాయితీ టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు చెంతకు చేరింది. కేశినేని నాని నిన్నటి వ్యాఖ్యలపై అధిష్టానం సీరియస్ కావడంతో బాబును కలిసేందుకు నాని నిశ్చయించుకున్నారు. కార్యకర్తల్లో ఉన్న అసంతృప్తిని బాబు వద్దకు తీసుకువెళ్లాలనే యోచనలో నాని ఉన్నారు. గత ఆరు నెలల్లో ఉమ వ్యవహారశైలికి సంబంధించి బాబుకు నాని ఫిర్యాదు చేయనున్నారు.

శుక్రవారం మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, ఇతర ప్రజాప్రతినిధుల మధ్య చాప కింద నీరులా పాకుతున్నవిభేదాలు బహిర్గతం అయిన సంగతి తెలిసిందే. ఆటోనగర్‌లో జరిగిన సీవరేజి ప్లాంటు ప్రారంభోత్సవంలో విజయవాడ ఎంపీ కేశినేని నాని మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు వ్యవహార శైలిపై తీవ్ర అసంతృప్తిని వెళ్లగక్కారు. ‘‘జిల్లా మంత్రిగారికి చెబుతున్నా.. మీరే అధికారులతో మాట్లాడుకుని, మీరే నిర్ణయాలు తీసుకుంటే కుదరదు’’ అంటూ ఉమాపై ఆయన సమక్షంలోనే ఘాటుగా స్పందించారు. మరో మంత్రి నారాయణ కూడా వేదికపైనే ఉండగానే నాని ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.

గత కొన్నేళ్లుగా కృష్ణా జిల్లా తెలుగుదేశం పార్టీలో నేతల మధ్య ఆధిపత్య పోరు జరుగుతోంది. జిల్లా పార్టీని గుప్పిట్లో ఉంచుకోవడానికి మంత్రి ప్రయత్నిస్తడం కాస్తా టీడీపీలో విభేదాలకు తావిచ్చింది.

మరిన్ని వార్తలు