‘సైకిల్’కు కార్పొరేట్ సంకెళ్లు

18 Mar, 2014 01:55 IST|Sakshi
‘సైకిల్’కు కార్పొరేట్ సంకెళ్లు
2004కు ముందు.. చంద్రబాబు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాదు.. సీఈవో(చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్) అన్న పేరుండేది. కొందరు ముద్దుగా.. ఇంకెందరో వ్యంగ్యంగా ఆయన్ను అలా వ్యవహరించేవారు.. రాష్ట్రాన్ని ఒక కార్పొరేట్ సంస్థగా మార్చేశారని దీనర్థం అన్నమాట. ప్రజలకు సంక్షేమ పాలన అందించాల్సిన నేత.. ఇలా పేదల కష్టాలు పట్టించుకోకుండా రాష్ట్రాన్ని కార్పొరేట్ సంస్థగా మార్చేయడమే అప్పటి ఎన్నికల్లో ఆయన పార్టీ కొంప ముంచింది. ఆలస్యంగా కళ్లు తెరిచిన ఆయన ‘నేను మారిన మనిషిని.. ఇప్పుడు ప్రజల సంక్షేమమే నా లక్ష్యం’ అని ఆ మధ్య చెప్పుకొచ్చారు. అయితే బాబు మారలేదని.. పార్టీని ప్రస్తుతం ఆయన నడుపుతున్న తీరే స్పష్టం చేస్తోంది. టీడీపీ నిర్వహణ నుంచి.. అభ్యర్థుల ఎంపిక వరకు.. అన్నీ కార్పొరేట్ లాబీదే హవా. అధినేత తీరుతో పార్టీవర్గాలే అసంతృప్తికి గురవుతున్నాయి.
 
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: కింజరాపు కుటుంబ అభిప్రాయంతో పని లేదు.. ‘కళా’నూ సంప్రదించడం లేదు.. జిల్లా పార్టీ అధ్యక్షుడిని అసలే గుర్తించడం లేదు.. అంతా ఇద్దరి అభీష్టం మేరకే సాగుతోంది. ఇదీ జిల్లా టీడీపీ ప్రస్తుత పరిస్థితి. అధినేత చంద్రబాబుకు సన్నిహితమైన కార్పొరేట్ లాబీ జిల్లా టీడీపీని కబళిస్తోంది.. శాసిస్తోంది. నేతల చేరికలు... అభ్యర్థుల ఖరారు నుంచి అతి చిన్న వ్యవహారం వరకు.. ఆ లాబీ మాటే చెల్లుబాటవుతోంది. పార్టీలో వేళ్లూనుకుంటున్న ఈ కార్పొరేట్ సంసృ్కతిపై టీడీపీ తమ్ముళ్లలో 
 
 అంతా ఆ ఇద్దరే!
 సుజనా చౌదరి, సీఎం రమేష్.. వీరిద్దరి కనుసన్నల్లోనే ప్రస్తుతం జిల్లా టీడీపీ వ్యవహారాలన్నీ సాగుతున్నాయి. కింజరాపు, కళా వర్గాల ఆధిపత్య పోరును సాకుగా తీసుకొని అధినేత చంద్రబాబు వీరిద్దరికీ పెత్తనం అప్పగించారు. జిల్లా టీడీపీ నేతలపై ఆయనకు నమ్మకం సడలిపోయింది. దాంతో మూడు నెలల క్రితమే జిల్లా పార్టీపై కార్పొరేట్ పెద్దరికాన్ని రుద్దారు. తనకు సన్నిహితులైన సీఎం రమేష్, సుజనా చౌదరీలకు పూర్తి అధికారాలు, బాధ్యతలు అప్పగించారు. జిల్లా పార్టీ నేతల అభిప్రాయంతో నిమిత్తం లేకుండా నేరుగా వ్యవహారాలు చక్కబెట్టమని చంద్రబాబునాయుడు ఆదేశించారు. అప్పటి నుంచి వారిద్దరు జిల్లా వ్యవహారాలను నిర్దేశించసాగారు. సీఎం రమేష్ హైదారాబాద్ నుంచే వ్యవహారాలు చక్కెబెడుతుండగా, సుజనా చౌదరి పలుసార్లు విశాఖపట్నానికి వచ్చి జిల్లా పార్టీని శాసించసాగారు.  శత్రుచర్లకు కార్పొరేట్ కార్పెట్ జిల్లా టీడీపీపై కార్పొరేట్ పెద్దరికానికి తాజా నిదర్శనం మాజీ మంత్రి శత్రుచర్ల చేరిక. ఆయన్ను టీడీపీలో చేర్చుకోవాలన్న ప్రతిపాదనను కింజరాపు అచ్చెన్నాయుడు, రామ్మోహన్‌లు తీవ్రంగా వ్యతిరేకించారు.
 
 ఆయన వస్తే పాతపట్నం నియోజకవర్గంలో అత్యధికంగా ఉన్న కాపు సామాజికవర్గం ఆగ్రహిస్తుందని ఎంతగానో చెప్పారు. పాతపట్నం అసెంబ్లీతోపాటు శ్రీకాకుళం లోక్‌సభ స్థానం పరిధిలోనూ కాపు ఓటర్లు పార్టీకి దూరమవుతారని హెచ్చరించారు.  వారు ఎంత మొత్తుకున్నా చంద్రబాబు సానుకూలంగా స్పందించ లేదు. అప్పటికే శత్రుచర్ల చేరికకు సీఎం రమేష్, సుజనా చౌదరీలు పచ్చజెండా ఊపేయడమే దానికి కారణం. శత్రుచర్ల జిల్లా టీడీపీ నేతలతో కాకుండా నేరుగా వారిద్దరితోనే వ్యవహారం సాగించారు. ‘రామ్మోహన్, అచ్చెన్నాయుడులు ఎంత ప్రయత్నించినా నన్ను అడ్డుకోలేరు. నేను సీఎం రమేష్, సుజనా చౌదరీలతో మాట్లాడుకున్నా. టీడీపీలో చేరడం ఖాయం.. టిక్కెట్టు రావడం తథ్యం’అని శత్రుచర్ల కొద్దిరోజుల క్రితమే తన సన్నిహితులకు స్పష్టంగా చెప్పారు. ఇప్పుడు అదే జరిగింది. కింజరాపు కుటుంబానికిగానీ, పార్టీ జిల్లా అధ్యక్షుడు చౌదరి బాబ్జీకిగానీ మాటమాత్రంగానైనా చెప్పకుండానే శత్రుచర్లను పార్టీలో చేర్చుకున్నారు. ఈ పరిణామంతో పార్టీపై కార్పొరేట్ లాబీ ఆధిపత్యమేమిటో జిల్లా నేతలకు తెలిసివచ్చింది. 
 
 బ్రాంచి ఆఫీస్..వైజాగ్
 తాజా పరిణామాలతో జిల్లా టీడీపీలో మూడోవర్గం రూపొందుతోంది. కింజరాపు కుటుంబం, కళా వెంకట్రావులతో నిమిత్తం లేకుండా టీడీపీ నేతలు విశాఖపట్నానికి క్యూ కడుతున్నారు. దీనికి కారణం.. సీఎం రమేష్, సుజనా చౌదరీలు విశాఖపట్నం కేంద్రంగా వ్యవహారాలు సాగిస్తుండటమే. విశాఖపట్నం వచ్చే ముందే ఎంపిక చేసిన జిల్లా నేతలను పిలిపించుకుని మంతనాలు సాగిస్తున్నారు. అలాంటి నేతల జాబితాలో గౌతు శివాజీ కుటుంబం కూడా ఉండటం ప్రాధాన్యం సంతరించుకుంది. కింజరాపు కుటుంబంపై ఆగ్రహంతో ఉన్న శివాజీ అధినేతకు సన్నిహితులైన సీఎం రమేష్, సుజనా చౌదరిలతో టచ్‌లో ఉన్నారు. వారి సూచనల మేరకే తన కుమార్తె శిరీషను ఎన్నికల బరిలోకి దించాలని నిర్ణయించారు. గుండ అప్పలసూర్యనారాయణ కుటుంబం కూడా వారిద్దరితో సన్నిహితంగా ఉంటోంది. తమకు వ్యతిరేకంగా కొర్ను ప్రతాప్‌ను రామ్మోహన్, అచ్చెన్నలు ప్రోత్సహిస్తున్న తీరుపై సీఎం రమేష్, సుజనా చౌదరీలకు ఫిర్యాదు చేసింది. 
 
 తత్ఫలితంగానే కొర్ను ప్రతాప్ విషయంలో వెనక్కుతగ్గాలని కింజరాపు కుటుంబానికి చంద్రబాబు స్పష్టం చేశారు. కూన రవికుమార్ కూడా  అచ్చెన్నాయుడుకు దూరం జరుగుతూ కార్పొరేట్ లాబీకి దగ్గరవుతున్నారు. టీడీపీ తరపున జెడ్పీ చైర్‌పర్సన్ స్థానాన్ని ఆశిస్తున్న నేతలు కూడా రమేష్, సుజనాలను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు. కళా వెంకట్రావు తన మరదలు మృణాళినిని, కింజరాపు కుటుంబం చౌదరి బాబ్జీ కుటుంబ సభ్యుల పేర్లను జెడ్పీ చైర్‌పర్సన్ పదవి కోసం ప్రతిపాదిస్తున్నారు. దాంతో జెడ్పీ పీఠంపై ఆశలు పెట్టుకున్న ఇతర ముఖ్యనేతలకు ఈ కార్పొరేట్ లాబీ ఆశాకిరణంగా మారింది. అందుకే కొల్లా అప్పలనాయుడు, దక్కత ఏకాంబరిలతోపాటు మరికొందరు వారితో సంప్రదింపులు జరుపుతున్నారు. ఈ పరిణామాలు సహజంగానే కింజరాపు, కళా వర్గాలకు ఆగ్రహం తెప్పిస్తున్నాయి. అయితే సీఎం రమేష్, సుజనా చౌదరీల మాటకే అధినేత  ప్రాధాన్యమిస్తుండటంతో ఏమీ చేయలేకపోతున్నారు. ప్రత్యక్ష రాజకీయాలపై అవగాహనలేని కార్పొరేట్ లాబీకి పెద్దరికం అప్పగిస్తుండటంతో ఎన్నికల్లో చావుదెబ్బ తినకతప్పదని టీడీపీ సీనియర్ కార్యకర్తలే వ్యాఖ్యానిస్తున్నారు. 
 

 

మరిన్ని వార్తలు