అనంతలో టీడీపీ నేతల రగడ

21 Jan, 2017 13:47 IST|Sakshi

అనంతపురం: అనంతపురం నగరపాలక సంస్థ కమిషనర్ సురేంద్ర బాబు పట్ల కార్పొరేటర్లు దురుసుగా ప్రవర్తించారు. బిల్లులపై కమిషనర్ సంతకాలు చేయలేదని ఆరోపిస్తూ టీడీపీ కార్పొరేటర్లు ఆందోళనకు దిగారు. దీనికి నిరసనగా నగరపాలక సంస్థ సిబ్బంది విధులను బహిష్కరించారు.

శనివారం అనంతపురం కార్పొరేషన్ సమావేశం రసాభాసగా మారింది. కార్పొరేటర్ల దాడి, నిరసనగా ఉద్యోగుల విధుల బహిష్కరణతో అక్కడ ఉద్రిక్తత ఏర్పడింది. స్థానిక ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి జోక్యం చేసుకుని ఉద్యోగులతో చర్చలు జరిపారు. టీడీపీ కార్పొరేటర్‌ సరళా దేవి దురుసుగా ప్రవర్తించారని సురేంద్ర బాబు ఆరోపించారు.

నగరపాలక సంస్థ అవినీతిలో అధికారుల ప్రమేయం, ప్రజాప్రతినిధుల బాధ్యతారాహిత్యంపై  సాక్షి పత్రికలో ప్రచురితమవుతున్న వరుస కథనాలు పాలకవర్గంతో పాటు అధికార పార్టీలో కలకలం సృష్టించాయి. ఈ వ్యవహారంలో ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి, మేయర్‌ స్వరూప వర్గాల మధ్య మరోసారి విభేదాలు భగ్గుమన్నాయి. అవినీతికి మీరంటే మీరే కారణమంటూ ఇరువర్గాల వారు పరస్పరం అంతర్గత దూషణలకు దిగారు. కమిషనర్‌ సురేంద్ర బాబుకు ఎమ్మెల్యే అండగా ఉండగా, మేయర్ వర్గం వ్యతిరేకిస్తున్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలోనే టీడీపీ కార్పొరేటర్లు ఆందోళనకు దిగారు.

మరిన్ని వార్తలు