‘తెలుగుగంగ’లో రూ.100 కోట్లకు ఎసరు!

28 Jul, 2018 03:04 IST|Sakshi

రూ.180.48 కోట్ల విలువైన పనికి రూ.280.27 కోట్లు

మూడు నెలల్లోనే అంచనా వ్యయం భారీగా పెంపు

టీడీపీ రాజ్యసభ సభ్యుడి సంస్థకే పనులు దక్కేలా టెండర్‌ నిబంధనలు

ముఖ్యనేత జేబుల్లోకి రూ.100 కోట్ల ముడుపులు

సాగునీటి ప్రాజెక్టుల పనుల్లో అవినీతి ప్రవాహం

సాక్షి, అమరావతి: సాగునీటి ప్రాజెక్టుల పనుల్లో అందినకాడికి దిగమింగడమే ప్రభుత్వ పెద్దలు పనిగా పెట్టుకున్నారు. రూ.172.99 కోట్ల విలువైన పనుల అంచనా వ్యయాన్ని రూ.180.48 కోట్లకు పెంచేస్తూ ఈ ఏడాది మార్చి 9న ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

తర్వాత అంచనా వ్యయాన్ని రూ.280.27 కోట్లకు పెంచేస్తూ జూన్‌ 8న ఉత్తర్వులు జారీ చేసింది. అంటే కేవలం మూడు నెలల్లోనే రూ.99.79 కోట్ల మేర పెంచినట్లు స్పష్టమవుతోంది. తెలుగుగంగ ప్రాజెక్టు పనుల్లో ముఖ్యనేత సాగిస్తున్న అక్రమాలకు ఇదో తార్కాణం. ఈ వ్యవహారంలో రూ.100 కోట్ల మేర ముడుపులు చేతులు మారనున్నట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి.

అంచనాల్లో వంచన
తెలుగుగంగ ప్రాజెక్టు పనుల అంచనా వ్యయాన్ని రూ.4,460.64 కోట్లుగా ఖరారు చేస్తూ 2007 మార్చి 20న రాష్ట్ర ఉత్తర్వులు జారీ చేసింది. 2018 మార్చి నాటికి 95 శాతం పనులు పూర్తయ్యాయి. కేవలం 5 శాతం పనులే మిగిలిపోయాయి. ఈ నేపథ్యంలో అంచనా వ్యయాన్ని రూ.6,671.62 కోట్లకు పెంచేస్తూ  ఈ ఏడాది మార్చి 9న ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అడ్డగోలుగా పెంచేసిన అంచనా వ్యయంతో మిగిలిపోయిన పనులను సన్నిహిత కాంట్రాక్టర్లకు కట్టబెట్టి కమీషన్లు వసూలు చేసుకోవడానికి ముఖ్యనేత స్కెచ్‌ వేశారు.

ఈ క్రమంలో తెలుగుగంగ ప్రధాన కాలువ 0.00 కి.మీ. నుంచి 18.20 కి.మీ. వరకూ లైనింగ్‌ చేయడం, 18.200 కి.మీ. నుంచి 42.566 కి.మీ. వరకూ గతంలో లైనింగ్‌ చేయకుండా మిగిలిన పనులు, బనకచెర్ల క్రాస్‌ రెగ్యులేటర్‌(బీసీఆర్‌) నుంచి వెలుగోడు బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌కు నీటిని సరఫరా చేసే లింక్‌ చానల్‌ 0.00 కి.మీ. నుంచి 7.380 కి.మీ. వరకూ లైనింగ్‌ చేయకుండా మిగిలిపోయిన పనులను చేపట్టాలని నిర్ణయించారు. 2007 నాటి ఉత్తర్వుల ప్రకారం ఈ పనుల విలువ రూ.172.99 కోట్లు. కానీ, మార్చి 9న జారీ చేసిన ఉత్తర్వుల్లో ఈ పనుల విలువను రూ.180.48 కోట్లుగా ప్రభుత్వం ఖరారు చేసింది.

ముఖ్యనేత హుకుం
తెలుగుగంగ కాలువ లైనింగ్‌ పనుల అంచనా వ్యయాన్ని మళ్లీ పెంచేయాలంటూ అధికారులపై ముఖ్యనేత ఒత్తిడి తెచ్చారు. దాంతో అంచనా వ్యయాన్ని రూ.280.27 కోట్లకు పెంచేస్తూ జూన్‌ 8న జల వనరుల శాఖ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ అంచనా వ్యయంతో తన కోటరీలోని రాజ్యసభ సభ్యుడి సంస్థకే పనులు దక్కేలా టెండర్‌ నోటిఫికేషన్‌ జారీ చేయాలని ముఖ్యనేత హుకుం జారీ చేశారు.

ఈ పనుల అంతర్గత విలువను రూ.239.03 కోట్లగా నిర్ణయించిన అధికారులు.. ఈ నెల 16న ఓపెన్‌ విధానంలో టెండర్‌ నోటిఫికేషన్‌ జారీ చేశారు. 18 నెలల్లో పనులు పూర్తి చేయాలని గడువు విధించారు. బిడ్‌లు దాఖలు చేయడానికి ఈ నెల 30వ తేదీ తుది గడువుగా నిర్ణయించారు. 31న టెక్నికల్‌ బిడ్, ఆగస్టు 6న ప్రైస్‌ బిడ్‌ తెరిచి టీడీపీ రాజ్యసభ సభ్యుడి సంస్థకు పనులు కట్టబెట్టడానికి రంగం సిద్ధం చేశారు.


కి.మీ.కు రూ.12.16 కోట్లు ఖర్చు చేస్తారట!
టెండర్లు పిలిచిన పనుల్లో తెలుగుగంగ ప్రధాన కాలువ 0.00 కి.మీ. నుంచి 18.20 కి.మీ. వరకూ లైనింగ్‌ పనులు మాత్రమే కొత్తగా చేపట్టాల్సినవి. ప్రధాన కాలువ 18.200 కి.మీ. నుంచి 42.566 కి.మీ. వరకూ.. కేవలం 800 నుంచి 900 మీటర్ల పొడవున మాత్రమే లైనింగ్‌ పనులు మిగిలిపోయాయి. బీసీఆర్‌ లింక్‌ చానల్‌లో 650 మీటర్ల పనులు మాత్రమే గతంలో చేయకుండా వదిలేశారు.

వీటిని పరిగణనలోకి తీసుకుంటే కేవలం 19.650 కి.మీల. పొడవున మాత్రమే లైనింగ్‌ చేయాలి. ప్రభుత్వం ఖరారు చేసిన అంచనా వ్యయం ప్రకారం చూస్తే కి.మీ.కు సగటున రూ.12.16 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు స్పష్టమవుతోంది. వాస్తవానికి కిలోమీటర్‌కు రూ.7 కోట్లకు మించి వ్యయం కాదని ఇంజనీరింగ్‌ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఇక జీఎస్టీ, లేబర్‌ సెస్, సీనరేజీ చార్జీల రూపంలో మరో రూ.36.29 కోట్లు కాంట్రాక్టర్‌కు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించడం గమనార్హం.

టీడీపీ ఎంపీ సంస్థకు పనులు దక్కేందుకే..
అధికార పార్టీ రాజ్యసభ సభ్యుడి సంస్థకే పనులు దక్కేలా టెండర్‌ నిబంధనలు రూపొందించడం గమనార్హం. సాధారణంగా ‘పేవర్‌’ అనే యంత్రంతో కాలువల లైనింగ్‌ చేసిన అనుభవం ఉన్న కాంట్రాక్టర్లే బిడ్‌ దాఖలుకు అర్హులని నిబంధన పెడతారు. కానీ, పేవర్‌తోపాటు ‘షార్ట్‌ క్రీటింగ్‌’ విధానంలో చేసి పనులు ఉండాలనే నిబంధన పెట్టడం గమనార్హం. ఈ విధానంలో పనులు చేసిన అనుభవం టీడీపీ రాజ్యసభ సభ్యుడి సంస్థకు ఉండటం వల్లే.. ఆ నిబంధనను ప్రత్యేకంగా పెట్టారని అధికార వర్గాలు చెబుతున్నాయి.

మరిన్ని వార్తలు