ఐదెకరాల కథ కంచికేనా!?

20 Apr, 2019 12:07 IST|Sakshi

రాజధానిలో ఐదెకరాల కోసం దుర్గగుడి దరఖాస్తు

కల్యాణ మండపం కట్టాలని యోచన

ప్రభుత్వం నిర్ణయించిన ధరకు కొనేందుకు సిద్ధం   

అయినా భూమిని కేటాయించని ప్రభుత్వం  

సాక్షి, విజయవాడ :  దుర్గగుడికి రాజధానిలో ఐదు ఎకరాల భూమిని తీసుకోవాలనే ఆలోచన కార్యరూపం దాల్చలేదు. టీటీడీ రాజధానిలో వేంకటేశ్వరస్వామి దేవాలయం నిర్మిస్తుండగా.. దుర్గామల్లేశ్వరస్వామి వార్ల దేవస్థానం తరఫున కల్యాణ మండపం కట్టాలని నిర్ణయించారు.

 

ప్రభుత్వానికి దరఖాస్తు..
రాజధానిలో ఐదు ఎకరాల భూమి సీఆర్‌డీఏ ద్వారా ఇప్పించాలని కోరుతూ ప్రభుత్వానికి దుర్గగుడి ఈవో వి.కోటేశ్వరమ్మ దరఖాస్తు చేశారు. ఈ భూమికి ప్రభుత్వం నిర్ణయించిన రేటుకు కొనుగోలు చేస్తామని హామీ ఇచ్చారు. అయితే ప్రభుత్వం సూచనల మేరకే దుర్గగుడి అధికారులు ఈ దరఖాస్తు చేశారనే ప్రచారం జరుగుతోంది.

ఆఖరు సమావేశం వరకు..
గత మార్చిలో రాష్ట్ర ప్రభుత్వం ఆఖరి మంత్రివర్గ సమావేశం నిర్వహించింది. ఈ ఆఖరి సమావేశంలోనైనా దుర్గగుడికి ఐదు ఎకరాల భూమిని కేటాయిస్తారని దుర్గగుడి అధికారులు భావించారు. రాజధాని ప్రాంతంలో భూమి కేటాయింపులు జరిగితే దాతల సహకారంతో అక్కడ కల్యాణ మండపం నిర్మించాలని భావించారు. అయితే ప్రభుత్వం మాత్రం దుర్గగుడికి భూమి ఇచ్చేందుకు ఆసక్తి చూపలేదు. సీఆర్‌డీఏలో ఫైల్‌ ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉన్నట్లు ఉందని దుర్గగుడి అధికారులు చెబుతున్నారు.  ఎన్నికల ముందు కొన్ని ప్రైవేటు సంస్థలకు మాత్రం రాజధానిలో విలువైన భూముల్ని కట్టపెట్టిన ప్రభుత్వం దుర్గగుడికి మాత్రం ఇవ్వడంపై ఆసక్తి చూపలేదు. కొత్తగా ప్రభుత్వం వచ్చే వరకు ఆ ఫైల్‌ పక్కన పెట్టినట్టే.

దుర్గగుడి భూముల్ని సద్వినియోగం చేసుకోవడం ఉత్తమం..   
రాజధానిలో భూముల కోసం అధికారులు ప్రయత్నించే కంటే  దేవస్థానానికి ఉన్న భూముల్ని ఉపయోగించుకుంటే ఉపయుక్తంగా ఉంటుందని పలువురు భక్తులు భావిస్తున్నారు. గుంటూరు జిల్లాలో ఉన్న రాజధాని భూములను  తీసుకొని అక్కడ కల్యాణ మండపం నిర్మించే కంటే అదే నిధులతో దుర్గగుడి సమీపంలోని పోరంకి, భవానీపురంలో టీటీడీ నుంచి తీసుకున్న భూముల్లో,   నున్నలోని ఐదు ఎకరాల్లో కాటేజ్‌లు, కల్యాణ మండపాలు నిర్మించడానికి భక్తుల సహకారం తీసుకుంటే ఉపయుక్తంగా ఉంటుందని దుర్గమ్మ భక్తులు పేర్కొంటున్నారు.  రాజధానిలో దుర్గగుడి కల్యాణ మండపం నిర్మించినా అక్కడకు వెళ్లి పెళ్లి చేసుకుంటే అమ్మవారి సన్నిధిలో చేసుకున్నట్లు భక్తులు భావించరని అభిప్రాయపడుతున్నారు.

మరిన్ని వార్తలు