కోర్టులోనైనా న్యాయం జరిగేనా..!

23 Feb, 2019 13:45 IST|Sakshi
మంచానికే పరిమితమైన దివ్యాంగుడు మోహన్‌

అర్హతలున్నా.. ఆధార్‌ కార్డు లేదని పింఛన్‌ నిరాకరణ

న్యాయస్థానాన్ని ఆశ్రయించిన బాధితుడి తల్లిదండ్రులు

వైఎస్‌ఆర్‌ జిల్లా  ,ప్రొద్దుటూరు : ప్రొద్దుటూరు మండలంలోని సీతంపల్లె గ్రామానికి చెందిన దివ్యాంగుడు పంజగాళ్ల మోహన్‌కు పింఛన్‌ మంజూరు చేయాలని బాధితుడి తల్లిదండ్రులు కోర్టును ఆశ్రయించారు. ఇలా అయినా తమకు న్యాయం జరుగుతుందేమోనని మోహన్‌ తల్లిదండ్రులు వెంకటసుబ్బయ్య, అరుణ ఆశిస్తున్నారు. వివరాలిలా ఉన్నాయి.. వెంకటసుబ్బయ్య, అరుణ దంపతులకు మోహన్, సుస్మిత, గాయత్రి సంతానం. మోహన్‌ 2006 డిసెంబర్‌ 15న జన్మించాడు. పుట్టకతోనే మోహన్‌ మానసిక, శారీరక దివ్యాంగుడు.

నాటి నుంచి నేటి వరకు అతను మంచానికే పరిమితం. తల్లిదండ్రులు రోజు సమయానికి భోజనం పెట్టడం, కాలకృత్యాలు తీర్చడం జరుగుతోంది. మోహన్‌కు కాళ్లు, చేతులు పనిచేయవు. అయితే అన్ని అర్హత ఉన్న తమ కుమారుడికి పింఛన్‌ ఇప్పించాలని తల్లిదండ్రులు గ్రీవెన్స్‌సెల్‌లో పలు మార్లు జిల్లా ఉన్నతాధికారులను కలిసి విన్నవించారు. ఆధార్‌ కార్డు, రేషన్‌ కార్డు ఉంటేనే పింఛన్‌ వస్తుందని సంబంధిత అధికారులు సూచించారు. కాళ్లు, చేతులు పనిచేయని మోహన్‌కు ఆధార్‌కార్డు తీయడం కష్టతరంగా మారింది. దీంతో ఇంత కాలం పింఛన్‌ అందలేదు. కూలి పనులు చేసుకుని జీవనం సాగించే మోహన్‌ తల్లిదండ్రులకు మోహన్‌ను పోషించడం కష్టంగా మారింది. ఈ నేపథ్యంలో తమకు న్యాయం చేయాలని తల్లిదండ్రులు కోర్టును ఆశ్రయించారు.

అధికారులు స్పందించకనేకోర్టుకు వెళ్లాం
పదుల సార్లు వివిధ ప్రభుత్వ కార్యాలయాల చుట్టు తిరిగాం. ఎవరూ స్పందించలేదు. దీంతో చివరికి కోర్టును ఆశ్రయించాం. అన్ని విధాలా అర్హుడైన తన కుమారుడికి ఎందుకు పింఛన్‌ ఇవ్వరు. సాంకేతిక కారణాలు చెబితే తమ కుమారుడి లాంటి వారి పరిస్థితి ఏమిటి.– వెంకటసుబ్బయ్య, అరుణ, సీతంపల్లె

మరిన్ని వార్తలు