హామీలు ‘దివ్యం’.. అమలులో దైన్యం

21 Mar, 2019 09:43 IST|Sakshi

రూ.2 వేల కోట్లతో ‘బడ్జెట్‌’ అన్నారు..

విజయవాడలో ప్రత్యేక స్టడీ సర్కిల్, గుంటూరులో బ్రెయిలీ ప్రెస్‌ గాలికి

2,500 స్కూటీలు ఇస్తామని ఎగ్గొట్టారు

రెండు చేతులు లేని వారికి రూ.10 వేలు వట్టిమాటే

‘రచ్చబండ’లో దివ్యాంగులు

‘దివ్యాంగుల కోసం రూ.2 వేల కోట్లతో ప్రత్యేక బడ్జెట్‌ కేటాయిస్తా. ప్రత్యేక స్టడీ సర్కిళ్లు ఏర్పాటు చేస్తా. స్కూటీలు పంపిణీ చేస్తా. రెండు చేతులు లేనివారికి నెలకు రూ.10 వేలు పింఛను. వైకల్యం గల వారికి రూ.3 వేలు పింఛను. దివ్యాంగుల సంక్షేమమే మా ధ్యేయం’అంటున్న చంద్రబాబు ఐదేళ్ల పాలనలో దివ్యాంగులకు చేసిందేమిటనే విషయాన్ని తెలుసుకునేందుకు ‘సాక్షి’ గుంటూరులో రచ్చబండ నిర్వహించింది. దివ్యాంగుల్లో ఎవరిని కదిపినా ‘మా సంక్షేమాన్ని పట్టించుకున్న నాథుడే లేడు’ అని అవేదన వ్యక్తం చేశారు. దివ్యాంగుడు మరియబాబు మాట్లాడుతూ.. ‘80 నుంచి 100 శాతం వైకల్యం ఉంటేనే రూ.3 వేలు పింఛను వస్తుందంట. ఆ పింఛన్‌కు దరఖాస్తు చేసుకోడానికి రోజుకో షరతు పెడుతున్నారు. కొన్ని రోజులు సదరం క్యాంప్‌లు అన్నారు. మరికొన్ని రోజులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఆన్‌లైన్లో దరఖాస్తు చేద్దామంటే ఆ వెబ్‌సైట్లు ఎప్పుడు ఓపెన్‌ అవుతాయో తెలీదు. మాకు చేయూత అందించడానికి కూడా షరతులేంటి సార్‌’ అని వాపోయాడు. ఇంతలోనే జనగం రామయ్య మాట కలుపుతూ.. ‘సర్టిఫికెట్లు ఇచ్చినా పింఛన్‌ రావట్లేదు. ఒక కన్ను లేక బాధపడుతున్న నేను దివ్యాంగ పింఛన్‌ కోసం దరఖాస్తు చేసుకున్నా. డాక్టర్లు సైతం నాకున్న వైకల్యాన్ని ధ్రువపరుస్తూ పత్రాలు ఇచ్చారు. అయినా నాకు పింఛన్‌ రావడం లేదు. కళ్లు కనిపించకున్నా కూలి పనులకు వెళ్తున్నానంటూ గోడు వెళ్లబోసుకున్నాడు.– వడ్డే బాలశేఖర్, సాక్షి, గుంటూరు

చంద్రబాబు దగా చేశారు
దివ్యాంగుల సంక్షేమానికి బడ్జెట్‌లో ఏటా రూ.2 వేల కోట్లు కేటాయిస్తామని మొండిచెయ్యి చూపారు. దివ్యాంగులకు జిల్లాకో హోమ్‌ ఏర్పాటు చేస్తామన్నారు. రూ.10 వేలిస్తామని ఇవ్వలేదు. ఇలాంటి హామీలెన్నో ఇచ్చి దివ్యాంగులను మోసం చేశారు. మమ్మల్ని టీడీపీ ప్రభుత్వం కేవలం ఓటు బ్యాంకుగానే పరిగణిస్తోంది.    – చెర్లోపల్లి రెడ్డెప్ప,కార్యదర్శి, ఏపీ దివ్యాంగుల జేఏసీ

మోటార్‌ వాహనాల ఊసే లేదు
కోటేశ్వరరావు అనే దివ్యాంగుడు మాట్లాడుతూ.. ‘మాలాంటోళ్లకు 2,500 మోటార్‌ వాహనాలు పంపిణీ చేస్తామని 2016 డిసెంబర్‌ 3న దివ్యాంగులకు చంద్రబాబు ప్రకటించారు. రెండేళ్లు వాటి ఊసేలేదు. తీరా ఎన్నికలు సమీపి స్తున్న వేళ మొక్కుబడిగా కొన్ని స్కూటీలు పంపిణీ చేశారు. అవి కూడా టీడీపీ సానుభూతిపరులకే ఇచ్చారు. ఇప్పుడు వాళ్లతో టీడీపీ తరఫున ప్రచారం చేయిం చుకుంటున్నారు’ అని చెప్పారు. శ్రీనివాస్‌ అనే మరో దివ్యాంగుడు మాట్లాడు తూ.. ‘దివ్యాంగుల చట్టం 2016ను అమలు చేయకుండా మోసం చేసింది. చట్టాన్ని అమలు చేసి కమిషన్, జిల్లా కమిటీలు ఏర్పాటు చేయాలని మా నాయ కులు సీఎం, మంత్రులను కలిసి విన్నవించుకున్నా పట్టించుకోలేదు. తెలంగాణ లో ఈ చట్టాన్ని అమల్లోకి తెచ్చారు. బ్యాక్‌లాగ్‌ పోస్టులను సైతం భర్తీ చేయకుం డా చంద్రబాబు దివ్యాంగులను వంచించారు’ అని ఆవేదన వ్యక్తం చేశారు.

రూ.10 వేలుఇస్తామన్నారు
రెండు చేతులు లేని వారికి నెలకు రూ.10 వేలు ఇస్తామని సీఎం ప్రకటించారు. నేటికీ రూ.10 వేలు పింఛన్‌ ఇవ్వలేదు. ఎన్నికల ప్రచారంలో మాత్రం రెండు చేతులు లేని వారికి రూ.10 వేలు ఇస్తున్నామని చెప్పుకుంటున్నారు.– లక్ష్మీపతినాయుడు, దివ్యాంగుడు

ఐదేళ్లలో ఇచ్చిన హామీలివీ
దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా 2014 డిసెంబర్‌ 3న రాజమహేంద్రవరంలో ఇచ్చిన హామీలు
దివ్యాంగుల సంక్షేమానికి ఏటా బడ్జెట్‌లో రూ.2 వేల కోట్లు కేటాయిస్తాం
జిల్లాలో శారీరక దివ్యాంగులకు హోమ్‌లను ఏర్పాటు చేస్తాం
దివ్యాంగులకు రిజర్వేషన్లు పెంచుతాం
ప్రతి జిల్లాలో రెసిడెన్షియల్‌ పాఠశాలలు ఏర్పాటు చేస్తాం
స్కిల్‌ డెవలప్‌మెంట్‌ ట్రైనింగ్‌ సెంటర్లు ఏర్పాటు చేస్తాం

2015 డిసెంబర్‌ 3న విజయవాడలో ఇచ్చిన హామీలు
దివ్యాంగులకు విజయవాడలో స్టడీ సర్కిల్‌ ఏర్పాటు
గుంటూరులో రూ.2.70కోట్లతో బ్రెయిలీ ప్రెస్‌ ఏర్పాటు చేస్తాం
రూ.20కోట్లతో బాల్యంలో వైకల్యం, ఆరోగ్య సమస్యలు రాకుండా చర్యలు తీసుకుంటాం.

2016 డిసెంబర్‌ 3న విజయవాడలోనితుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఇచ్చిన హామీలు
ఏటా బ్యాక్‌లాగ్‌ ఉద్యోగాల భర్తీ చేస్తాం
2,500 మందికి మోటారు వాహనాలు, బ్యాటరీ వాహనాలు మంజూరు చేస్తాం. దివ్యాంగులకు సదరం సర్టిఫికెట్లు వారంలో మంజూరు చేయిస్తాం

2017 డిసెంబర్‌ 3న కర్నూలులో ఇచ్చిన వాగ్దానాలు
ఇద్దరు దివ్యాంగులు వివాహం చేసుకుంటే ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం
కర్నూలు జిల్లాలో రూ.6.94 కోట్లతో సెన్సార్‌ పార్క్‌ నిర్మిస్తాం.

మరిన్ని వార్తలు