టీడీపీ ద్వంద్వ వైఖరి

30 May, 2014 00:28 IST|Sakshi
 •     పెట్రో కారిడార్‌పై మాటమార్చడం తగదు
 •      ఏపీ రైతు సంఘం ధ్వజం
 •  అనకాపల్లి టౌన్, న్యూస్‌లైన్ : ప్రతిపక్షంలో ఉండగా పెట్రో కారిడార్ ప్రతిపాదనలను తీవ్రంగా వ్యతిరేకించిన తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే మాటమార్చడం వారి ద్వంద్వ వైఖరికి నిదర్శనమని ఏపీ రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు ఎ.బాలకృష్ణ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులు, మత్స్యకారుల జీవితాలను సమూలంగా నాశనం చేసే ఈ ప్రతిపాదనలను తక్షణం రద్దు చేయాలని డిమాండ్ చేశారు.

  సంఘం జిల్లా కార్యవర్గం రౌండ్ టేబుల్ సమావేశం గురువారం అనకాపల్లిలోని సీఐటీయూ కార్యాలయంలో జరిగింది. ఈ సమావేశంలో బాలకృష్ణ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో విశాఖ జిల్లా గంగవరం నుంచి కాకినాడ పోర్టు వరకు ప్రతిపాదించిన కారిడార్ కోసం 10 మండలాల పరిధిలోని 1.5 లక్షల ఎకరాల పంట భూముల్ని స్వాధీనం చేసుకుంటామని ప్రకటించిన విషయాన్ని గుర్తు చేశారు.

  అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వామపక్షాలతో కలిసి తీవ్రంగా వ్యతిరేకించిన తెలుగుదేశం పార్టీ ఇప్పుడు అనుకూలంగా మాట్లాడడం సరికాదన్నారు. పీసీపీఐఆర్ ప్రతిపాదనలు అమల్లోకి వస్తే వేలాది రైతు కుటుంబాలు జీవనోపాధి కోల్పోతాయన్నారు. మత్స్యకారులు వేట లేక వీధిన పడతారని ఆందోళన వ్యక్తం చేశారు.

  ప్రభుత్వం తక్షణం ఈ ప్రతిపాదనలను వెనక్కి తీసుకోకుంటే తీవ్రస్థాయిలో ఉద్యమిస్తామని హెచ్చరించారు. ఈ సమావేశంలో సంఘం జిల్లా కార్యదర్శి కర్రి అప్పారావు, సీనియర్ నాయకులు పి.జగన్నాథం, కె.రామ సదాశివరావు, వై.సీతారామ్, నాగిరెడ్డి సత్యనారాయణ, సత్తిబాబు, నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
   

మరిన్ని వార్తలు