కార్మికుల సొమ్ము.. కడుపారా!

13 Jun, 2020 04:34 IST|Sakshi

షాంపులు, ఫేస్‌ క్రీముల పేరుతోనూ మెక్కేశారు

ఈఎస్‌ఐ మందులు, వైద్యపరికరాల కొనుగోళ్లలో భారీ దోపిడీ

ఈ స్కామ్‌లో నాటి కార్మిక శాఖ మంత్రి అచ్చెన్నాయుడిదే కీలక పాత్ర

టెలీ హెల్త్‌సర్వీసెస్,ఈసీజీ సర్వీసులకు సిఫార్సు

టెండర్‌ లేకుండానే కట్టబెట్టిన వైనం

అధిక ధరలతో అడ్డగోలుగా కొనుగోలు

విజిలెన్స్‌ నివేదిక, ఏసీబీ దర్యాప్తులో వెల్లడి

ఈఎస్‌ఐ మందులు, వైద్యపరికరాల కొనుగోళ్లలో భారీ దోపిడీ

ఈ స్కామ్‌లో నాటి కార్మిక శాఖ మంత్రి అచ్చెన్నాయుడిదే కీలక పాత్ర

సాక్షి, అమరావతి: కార్మికుల కన్నీళ్లు తుడిచి మెరుగైన వైద్యం అందేలా చూడాల్సిన వారే కాంట్రాక్టర్లతో కుమ్మక్కై కడుపారా ఆరగించారు. నెలనెలా జీతం నుంచి ఈఎస్‌ఐ కోసం డబ్బులు చెల్లించే కార్మికుల సొమ్మును కాజేశారు. మాజీ సీఎం చంద్రబాబు హయాంలో కార్మిక శాఖ మంత్రి హోదాలో అచ్చెన్నాయుడు సిఫార్సు లేఖలతో నామినేషన్‌ ద్వారా ఆర్డర్లు ఇచ్చి ఈఎస్‌ఐ మందులు, వైద్య పరికరాల కొనుగోళ్లలో భారీ దోపిడీకి తెరతీసినట్లు విజిలెన్స్‌ విచారణలో వెల్లడి కావడంతో ఏసీబీ అధికారులు ఆయన్ను అరెస్టు చేశారు. టెలీ హెల్త్‌ సర్వీసెస్‌ పేరుతో అచ్చెన్నాయుడు ఇచ్చిన లేఖలు ఆయన అవినీతికి అద్దంలా నిలిచాయి. నాన్‌ రేట్‌ కాంట్రాక్టు మందులు, ల్యాబ్‌ కిట్స్, సర్జికల్‌ ఐటమ్స్, ఫర్నిచర్, బయోమెట్రిక్‌ పరికరాల కొనుగోళ్లతోపాటు కాల్‌ సెంటర్, ఈసీజీ సర్వీసుల ఒప్పందాల్లోను అవినీతి, అక్రమాలు జరిగాయని ఈ వ్యవహారంలో రూ.150 కోట్లకుపైగా ప్రజాధనం లూటీ అయినట్లు ఏసీబీ దర్యాప్తులో గుర్తించారు.

నామినేషన్‌ పద్ధతిలో లోపాయికారీగా...
అచ్చెన్న మంత్రిగా ఉండగా ఈఎస్‌ఐ కోసం మందులు, సర్జికల్‌ పరికరాల కొనుగోళ్లకు మార్కెట్‌ ధర కంటే అత్యధికంగా చెల్లించారు. నామినేషన్‌ పద్ధతిలో లోపాయికారీ ఒప్పందాలు కుదుర్చుకుని కొన్ని సంస్థల నుంచి మందులు కొనుగోలు చేశారు. కొందరు డైరెక్టర్‌ ఆఫ్‌ ఇన్సూరెన్స్‌ అండ్‌ మెడికల్‌ సర్వీసెస్‌(డీఐఎంఎస్‌) సిబ్బంది కూడా వారి కుటుంబ సభ్యుల పేర్లతో బినామీ మందుల కంపెనీలు ఏర్పాటు చేసి అక్రమంగా మందులు కొనుగోలు ఒప్పందాలు చేసుకుని బిల్లులు తీసుకున్నారు. మరికొందరు సిబ్బంది నకిలీ, ఫోర్జరీ లెటర్‌ హెడ్స్‌ సృష్టించి కొటేషన్లు వేశారు. మందుల షాపుల నుంచి దొంగ బిల్లులు సృష్టించి అవినీతికి పాల్పడ్డారు. ఈ స్కామ్‌లో మరికొందరి పాత్రపైనా దర్యాప్తు జరుగుతోంది.

ఈఎస్‌ఐ ఇలా..
► రాష్ట్రంలో కార్మిక రాజ్య బీమా సంస్థ పరిధిలో 14 లక్షల మంది కార్మికులున్నారు. కార్మికుల కుటుంబ సభ్యులతో కలిపి సుమారు 50 లక్షల మంది ఈఎస్‌ఐ పరిధిలో ఉన్నారు.  
► ఒక్కో కార్మికుడు మూల వేతనం నుంచి 0.75 శాతం ఈఎస్‌ఐ కోసం  చెల్లిస్తుండగా కంపెనీ 3.25 శాతం జమ చేసి చెల్లిస్తుంది.
► ఒక్కో కార్మికుడికి కేంద్ర కార్మిక శాఖ సంవత్సరానికి రూ.2,150 చొప్పున ఖర్చు చేసేందుకు వీలు కల్పించింది. ఈమేరకు నిధులు మంజూరు చేస్తుంది. అంటే ఏడాదికి సుమారు రూ.330 కోట్లు నిధులు వస్తాయి. 
► రాష్ట్రంలో ఈఎస్‌ఐ పరిధిలో 78 డిస్పెన్సరీలు, 4 ప్రాంతీయ ఆసుపత్రులు, 3 డయాగ్నస్టిక్స్‌ సెంటర్లున్నాయి.

అచ్చెన్న ఒత్తిడితో ఒప్పందాలు..
కార్మిక శాఖ మంత్రిగా ఉండగా అచ్చెన్నాయుడు టెలీ సర్వీసెస్, ఈసీజీ సర్వీసుల కాంట్రాక్టు ఇప్పించారు. వాస్తవానికి ఏ కాంట్రాక్టు అయినా రూ.10 లక్షల విలువ దాటితే ఈ–టెండరు ప్రాతిపదికన నిర్ణయించాలి. అయితే నిబంధనలకు విరుద్ధంగా అచ్చెన్నాయుడు అప్పటి ఈఎస్‌ఐ డైరెక్టర్‌కు తన లెటర్‌హెడ్‌ మీద సిఫార్సు లేఖ పంపించారు. దీంతో అచ్చెన్న సూచించిన కంపెనీకి ఎలాంటి టెండరు లేకుండా కాంట్రాక్టు కట్టబెట్టారు. విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ నివేదికలో ఈ విషయం బట్టబయలైంది. అచ్చెన్నఒత్తిడితోనే టెలీ హెల్త్‌ సర్వీసెస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ సంస్థకు కాల్‌ సెంటర్, టోల్‌ఫ్రీ, ఈసీజీకి సంబంధించిన కాంట్రాక్టు ఇచ్చారు. అప్పటి ఈఎస్‌ఐ డైరెక్టర్‌ డాక్టర్‌ సీకే రమేష్‌కుమార్‌ కుదుర్చుకున్న ఈ ఒప్పందాలన్నీ లోపభూయిష్టమే. ఎక్కడైనా దాదాపు రూ.200 మాత్రమే ఉండే ఈసీజీకి రూ.480 చొప్పున రెట్టింపునకుపైగా చెల్లించారు. ఈసీజీ కోసం ఎండీకి బదులు డిప్లొమో హోల్డర్‌ను ఉపయోగించుకున్నారు. కాల్‌ సెంటర్‌లో కాల్స్‌కి కాకుండా సర్వీస్‌ ప్రొవైడర్‌ మొత్తం రిజిస్టర్‌ ఐపీ, ఫేక్‌ కాల్‌ లాగ్స్‌కి రూ.1.80 చొప్పున బిల్‌ క్లెయిమ్‌ చేశారు. బయో మెడికల్‌ వేస్ట్‌ డిస్పోజబుల్‌ ప్లాంట్లకు సంబంధించి విచారణ జరుగుతోంది.

క్రీముల పేరిట కార్మికుల సొమ్ము స్వాహా
పొద్దంతా పనిచేసే కార్మికులు అనారోగ్యం పాలైతే ఔషధాలు అందచేసి ఆదుకోవాల్సిన గత సర్కారు పెద్దలు ముఖం మెరిసిపోయేలా ఉండేందుకు క్రీములంటూ కోట్ల రూపాయలు కాజేశారు. గుండె జబ్బులు, కిడ్నీ జబ్బులతో వచ్చే రోగులకు వైద్యం అందించకుండా ఫేసు క్రీములు, చర్మ సంబంధిత ఆయింట్‌మెంట్లు అంటూ రూ.కోట్లు వెచ్చించి కొనుగోలు చేసి నిరుపయోగంగా స్టోర్లలో పారేశారు. ఈఎస్‌ఐ ఆస్పత్రుల కోసమంటూ 2018 నుంచి కొనుగోలు చేసిన ఈ క్రీములు డ్రగ్‌ స్టోర్లలో గుట్టలు గుట్టలుగా పడిఉన్నాయి. అవి అవసరం లేదని వైద్యులు సూచించినా పట్టించుకోకుండా నాటి మంత్రుల ఒత్తిళ్ల మేరకు కొనుగోలు చేశారు. ఇవి కార్మికులకు ఏమాత్రం అవసరం లేనివని వైద్యులు చెబుతున్నారు. వీటిని ఓసారి పరిశీలిస్తే... టాక్రోజ్‌ ఆయింట్‌మెంట్, సిల్కిన్‌ స్కాల్ప్‌ సొల్యూషన్, డిసొనైడ్‌ లోషన్‌ అండ్‌ క్రీమ్, క్యాల్సిట్రోల్‌ ఆయింట్‌మెంట్,  అడపాలెన్‌ సి జెల్, క్లోబెట్‌సాల్‌ మరియు సలిసైలిక్‌ యాసిడ్‌ ఆయింట్‌మెంట్, సెప్‌గార్డ్‌ జెల్,  యూ–రిల్‌ క్రీమ్‌ లాంటివి ఉన్నాయి. సరఫరాదారులతో కలసి కమీషన్లు వసూలు చేసుకున్నట్లు దీనిద్వారా తేలుతోంది.

అధిక రేట్లు.. ఆపై అవసరం లేని మందులు
► ఎలాంటి టెండర్లు లేకుండా నామినేషన్ల ప్రాతిపదికన రూ.కోట్ల విలువైన మందుల కొనుగోళ్లకు అచ్చెన్నాయుడు మంత్రిగా ఉండగా ఆర్డర్లు ఇచ్చారు.
► లెజెండ్‌ ఎంటర్‌ప్రైజెస్, ఎవెంటార్, ఓమ్ని మెడి తదితర సంస్థలకు భారీ లబ్ధి చేకూర్చారు.
► ఆయా సంస్థల నుంచి అచ్చెన్న, కొందరు అధికారులు భారీగా ప్రయోజనం పొందారు.
► ల్యాబొరేటరీ కిట్‌ల కోసమే రూ.237 కోట్లు వ్యయం చేశారు
► రూ.16 వేలు విలువ చేసే బయోమెట్రిక్‌ మిషన్లను రూ.70 వేలు చెల్లించి కొనుగోలు చేశారు.
► ఫ్యాబ్రికేటెడ్‌ కొటేషన్ల ద్వారా మందులు, శస్త్రచికిత్సల పరికరాలు, ఫర్నీచర్, ఈసీజీ మెషీన్లు కొనుగోలు చేశారు.
► సీవరేజీ ట్రీట్‌మెంట్‌ ప్లాంటు పనులు ఎలాంటి టెండరు లేకుండా జలం ఎన్విరాన్‌మెంట్‌ సంస్థకు అప్పగించారు.
► నామినేషన్‌ కింద రూ.89.58 కోట్ల విలువైన మందులు కొనుగోలు చేశారు.
► కార్మికులకు షాంపులు, క్రీముల పేరుతో రూ.10.50 కోట్లు వ్యయం చేశారు
► రాష్ట్రవ్యాప్తంగా 74 ఈఎస్‌ఐ డిస్పెన్సరీలు ఉండగా ఇండెంట్‌ (మందుల జాబితా) ఇవ్వకుండానే మంత్రి, అధికారులు కొనుగోలు చేశారు.
► ఏటా రూ.300 కోట్లు బడ్టెట్‌ ఉండగా రూ.500 కోట్లకు పైగా ఆర్డర్లు పెట్టి దోచేశారు. 
► డా.రవికుమార్, డా.సి.కె.రమేష్‌కుమార్, డా.విజయకుమార్‌ ఈఎస్‌ఐ డైరెక్టర్లుగా ఉండగా అక్రమాలు జరిగినట్లు విజిలెన్స్‌ నివేదికలో వెల్లడైంది. 
► ఈ వ్యవహారంలో సుమారు రూ.151 కోట్లకుపైగా కార్మికుల సొమ్ము నాటి మంత్రి, అధికారులు, కాంట్రాక్టర్ల జేబుల్లోకి వెళ్లింది.

మరిన్ని వార్తలు