దేవుడికే శఠగోపం..! 

2 Jul, 2020 11:51 IST|Sakshi
కిట్టాలపాడు సమీపంలో గుట్టుగా చేతులు మారిన రాధామాధవ మఠం భూములు (ఇన్‌సెట్లో) టెక్కలిలో ఉన్న రాధామాధవ మఠం

గుట్టుగా రాధామాధవ మఠం భూముల విక్రయాలు

చక్రం తిప్పిన టీడీపీ కార్యకర్తలు

మఠం నిర్వాహకుల పాత్రమైనా అనుమానాలు  

టెక్కలి: స్థానిక చిన్నబ్రాహ్మణవీధిలోని రాధామాధవస్వామి మఠం భూములపై అక్రమార్కుల కన్ను పడింది. మఠం నిర్వహణ కోసం టెక్కలి మండలం గూగెం, డమర సరిహద్దు ప్రాంతాలతోపాటు నందిగాం మండలం గురువూరు తదితర చోట్ల వందల ఎకరాల భూములను పూరీ జగన్నాథ సంస్థాన్‌ నుంచి అప్పగించారు. గతంలో టెక్కలిని పాలించిన పర్లాఖిమిడి గజపతి రాజుల నుంచి కేటాయించిన ఈ భూముల బాధ్యతను 1885లో గోవింద్‌ చరణ్‌దాస్‌ గోస్వామికి అప్పగించారు. డమర, గూగెం సరిహద్దు ప్రాంతాల్లో సర్వే నంబరు 261లో సుమారు 58 ఎకరాలు, సర్వే నంబరు 228, 229, 259 నంబర్లలో సుమారు 40 ఎకరాలతోపాటు నందిగాం మండలం గురువూరు ప్రాంతాల్లో వందల ఎకరాల భూముల నుంచి వచ్చే ఆదాయంతో స్వామికి నిత్య కైంకర్యాలు జరుగుతుండేవి. వీటితో పాటు పూర్వం పూరీ జగన్నాథస్వామి దర్శనానికి వెళ్లే భక్తులకు అవసరమైన సదుపాయాలను ఈ భూముల నుంచి వచ్చే ఆదాయంతో సమకూర్చేవారు. కాల క్రమేణా గోవింద్‌ చరణ్‌ దాస్‌ గోస్వామి పూరీ జగన్నాథస్వామి సంస్థాన్‌కు వెళ్లిపోవడంతో ఈ భూములపై పర్యవేక్షణ కొరవడింది.  

భక్తుల అవతారం ఎత్తిన టీడీపీ కార్యకర్తలు  
గత ప్రభుత్వ హయాంలో నరసింగపల్లి, కిట్టాలపాడు గ్రామానికి చెందిన కొంత మంది టీడీపీ కార్యకర్తలు ముందుగా భక్తుల అవతారం ఎత్తారు. ఆ తర్వాత మెల్లగా భూములపై కన్నేశారు. దీంతో కొంత మంది రెవెన్యూ అధికారులను తమకు అనుకూలంగా మార్చుకుని వెబ్‌ల్యాండ్‌లో రికార్డులను తారుమారు చేసే పనిలో పడ్డారు. వీరి ప్రయత్నాలకు కొంత మంది రెవెన్యూ అధికారులు అండగా నిలవడంతో ఒక్కో ఎకరాకు రూ.30 వేల నుంచి రూ.50 వేల వరకు ముట్టజెప్పినట్లు తెలుస్తోంది. ఒక్కో ఎకరం రూ.3 లక్షల నుంచి రూ.4 లక్షల వరకు విక్రయించినట్లు సమాచారం.

ఈ విధంగా రూ.కోట్లు దోచుకున్నట్లు ఆరోపణలున్నాయి. వెబ్‌ల్యాండ్‌లో కొన్ని చోట్ల గోవింద్‌ చరణ్‌ దాస్‌ గోస్వామి పేరును చూపే విధంగా రికార్డులు తారుమారు చేసేశారు. సర్వే నంబర్లను సబ్‌ డివిజన్లుగా మార్చేసి కొనుగోలుదారుల పేర్లను వారసత్వంగా నమోదు చేసినట్లు భోగట్టా. ఈ విధంగా సుమారు 110 మందికి విక్రయించినట్లు తెలుస్తోంది. మఠం భూములను కొంత మంది టీడీపీ కార్యకర్తలు గుట్టుచప్పుడు కాకుండా విక్రయించారంటూ తెలియడంతో భక్తులు ఆందోళన చెందుతున్నారు. మఠానికి కేటాయించిన భూముల వివరాలు మొత్తం బహిర్గతం చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు.

రాధామాధవ మఠం భూములు చేతులు మారడంలో మఠం నిర్వాహకుల పాత్రపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వాస్తవానికి మఠానికి చెందిన భూముల క్రయవిక్రయాలు చేపట్టకూడదనే నిబంధనలు ఉన్నాయి. ఇక్కడ పరిస్థితులు మాత్రం భిన్నంగా కనిపిస్తున్నాయి. ఇన్ని వందల ఎకరాల అమ్మకాలు మఠం నిర్వాహకుల ప్రమేయం లేకుండా జరిగే అవకాశం లేదని భక్తులు ఆరోపిస్తున్నారు. మఠం నిర్వాహకుల వివరణ కోసం ప్రయత్నించగా వారు అందుబాటులో లేరు.  

గతంలో మా దృష్టికి వచ్చాయి.. 
టెక్కలిలో ఉన్న రాధామాధవ మఠానికి చెందిన భూములను విక్రయిస్తున్నట్లు గతంలో మా దృష్టికి వచ్చింది. అప్పట్లో మఠం నిర్వాహకుల వద్ద విషయం తెలుసుకున్నాం. ఎలాంటి విక్రయాలు జరగలేదని, మఠం భూముల పత్రాలు తమ వద్ద అందుబాటులో లేవంటూ దాట వేసే ప్రయత్నాలు చేశారు. రెవెన్యూ అధికారులను సంప్రదించగా తమ వద్ద పూర్తి స్థాయిలో పత్రాలు లేవంటూ చెప్పారు. మఠం భూములను దేవదాయ శాఖ ఆదీనంలోకి తీసుకునేలా 43 రిజి్రస్టేషన్‌ ప్రక్రియ చేపడతాం. మఠం భూముల విషయాన్ని  ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్తాం.
– జి.ప్రసాద్‌బాబు, దేవదాయ శాఖ ఇన్‌స్పెక్టర్, సోంపేట  

మరిన్ని వార్తలు