వైఎస్సార్‌ సీపీతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యం

17 Jan, 2019 13:45 IST|Sakshi
మాట్లాడుతున్న కాసు, పక్కన పార్టీ నేతలు శ్రీకృష్ణదేవరాయలు, పీఆర్కే, ఏసురత్నం తదితరులు

టీడీపీకి చెందిన 265 కుటుంబాలు వైఎస్సార్‌  సీపీలో చేరిక

గురజాలలో కార్యకర్తలను  సాదరంగా పార్టీలోకి  ఆహ్వానించిన నేతలు

ప్రభుత్వ తీరుపై వైఎస్సార్‌ సీపీ నేతల ఫైర్‌

గుంటూరు, జంగమహేశ్వరపురం (గురజాల రూరల్‌): వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమని ఆ పార్టీ గురజాల నియోజకవర్గ సమన్వయకర్త  కాసు మహేష్‌రెడ్డి చెప్పారు. మండల పరిధిలోని జంగమహేశ్వరపురం గ్రామంలో రావాలి జగన్‌.. కావాలి జగన్‌ కార్యక్రమాన్ని బుధవారం నిర్వహించారు. ప్రభుత్వ అవలంబిస్తున్న విధానాలపై ఆ పార్టీ నరసరావుపేట పార్లమెంటరీ నియోజకవర్గ సమన్యయకర్త లావు శ్రీ కృష్ణదేవరాయలు, గుంటూరు పశ్చిమ నియోజకవర్గ సమన్వయకర్త చంద్రగిరి ఏసురత్నం, తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే ముస్తఫా, మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, మాజీ ఎమ్మెల్సీ టీజీవి కృష్ణారెడ్డిలు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రాష్ట్ర ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్రలో ఇచ్చిన హామీలకు ఆకర్షితులై మండలంలోని జంగమహేశ్వరపురం గ్రామానికి చెందిన 265 కుటుంబాలకు చెందిన 610 మంది పార్టీలో చేరారు. కాసు మహేష్‌రెడ్డి సమక్షంలో వివిధ కులాలకు చెందిన వారు పార్టీలో చేరారు. వారికి నేతలు పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు.

జనసంద్రంగా జంగమహేశ్వరపురం
వైఎస్సార్‌ సీపీ రాష్ట్ర అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి, లావు కృష్ణదేవరాయులు, తనకు ఒక్క అవకాశం కల్పిస్తే రాష్ట్రం, గురజాల రూపు రేఖలు మారుస్తామని కాసు మహేష్‌రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సభనుద్ధేశించి కాసు మాట్లాడుతూ  తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఓటమి భయంతోనే జగన్‌ ప్రవేశపెట్టిన నవరత్నాలను చంద్రబాబునాయుడు కాపీ కొడుతున్నాడని , దానిలో భాగంగానే పింఛన్లు పెంపు చేయడం జరిగిందన్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే గురజాల, జంగమహేశ్వరపురంలను కలిపి మునిసిపాలిటిగా మార్చి అభివృద్ధి అంటే ఏమిటో చూపిస్తామన్నారు. రానున్న రాజన్న రాజ్యంలో పింఛన్‌ రూ.3వేలు, పత్తి క్వింటాకు రూ.6,500 లు తాగునీటి కోసం రూ.2 వేల కోట్లతో పథకం ఏర్పాటు చేసి నీటి ఎద్దడి లేకుండా చేస్తామన్నారు.

టీడీపీకి బుద్ధి చెప్పాలి
టీడీపీకి బుద్ధి చెప్పే రోజులు దగ్గర పడుతున్నాయని మాచర్ల ఎమ్మెల్యే, పార్టీ చీఫ్‌ విప్‌ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కోట్లు ఖర్చు పెట్టి తప్పుడు ప్రచారాలు నిర్వహిస్తూ ప్రతి హామీ నెరవెర్చకుండా మోసపూరిత ప్రకటనలతో కాలం వెళ్లదీస్తున్నారన్నారు. కార్యకర్తలకు అండగా ఉంటామన్నారు. ముస్లింలకు 4 శాతం రిజర్వేషన్‌ కల్పించి, వారి అభివృద్ధికి కృషి చేసిన ఘనత ఒక్క దివంగత నేత డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డికి దక్కుతుందని గుంటూరు తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే ముస్తఫా అన్నారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చి నాలుగున్నరేళ్లు పూర్తయినా ముస్లింలకు మంత్రి పదవి ఇవ్వలేదన్నారు. చంద్రబాబును నమ్మే పరిస్థితుల్లో ప్రజలు లేరని వైఎస్సార్‌ సీపీ నరసరావుపేట పార్లమెంటరీ నియోజకవర్గ సమన్వకర్త లావు శ్రీకృష్ణదేవరాయులు అన్నారు. అమలుకానీ హామీలు ఇచ్చి రైతులు, డ్వాక్రా , నిరుద్యోగులు, బాబు వస్తే జాబు వస్తుందని ఎదురుచూసి విసుగు చెంది నిన్ను నమ్మం బాబు అని రాష్ట్ర ప్రజలు అందరూ గగ్గోలు పడుతున్నారని విమర్శించారు.

అక్రమ కేసులు అన్యాయం
ఒక్క గురజాల నియోజకవర్గంలోనే వైఎస్సార్‌ సీపీ నాయకులు, కార్యకర్తలపై 8వేల అక్రమ కేసులు బనాయించారని పశ్చిమ నియోజకవర్గ సమన్వయకర్త చంద్రగిరి ఏసురత్నం సూచించారు. పోలీసులు చట్టబద్దంగా విధులు నిర్వహించాలని సూచించారు. అక్రమ కేసులు బనాయించి వారిని ఎన్నో ఇబ్బందులకు పోలీసులు గురిచేశారని ప్రతి విషయాన్ని గమనిస్తూనే ఉన్నామన్నారు. సభలో మాజీ ఎమ్మెల్సీ టీజీవి కృష్ణారెడ్డి, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి ఎనుముల మురళీధర్‌రెడ్డి, సీనియర్‌ నాయకుడు కొమ్మినేని వెంకటేశ్వర్లు, జెడ్పీటీసీలు వి.రామిరెడ్డి, ఎం ప్రకాశ్‌రెడ్డిలు ప్రసంగించారు. పెద్ద సంఖ్యలో పార్టీ అభిమానులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు