వారిది కన్నీరు.. వీరికి పన్నీరు!

5 Nov, 2018 08:43 IST|Sakshi
థాంక్యూ సీఎం అంటూ ప్రకటనలో స్థానిక నాయకులు

తిత్లీ బాధితులకు పరిహారం గోరంత.. ప్రచారం కొండంత

తాగునీటికి ముందు ఫ్లెక్సీలే చేరుకున్న వైనం

తుఫాన్‌ ప్రభావిత ప్రాంతాల్లో  ప్రత్యక్ష సాక్షుల వాదనలు

ముక్కున వేలేసుకుంటున్న తుఫాన్‌ బాధితులు

బతుకులు పోయి వందలాది మంది ఏడుస్తుంటే.. నేతలు మాత్రం పొగడ్తలు కోరుకున్నారు. గ్రామాల్లో నీటితో పోటీ పడి కన్నీరు కురుస్తుంటే.. నాయకులు మాత్రం దాన్ని పన్నీరుగా మార్చుకున్నారు. తిత్లీ ధాటికి సగం జిల్లా సర్వనాశనమైన వేళ అధికార పార్టీ నాయకులు ప్రచార పర్వానికే పెద్ద పీట వేశారు. దాహమో రామచంద్రా.. అంటూ రోదిస్తున్న ప్రాంతాలకు నీటి కంటే ముందు ఫ్లెక్సీలు వెళ్లాయి. ఇళ్లు కోల్పోయి ఎవరు కరుణిస్తారా అని చేతులు జోడించి బాధితులు నిల్చుని ఉంటే వారి చేతుల్లో నిత్యావసరాలు కాకుండా పార్టీ ప్లకార్డులు దర్శనమిచ్చాయి. కరెంటు లేక తీవ్రంగా ఇబ్బందులు పడుతూ సాయం కోసం ఎదురుచూస్తూ ఉంటే థాంక్యూ.. అని చెప్పాలనే సూచనలు వినిపించాయి. టీడీపీ నాయకుల ప్రచార పిచ్చికి తిత్లీ ఓ మౌన సాక్ష్యమైంది.

శ్రీకాకుళం, కాశీబుగ్గ : ప్రచారం.. టీడీపీ నాయకుల ప్రధాన ఆయుధం. ఆపత్కాలంలో కూడా నాయకులు ఈ సాధనాన్ని వదల్లేదు. తిత్లీ ధాటికి సిక్కోలు కకావికలమైన వేళ కూడా సీఎం నుంచి ఎమ్మెల్యేల వరకు ప్రచారంపైనే దృష్టి పెట్టారని సాక్షాత్తు బాధితులే సెలవిస్తున్నారు. తిత్లీ తుఫాన్‌లో అధికారికంగా అధికారులు, పార్టీ పరంగా నాయకులు, కార్యకర్తలు జన్మభూమి కమిటీ సభ్యులు తమకు తోచిన విధంగా పార్టీ ప్రచారానికి పాల్పడుతున్నారు. తిత్లీలో ప్రజలు బాధ పడుతుంటే రూ.కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్న తీరుపై జనం తీవ్రంగా అసంతృప్తి వ్యక్తంచేస్తున్నారు.

జిల్లాలో తిత్లీ తుఫాన్‌ సంభవించిన రెండో రోజుకు గ్రామాలకు, మారు మూల పల్లెలకు తాగునీరు అందక ముందే పార్టీ ఫ్లెక్సీలు చేరుకున్నాయంటే ముఖ్యమంత్రి ప్రచార పిచ్చి అర్థం చేసుకోవచ్చు. పలాసతో పాటు 13 మండలాలను తుఫాన్‌ ప్రభావిత ప్రాంతాలగా గుర్తించినప్పటికీ అత్యధికంగా ఉద్దానం ప్రాంతాలు దెబ్బతిన్నాయి. దీంతో ముఖ్యమంత్రి పలాసలో పాగా వేసినప్పటికీ ప్రచారానికి పరమావధిగా ప్రాధాన్యత ఇచ్చారు. అటు అధికారులు, ఇటు నాయకులు పలు శాఖలకు చెందిన యంత్రాంగాలతో కార్యక్రమాలు నిర్వహించినప్పటికీ «అధికంగా ప్రచారానికి ప్రాధాన్యత ఇస్తున్నారు.

రూ.కోట్ల ఖర్చు
ముఖ్యమంత్రి పలాసలో ఉండగానే ఇంకా అనేక గ్రామాలకు విద్యుత్‌ అందజేయడానికి ముందే ఫ్లెక్సీలు, జెండాలు, ప్లకార్డులు, ఆర్టీసీ బస్సులకు పెయింటింగ్‌లు, కరపత్రాలు, ఒకటేమిటి అనేక రూపాల్లో ప్రచారం మొదలుపెట్టారు. నేటి నుంచి అందించనున్న పరిహారం నేరుగా ఖాతాల్లోకి పడుతున్నప్పటికీ ప్రచారం కోసం రూ.రెండు కోట్ల రూపాయలతో డమ్మీ చెక్కులను విడుదల చేశారు. ఇలా ఏ ఒక్క అవకాశం ఉన్నప్పటికీ ప్రచారానికే ప్రాధాన్యమిస్తున్నారు. జిల్లాలో ఉన్న హోర్డింగ్‌లు లక్షలు ఖరీదు అయినప్పటికీ వాటిపై, ఆర్టీసీ బస్సులపై, చెక్‌లపై ఇలా కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు. ప్రభుత్వం అందిస్తున్న పరిహారంలో కొబ్బరి చెట్టుకు రూ.1500 ఇస్తున్నప్పటికీ దాన్ని రెట్టింపు చెయ్యమని వారు వేడుకుంటున్నా ఎవ్వరూ పట్టించుకోవడం లేదు. ప్రభుత్వ కార్యక్రమం అయితే అధికారులతో ప్రచారం, కాకుంటే నాయకులతో ప్రచారం చేయాలనే ఆదేశాలు ఉన్నాయి. అన్ని రకాల ప్రకటన సామగ్రి ముఖ్యమంత్రి చేరుకునే ముందే వచ్చేస్తున్నాయి.

ప్రచారానికి పెద్ద పీట..
బాధితులు నీరు అందని స్థితిలో ఉంటే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విశాఖ నుంచి పెద్ద ఫ్లెక్సీలు వేసుకుని ప్రచారం చేయడం ఎంతవరకని సబబని అడుగుతున్నాను. అధికారులు మీవెంట ఉన్నపుడు సహాయం ఎలా అందుతుంది. ముఖ్యంగా ప్రచారానికి ప్రాధాన్యత ఇచ్చి ఎవ్వరినీ ఆదుకోలేదు. – చింతాడ మాధవరావు, సున్నాడ

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా