ప్రతిపక్షంలో పోరాటం... అధికారంలో ఆరాటం...

1 Apr, 2019 12:15 IST|Sakshi
ప్రతిపక్షంలో ఉండగా థర్మల్‌ ప్రాజెక్టులకు వ్యతిరేకంగా ప్రసంగిస్తున్న సోమిరెడ్డి

మంత్రి సోమిరెడ్డి రెండు నాల్కల ధోరణి

ఇచ్చిన హామీలు గాలికి

 అధికారంలోకి రాగానే మిన్నకుండిపోయిన వైనం

ముత్తుకూరు మండలంలో థర్మల్‌ విద్యుత్‌ ప్రాజెక్టుల ఏర్పాటు తగదని, కాలుష్యం పెరిగిపోతుందంటూ అప్పట్లో వీరోచితంగా పోరాటాలు చేసిన సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి అధికారంలోకి రాగానే అన్నింటినీ మర్చిపోయారు. ప్రాజెక్టులకు అతి సన్నిహితులయ్యారు. ఎమ్మెల్సీ, వ్యవసాయశాఖ మంత్రి పదవి దక్కించుకొన్న తర్వాత చేసిన వాగ్దానాలు, ఇచ్చిన హామీలను కూడా అటకెక్కించారు. అవేవీ గుర్తులేనట్లుగా వ్యవహరిస్తున్నారు. సోమిరెడ్డి రెండు నాల్కల ధోరణిపై ఈ ప్రాంత ప్రజలు మండిపడుతున్నారు. 

సాక్షి, ముత్తుకూరు: రాష్ట్రంలో విద్యుత్‌ కొరత తీర్చేందుకు, కోతలు నివారించేందుకు దివంగత ముఖ్యమంత్రి డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి పబ్లిక్, ప్రైవేటు రంగాల్లో విద్యుత్‌ ప్రాజెక్టులు మంజూరు చేశారు. ముత్తుకూరు మండలంలో థర్మల్‌ విద్యుత్‌ ప్రాజెక్టుల ఏర్పాటుకు కృషి చేశారు. బొగ్గు దిగుమతికి వీలుగా ఉన్న కృష్ణపట్నం పోర్టుకు సమీపంలో వీటిని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. టీడీపీకి రాని ఆలోచన వైఎస్‌కి వచ్చిందన్న అక్కసుతో నాడు ప్రతిపక్షంలో ఉన్న సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి థర్మల్‌ ప్రాజెక్టులకు వ్యతిరేకంగా ఆందోళనలు సాగించారు. బొగ్గు కాల్చడం వల్ల వచ్చే బూడిద, పొగ, ఇతర వాయువుల మోతాదును గణాంకాలతో వివరిస్తూ నాయకులు, కార్యకర్తలను రెచ్చగొట్టే ప్రసంగాలు చేశారు. యాష్‌పాండ్ల ఏర్పాటుపై పోరాటం చేశారు. చంద్రబాబును తీసుకువచ్చి ముసునూరువారిపాళెంలో సభ పెట్టించారు. అయితే, విద్యుదుత్పత్తిలో స్వయం సమృద్ధి సాధించి, పారిశ్రామికాభివృద్ధి కృషి చేయాలన్న ఏకైక లక్ష్యంతో వైఎస్సార్‌ థర్మల్‌ ప్రాజెక్టులను పూర్తి చేయాలనే లక్ష్యంతో పనిచేశారు.

అధికారంలోకి రాగానే..
2014లో టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి ఎమ్మెల్సీ పదవి దక్కించుకొన్నారు. మంత్రి పదవి పొందారు. థర్మల్‌ ప్రాజెక్టుల పట్ల వైఖరి మార్చుకున్నారు. ప్రాజెక్టుల నుంచి వెలువడే కాలుష్యాన్ని పట్టించుకోవడం మానేశారు. కాలుష్యం వల్ల పంటలు, గ్రామాలు పాడైపోవడం విస్మరించారు. యాష్‌పాండ్‌పై పోరాటాలు చేసిన సోమిరెడ్డి రెండో యాష్‌పాండ్‌ నిర్మాణ కాంట్రాక్టును తన వాళ్లకు ఇప్పించుకోవడం కొసమెరుపు.
సోమిరెడ్డి హామీలు హుష్‌కాకి

  •  ఏపీ జెన్‌కో ప్రాజెక్టులో పనిచేస్తున్న 750 మంది కాంట్రాక్టు కార్మికులు తమను పర్మినెంట్‌ చేయాలంటూ 2017 ఫిబ్రవరిలో వారం రోజులపాటు ధర్నా చేశారు. ఎమ్మెల్సీ హోదాలో ధర్నా వద్ద వెళ్లిన సోమిరెడ్డి 10 రోజుల్లో ప్రభుత్వం నుంచి ఉద్యోగాల నోటిఫికేషన్‌ విడుదల చేయిస్తామంటూ హామీ ఇచ్చారు. నేటి వరకు ఈ హామీ నెరవేరలేదు.
  • ఏపీ జెన్‌కో ప్రాజెక్టు రెండో యాష్‌పాండ్‌ నిర్మాణం వల్ల కాలుష్యానికి గురయ్యే దేవరదిబ్బ గిరిజనకాలనీ వాసులకు ప్యాకేజీ అందజేస్తామని సోమిరెడ్డి హామీ ఇచ్చారు. ప్యాకేజీ పంపిణీ జరగలేదు. యాష్‌పాండ్‌ నిర్మాణం మాత్రం పూర్తయింది.
  •  కాలుష్య కోరల్లో చిక్కుకున్న నేలటూరు పంచాయతీని సురక్షిత ప్రాంతానికి తరలిస్తామంటూ సోమిరెడ్డి హామీ ఇచ్చారు. మాదరాజుగూడూరు వద్ద కాలనీల ఏర్పాటుకు శంకుస్థాపన చేశారు. ఇందుకోసం ప్రాజెక్టులు తమవంతు డిపాజిట్‌ సొమ్ము చెల్లించాయి. అయితే, ఏళ్లు గడిచినా భూముల ఎంపిక పూర్తిస్థాయిలో జరిపించలేకపోయారు. ఫలితంగా అభివృద్ధికి నోచుకోని నేలటూరు పంచాయతీ త్రిశంకు స్వర్గంలో కొట్టుమిట్టాడుతోంది.
  •  గోపాలపురంలో సాధారణ ఉప్పు ఉత్పత్తి మానేసిన లైసెన్సీలకు పరిహారం ఇప్పిస్తామంటూ పలుమార్లు సోమిరెడ్డి హామీలు ఇచ్చారు. లైసెన్సీలను ముఖ్యమంత్రి చంద్రబాబు వద్దకు తీసుకెళ్లారు. పలువురు లైసెన్సీలు కాలం చేస్తున్నప్పటికీ పరిహారం మాత్రం పంపిణీ జరగలేదు.
  • నేలటూరు జెన్‌కో ప్రాజెక్టు జాతికి అంకితం చేసే సందర్భంలో సీఎం చంద్రబాబు మాట్లాడుతూ కృష్ణపట్నం రిలయన్స్‌ విద్యుత్‌ ప్రాజెక్టు ఏర్పాటయ్యే ప్రసక్తే లేదని ప్రకటించారు. ఈ ప్రాజెక్టు కోసం రైతుల నుంచి సేకరించిన భూములకు ఒక పరిష్కారం చూపుతామని మంత్రి సోమిరెడ్డి గతంలో ప్రకటించారు. కానీ ఒక్క అడుగు కూడా ముందుకుపడలేదు.
  • థర్మల్‌ విద్యుత్‌ ప్రాజెక్టులు, కృష్ణపట్నం పోర్టు, పామాయిల్‌ ఫ్యాక్టరీల్లో స్థానిక యువకులకు ఉద్యోగాలు కల్పించే అంశంపై టీడీపీ సర్కారు ప్రత్యేక శ్రద్ధ తీసుకోలేదు. రిలయన్స్‌ ప్రాజెక్టు మూతపడడం వల్ల ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కోల్పోయిన కృష్ణపట్నం పంచాయతీ ప్రజల సమస్యపై దృష్టి పెట్టలేదు. సీఎస్సార్‌ నిధులు ఉన్నప్పటికీ కనీసం రిలయన్స్‌ కాలనీవాసులు కోరుకున్న ఆలయ నిర్మాణం జరగనేలేదు. ఎన్నికల ప్రచారంలో ఈ ప్రధాన అంశాలను చర్చించకుండా, సమస్యలను ప్రస్తావించకుండా ప్రత్యర్థులపై విమర్శలు సంధించేందుకే సోమిరెడ్డి పరిమితమయ్యారు. టీడీపీ వైఫల్యాలు ప్రజలకు గుర్తుకురాకుండా జాగ్రత్త పడుతున్నారు.
మరిన్ని వార్తలు