అభివృద్ధిపైనే దృష్టి

24 May, 2015 01:33 IST|Sakshi

మినీ మహానాడులో జిల్లా ఇన్‌చార్జి మంత్రి అయ్యన్నపాత్రుడు
 కార్యకర్తల కోసం ఏం చేయడానికైనా సిద్ధమని వెల్లడి
 పార్టీకి అనుగుణంగా పనిచేయని అధికారులను బదిలీ చేస్తామని హెచ్చరిక
 జల రవాణా పునరుద్ధరణ, పోర్టు, ఫిషింగ్ హార్బర్ నిర్మించాలంటూ తీర్మానాలు
 
 పాలకొల్లు :జిల్లా సమగ్రాభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని జిల్లా ఇన్‌చార్జి మంత్రిగా వ్యవహరిస్తున్న పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీహెచ్.అయ్యన్నపాత్రుడు తెలి పారు. పాలకొల్లు బ్రాడీపేట బైపాస్ రోడ్డులో శనివారం నిర్వహించిన టీడీపీ మినీ మహానాడు సభలో ఆయన ముఖ్య ప్రసంగం చేశారు. 16 వేల ఎకరాల అటవీ భూములను పరిశ్రమల స్థాపనకు ఉపయోగించి యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తామని మంత్రి చెప్పారు. కొబ్బరి, కోకో, మత్స్య ఆధారిత పరిశ్రమల ఏర్పాటు, పర్యాటక అభివృద్ధిపై దృష్టి సారిస్తామన్నారు. టీడీపీ అధికారంలోకి రావడానికి ప్రధాన కారణమైన జిల్లాలోని పార్టీ కార్యకర్తలను కాపాడుకోడానికి దేనికైనా సిద్ధమని పేర్కొన్నారు. పార్టీకిఅనుగుణంగా పనిచేయని అధికారులను ఎక్కడికైనా బదిలీ చేస్తామని హెచ్చరించారు.
 
 రాష్ట్రంలోని గ్రామ పంచాయతీలకు 13వ ఆర్థిక సంఘం నుంచి రూ.1,280 కోట్లు నిధులు విడుదల చేశామని చెప్పారు. పాలకవర్గాలను ఏకగ్రీవంగా ఎన్నుకున్న పంచాయతీలకు రూ.7 లక్షల చొప్పున రూ.128 కోట్లు విడుదల చేశామని వివరించారు.  రాష్ట్ర స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి పీతల సుజాత మాట్లాడుతూ మహిళలకు ప్రత్యేక అవకాశాలు కల్పిం చడానికే  ఇసుక ర్యాంపులు, ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వహణను డ్వాక్రా సంఘాలకు అప్పగించామన్నారు. మహిళలపై దాడులను నిరోధించేందుకు సర్కారు కృషి చేస్తోందని చెప్పారు. తొలుత వేదికపై ఉంచిన ఎన్టీఆర్ విగ్రహానికి మంత్రి అయ్యన్నపాత్రుడు పూలమాలవేసి నివాళులు అర్పించగా, పార్టీ జిల్లా శాఖ అధ్యక్షులు, ఎంపీ తోట సీతారామలక్ష్మి జ్వోతి ప్రజ్వలనం చేశారు.
 
 ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు సారధ్యంలో నిర్వహించిన సభలో ఎంపీలు మాగంటి వెంకటేశ్వరరావు (బాబు), మాగంటి మురళీమోహన్, ప్రభుత్వ విప్ అంగర రామ్మోహన్, పార్టీ జిల్లా పరిశీలకుడు, పెడన ఎమ్మెల్యే కాగిత వెంకట్రావు, ఎమ్మెల్యేలు పులపర్తి రామాంజనేయులు, పితాని సత్యనారాయణ, వేటుకూరి శివరామరాజు, కేఎస్ జవహర్, గన్ని వీరాంజనేయులు, బడేటి కోటరామారావు (బుజ్జి), బూరుగుపల్లి శేషారావు, ముప్పిడి వెంకటేశ్వరరావు, మొడియం శ్రీనివాసరావు, ఆరిమిల్లి రాధాకృష్ణ వివిధ అంశాలపై ప్రసంగించారు. డీసీసీబీ చైర్మన్ ముత్యాల రత్నం,  మాజీ ఎమ్మెల్సీ బొమ్మడి నారాయణరావు, మునిసిపల్ చైర్మన్ వల్లభు నారాయణమూర్తి, ఏఎంసీ చైర్మన్ గొట్టుముక్కల గాంధీ భగవాన్‌రాజు, నాయకులు బోణం నరసింహరావు, గండేటి వెంకటేశ్వరరావు, పెచ్చెట్టి బాబు, కర్నేన గౌరునాయుడు, మహ్మద్‌జానీ తదితరులు పాల్గొన్నారు.
 

మరిన్ని వార్తలు