టీడీపీ నేతల గ్రానైట్‌ దందా

14 Sep, 2019 04:39 IST|Sakshi

డొల్ల కంపెనీలు, వే బిల్లులు సృష్టించి అక్రమంగా గ్రానైట్‌ తరలింపు 

ప్రకాశం జిల్లాలో జనవరి–మే వరకు రూ.300 కోట్ల రాయల్టీ ఎగవేత 

మైనింగ్‌ మాఫియాకు టీడీపీ మాజీ ఎమ్మెల్యేల అండదండలు

సాక్షి, అమరావతి: తెలుగుదేశం పార్టీ నేతలు విచ్చలవిడిగా దోపిడీ పర్వం సాగించారు. మైనింగ్‌ మాఫియాకు సహకరించి.. ప్రభుత్వ ఖజానాకు రావాల్సిన రూ.వందల కోట్ల రాయల్టీని ఎగ్గొట్టి, జేబులు నింపుకున్నారు. డొల్ల కంపెనీలు, దొంగ వే బిల్లులు సృష్టించి ప్రకాశం జిల్లా నుంచి విలువైన గ్రానైట్‌ను అక్రమంగా ఇతర రాష్ట్రాలకు తరలించారు. గ్రానైట్‌ దోపిడీ వెనుక టీడీపీ మాజీ ఎమ్మెల్యేల పాత్ర ఉన్నట్లు విచారణలో వెల్లడైంది. ప్రకాశం జిల్లాకు చెందిన టీడీపీ మాజీ ఎమ్మెల్యే, గుంటూరు జిల్లాకు చెందిన ముగ్గురు టీడీపీ మాజీ ఎమ్మెల్యేల ప్రమేయం బయటపడింది. రవాణా శాఖ, సేల్స్‌ ట్యాక్స్, జీఎస్టీ, విజిలెన్స్‌ అధికారుల భాగస్వామ్యం ఉన్నట్లు తేలింది. 

ఒక్కో లారీకి రూ.17 వేలు వసూలు 
ప్రకాశం జిల్లాలో దాదాపు 2,500 గ్రానైట్‌ ఫ్యాక్టరీలు ఉన్నాయి. ఒక్క మార్టూరు ప్రాంతంలోనే 700 వరకు పాలిషింగ్‌ యూనిట్లున్నాయి. ఇక్కడి నుంచి గ్రానైట్‌ను ఇతర రాష్ట్రాలకు తరలించాలంటే మూడు సర్టిఫికెట్లు అవసరం. గ్రానైట్‌ కంపెనీకి చెందిన ఇన్‌వాయిస్, మైనింగ్‌ పర్మిట్, ఈ–వే బిల్లు ఉండాలి. చెక్‌పోస్టుల్లో గానీ, తనిఖీ అధికారులు ఆపినప్పుడు గానీ ఇవి చూపించాల్సి ఉంటుంది. గ్రానైట్‌ను క్యూబిక్‌ మీటర్లలో సైజుల వారీగా తరలిస్తారు. సైజులను బట్టి ప్రభుత్వానికి రాయల్టీ చెల్లించాలి. ప్రతి రూ.లక్ష లావాదేవీకి 18 శాతం జీఎస్టీ (రూ.18,000) చెల్లించాలి. రిజిస్టర్‌ అయిన కంపెనీ పేరిట ఉన్న మైనింగ్‌ పర్మిట్, ఈ–వే బిల్లుల ప్రకారం ప్రభుత్వానికి రాయల్టీ చెల్లించాల్సి ఉంటుంది. కానీ, మైనింగ్‌ మాఫియా సభ్యులు డొల్ల కంపెనీల పేరిట సృష్టించిన దొంగ ఈ–వే బిల్లులతో గ్రానైట్‌ లారీలను తరలించారు.

దొంగ ఈ–వే బిల్లుల ముద్రణ, నకిలీ మైనింగ్‌ పర్మిట్ల వ్యవహారం మొత్తం బల్లికురవ కేంద్రంగా సాగినట్లు పోలీసుల విచారణలో తేలింది. అద్దంకి, మార్టూరు నుంచి గ్రానైట్‌ను సరిహద్దులు దాటించేందుకు ఒక్కో లారీ నుంచి రూ.17 వేల చొప్పున వసూలు చేశారు. ఇందులో రూ.5 వేలు ప్రభుత్వ అధికారులకు, మిగిలిన రూ.12 వేలు టీడీపీ మాజీ ఎమ్మెల్యేలకు వాటాలు ఇచ్చేవారు. అద్దంకి, మార్టూరు నుంచి వినుకొండ, సంతమాగులూరు అడ్డరోడ్డు మీదుగా పిడుగురాళ్ల, దాచేపల్లి, అక్కడినుంచి తెలంగాణకు గ్రానైట్‌ను అక్రమంగా తరలించేవారు. ఈ మార్గంలో ఎవరైనా అధికారులు ఆపితే వినుకొండకు చెందిన మైనింగ్‌ మాఫియా రంగప్రవేశం చేసి, వ్యవహారాన్ని చక్కబెట్టేది. ఈ అక్రమ రవాణాకు టీడీపీ మాజీ ఎమ్మెల్యేలు అండగా నిలిచి రూ.కోట్లు వెనకేసుకున్నారు. గ్రానైట్‌ దోపిడీ వ్యవహారాన్ని రెండు మూడు రోజుల్లో ఆధారాలతో సహా బహిర్గతం చేయనున్నట్లు ప్రకాశం జిల్లాకు చెందిన ఓ పోలీసు అధికారి చెప్పారు.

270 డొల్ల కంపెనీలు, 16వేల దొంగ వే బిల్లులు 
ప్రకాశం జిల్లా నుంచి అక్రమంగా తరలిపోతున్న గ్రానైట్‌ లారీలను ఇటీవల పోలీసులు, విజిలెన్స్‌ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వినుకొండ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న మైనింగ్‌ మాఫియాకు చెందిన ఇద్దరు కీలక వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. వారిని విచారించడంతో అక్రమాల గుట్టు బయటపడింది. 270 డొల్ల కంపెనీలను సృష్టించి, 16,000 దొంగ వే బిల్లులతో ఈ ఏడాది జనవరి నుంచి మే వరకు ప్రభుత్వానికి చెల్లించాల్సిన రాయల్టీని ఎగ్గొట్టినట్లు అధికారులు నిర్ధారించారు. ప్రకాశం జిల్లాలో ఐదు నెలల కాలంలోనే మొత్తం రూ.300 కోట్ల రాయల్టీని ఎగ్గొట్టినట్లు విజిలెన్స్‌ విభాగం గుర్తించింది.

మరిన్ని వార్తలు