కృష్ణకు సెలవు..బుజ్జికి నెలవు!

29 Nov, 2013 04:56 IST|Sakshi
సాక్షి ప్రతినిధి, ఏలూరు : ఏలూరు నియోజకవర్గంపై గంపెడాశలు పెట్టుకున్న మాజీ ఎమ్మెల్యే అంబికా కృష్ణకు తెలుగుదేశం పార్టీ షాక్ ఇచ్చింది. అంబికా కృష్ణను పక్కనపెట్టిన పార్టీ అధినేత చంద్రబాబు ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గ టీడీపీ సీటును బడేటి కోట రామారావు(బుజ్జి)కు ఖరారు చేసినట్లు తెలిసింది. రేపోమాపో ఏలూరు కన్వీనర్‌గా బుజ్జిని అధికారికంగా నియమించనున్నట్లు సమాచారం. దీంతో జిల్లా కేంద్రంలో తెలుగుదేశం పార్టీ రాజకీయాలు రసకందాయంలో పడ్డాయి. అధిష్టానం నిర్ణయంతో అంబికా కృష్ణ వర్గం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తోంది. సుదీర్ఘకాలంగా పార్టీని అంటిపెట్టుకుని పనిచేసిన తమ నేతకు కాకుండా బయటినుంచి వచ్చిన వారికి సీటు ఖరారు చేయడం ఏమిటని ఆయన అనుచరులు ప్రశ్నిస్తున్నారు. 1999 ఎన్నికల్లో అంబికా కృష్ణ టీడీపీ అభ్యర్థిగా పోటీచేసి గెలిచారు. 2004 ఎన్నికల్లో ఆయనకు సీటు లభించలేదు. 2009 ఎన్నికలో సీటు దక్కినా ఓటమి పాలయ్యారు. ఆ ఎన్నికల్లో ఆయనకు మూడో స్థానం దక్కింది. అప్పటినుంచి ఆయన పార్టీలోనే నామమాత్రంగా పనిచేస్తూ వచ్చారు. పీఆర్పీ నుంచి బడేటి బుజ్జి తెలుగుదేశంలోకి వెళ్లడంతో అంబికా కృష్ణ పరిస్థితి మరింత ఇబ్బందికరంగా మారింది.
 
 ఆధిపత్య పోరులో బుజ్జిదే పైచేయి 
 అంబికా కృష్ణ, బడేటి బుజ్జి వర్గాల మధ్య మొ దటి నుంచీ ఆధిపత్యపోరు నడుస్తోంది. సీటు తమదంటే.. తమదని ఇరువర్గాలు ప్రచారం చేసుకున్నాయి. ఈ దశలో మూడేళ్ల క్రితం టీడీపీ అధిష్టానం ఏలూరు అసెంబ్లీ కన్వీనర్ పదవిని అంబికా కృష్ణకు కట్టబెట్టింది. ఆ తర్వాత పార్టీ వాణిజ్య విభాగం రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు అప్పగించింది. దీంతో బడేటి బుజ్జి ప్రాధాన్యం తగ్గినట్లు ప్రచారం నడిచింది. అయితే బుజ్జికి అసెం బ్లీ స్థానం ఇచ్చే ఉద్దేశంతోనే అంబికా కృష్ణకు వాణిజ్య విభాగం రాష్ట్ర అధ్యక్ష పదవి కట్టబెట్టినట్లు ప్రచారం సాగింది. ఆ సమయంలో బుజ్జికి కన్వీనర్ పదవి లభించలేదు. దీంతో ఏలూరు నియోజకవర్గంలో అంబికా కృష్ణదే పైచేయి అయినట్లయింది. 
 
 సీటు తమకే వస్తుందని ఆయ న వర్గం ఆశించింది. ఇప్పుడు అనూహ్యంగా కృష్ణను పక్కనపెట్టి బుజ్జికి సీటు ఖరారు చేయడాన్ని అంబికా వర్గీయులు జీర్ణించుకోలేకపోతున్నారు. సీటు తమకు వచ్చేసిందని బుజ్జి వర్గం మూడురోజుల క్రితం టపాసులు కాల్చి, మిఠాయిలు పంచింది. అప్పటి నుంచి అంబికా కృష్ణ బయటకు రాలేదు. ఆయనకు ఎమ్మెల్సీ పదవి ఇస్తానని చంద్రబాబు హామీ ఇచ్చినా అది ఎంతవరకూ నెరవేరుతుందోననే అనుమానం ఆయ న్ను కలవరపెడుతోంది. మరోవైపు ఇంతకాలం అంబికా కృష్ణను అంటిపెట్టుకుని ఉన్నవారు, ఆయనకు మద్దతు ఇచ్చినవారు తాజా పరిణామంతో కంగుతిని పునరాలోచనలో పడ్డారు. 
 
>
మరిన్ని వార్తలు