ఖర్చు సొసైటీది.. ఆదాయం టీడీపీది

13 Sep, 2019 11:11 IST|Sakshi
అన్నవరప్పాడు సొసైటీలో నిర్వహిస్తున్న రేషన్‌ డిపో 

సాక్షి, పశ్చిమగోదావరి(పెరవలి) : అన్నవరప్పాడు రేషన్‌ డిపో వ్యవహారంలో తవ్వేకొలదీ అనేక నిజాలు వెలుగుచూస్తున్నాయి. టీడీపీ పాలనలో ఎలా దోచుకున్నదీ ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. సొసైటీ ముసుగులో రేషన్‌ డిపోను ఏర్పాటు చేసి ప్రజలను మభ్యపెట్టి ఇష్టారాజ్యంగా దోచుకున్నారు. ఇటీవల సొసైటీ కమిటీ అధ్యక్షుల పదవీ కాలం ముగియడంతో ప్రభుత్వం కొత్త కమిటీలను ఏర్పాటు చేసింది. దాంతో గత టీడీపీ అక్రమాలు వెలుగులోకి వచ్చాయి. ఈ రేషన్‌ డిపోద్వారా ప్రభుత్వం ఇచ్చే కమీషన్‌ ద్వారా నెలకు రూ.29 వేలు వస్తుంటే ఒక్కరూపాయి కూడా సొసైటీ నిధులకు జమచేయకుండా మొత్తం టీడీపీ నాయకులు బొక్కేశారు. రేషన్‌ డిపో నిర్వహణ అంతా సొసైటీ భవనాల్లో సిబ్బందిని వినియోగించి చేసినా కేవలం సొసైటీ భవనానికి అద్దె రూపంగా కేవలం నెలకు రూ.100 మాత్రమే జమ చేశారంటే దోపిడీ ఏస్థాయిలో జరిగిందో అర్థం చేసుకోవచ్చు. సరుకుల పంపిణీ కోసం ఈ ఐదేళ్లలో సిబ్బందికి జీతాల రూపేణా రూ.9 లక్షలు ఇస్తే, సొసైటీకి కేవలం రూ.6 వేలు అద్దె రూపేణా జమచేశారు. ఒక రేషన్‌ డిపోకు కమీషన్‌గా ఐదేళ్లకు రూ.17.40 లక్షల ఆదాయం వచ్చింది. దీనిలో కేవలం అద్దె రూపేణా రూ. 6వేలు సొసైటీకి జమచేసి మిగిలినదంతా టీడీపీ నేతలు స్వాహా చేశారు. 

2014లో సొసైటీ చేతిలోకి రేషన్‌ డిపో
అన్నవరప్పాడులో రేషన్‌ డిపో 2014 వరకు ప్రైవేట్‌ రేషన్‌ డీలర్‌ అధీనంలో ఉండేది. టీడీపీ ప్రభుత్వం వచ్చిన తరువాత నాయకులే డీలర్‌ అవకతవకలకు పాల్పడుతున్నాడని ఫిర్యాదు చేసి అతనిని తొలగించి మల్లేశ్వరం సొసైటీకి బాధ్యతలు అప్పగించారు. వీరు అన్నవరప్పాడు సొసైటీలో డిపో ఏర్పాటు చేసి అప్పటి నుంచి 2017వరకు కొనసాగించారు. అనంతరం తాము నిర్వహించలేమని మల్లేశ్వరం సొసైటీ లిఖిత పూర్వకంగా అధికారులకు తెల్పడంతో ఆ తరువాత పిట్టల వేమవరం, ఖండవల్లి డీలర్లకు అప్పగించారు. దీంతో స్థానిక టీడీపీ నేతలు స్థానిక ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చి తమకు తాత్కలికంగా డిపోను అప్పగించాలని కోరారు. ఎమ్మెల్యే ఆర్డీఓపై ఒత్తిడి తేవడంతో గ్రామానికి చెందిన బళ్ల లీలాకృష్ణ పేరున 2018 ఏప్రిల్‌లో తాత్కాలిక పర్మిట్‌ ఒక ఏడాదికి అనుమతులు ఇచ్చారు. ఈ గడువు 2019 మార్చితో ముగిసినా నేటికీ ముగిసిన పర్మిట్‌తోనే టీడీపీ నేతలు దోచేస్తున్నారు.

మామూళ్లమత్తులో అధికారులు
ఈ రేషన్‌ డిపోకి 2019 మార్చి నెలాఖరుతో పర్మిషన్‌ ముగిసినా కాసులకు కక్కుర్తి పడిన అధికారులు గుట్టుచప్పుడు కాకుండా ఆ పర్మిషన్‌తోనే నేటికీ డిపోను నడుపుతున్నారు. ఇందుకు సివిల్‌ సప్లయ్‌ అధికారికి భారీ స్థాయిలో ముడుపులు అందడం వల్లే గుట్టుచప్పుడు కాకుండా వ్యవహారం నడిపించారని ఆరోపణలు ఉన్నాయి. 

నష్టాలో ఊబిలో సొసైటీ
ఈ రేషన్‌ డిపో ద్వారా సొసైటీకి ఆదాయం రూ.6 వేలు ఉంటే రేషన్‌ డిపోను నిర్వహించిన సిబ్బందికి జీతాల కింద రూ.9 లక్షలు ఖర్చయింది. దీంతో సొసైటీపై ఆర్థిక భారం పడి నష్టాల ఊబిలో కూరుకుపోయింది. ఈ సొసైటీకి 2014 వరకు ఎరువుల అమ్మకాలతో ఎంతో కోలాహలంగా ఉండేది. టీడీపీ హయాంలో ఎరువుల అమ్మకాలు పూర్తిగా మాని వేయడంతో సిబ్బందికి పనిలేకపోయినా జీతాలు చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడింది.

కొత్త పాలకవర్గం రావడంతో వెలుగులోకి
ఈ రేషన్‌ డిపో సొసైటీలో ఏర్పాటు చేసి దీనిని సొసైటీ సిబ్బందితో నిర్వహించడంతో గ్రామంలో ఎవరికీ ఎటువంటి అనుమానం రాకుండా ఈ దోపిడీ వ్యవహారం కొనసాగింది. ఇటీవల సొసైటీ అధ్యక్షుల పదవీ కాలం పూర్తవ్వడంతో ప్రభుత్వం నూతన కమిటీలను ఏర్పాటు చేసింది. దీంతో కొత్త అధ్యక్షులు బాధ్యతలు చేపట్టిన తరువాత  ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఈడిపో పేరిట దోచేసిన వైనాన్ని ఎమ్మెల్యే దృష్టికి, అక్కడ నుండి మండల, జిల్లా సివిల్‌ సప్లయ్‌ అధికారుల దృష్టికి తీసుకువెళ్లి ఫిర్యాదు చేశారు. దీనిపై సొసైటీ అధ్యక్షుడు పంతం నాగేశ్వరరావుని వివరణ కోరగా తాను సొసైటీ అధ్యక్షుడిగా జూలై 31న బాధ్యతలు చేపట్టానని, సెప్టెంబర్‌లో రేషన్‌ డిపోకి  సంబంధించిన సరుకులకు డీడీ కట్టాలని కార్యదర్శిని అడిగితే డిపోకు, మనకు సంబంధం లేదని చెప్పినట్టు వివరించారు. సంబంధం లేనప్పుడు మన సిబ్బంది ఎలా పనిచేస్తారని నిలదీయడంతో పాటు జీతాలు ఎవరు ఇచ్చారని ప్రశ్నించడంతో అప్పటి అధ్యక్షుడు చెప్పింది చేశామని తెల్పడంతో వ్యవహారం బయటపడిందన్నారు. ఈఐదేళ్లలో సిబ్బందికి నెలకు రూ.15 వేలు చొప్పున జీతం ఇచ్చారని తెలిపారు.

మరిన్ని వార్తలు