ఆశా వర్కర్లకు సర్కారు టోకరా

13 Mar, 2019 02:55 IST|Sakshi
సమస్యల పరిష్కారానికి ధర్నా చేస్తున్న ఆశా వర్కర్లు (ఫైల్‌)

‘104’ అంబులెన్స్‌ల అలవెన్సు రూ.7 కోట్లు ఎగ్గొట్టిన ప్రభుత్వం 

మూడేళ్లుగా పైసా కూడా ఇవ్వలేదని ఆశాల ఆవేదన 

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో వేలాది మంది ఆశా వర్కర్లకు ఇవ్వాల్సిన అలవెన్సులు ఇవ్వకుండా సర్కారు దగా చేసింది. తమతో ప్రతి రోజూ పనిచేయించుకుంటున్న ప్రభుత్వం గడిచిన మూడేళ్లుగా పైసా కూడా ఇవ్వలేదని ఆశా వర్కర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రతి ‘104’ అంబులెన్సుకు ఇద్దరు చొప్పున ఆశా వర్కర్లు పనిచేస్తారు. ఆ వాహనాల వెంట పల్లెలకు వెళ్లడం, అక్కడ ఉన్న రోగులను తీసుకురావడం, గర్భిణులను గుర్తించి వాహనం దగ్గరకు తీసుకురావడం, టీబీ, మూర్ఛరోగులను తీసుకురావడం, వాహనాల్లో సిబ్బందికి సహాయకులుగా ఉండటం వంటి పనులు చేస్తారు. ఇందుకుగాను ఒక్కో వర్కరుకు రోజుకు రూ.100 ఇవ్వాలి. వైఎస్‌ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రతినెలా  ఠంచనుగా చెల్లింపులు జరిపేవారు. కానీ, 2016 నుంచి ఇప్పటివరకూ టీడీపీ ప్రభుత్వం ఒక్క పైసా కూడా చెల్లించలేదు.

రాష్ట్రవ్యాప్తంగా 292 ‘104’ అంబులెన్స్‌లు ఉన్నాయి. రోజుకు 584 మంది ఆశా వర్కర్లు పనిచేయాలి. అంటే రోజుకు రూ.58,400 చెల్లించాలి. ఒక నెలలో 24 రోజులు అంబులెన్స్‌లు తిరుగుతాయి. అంటే నెలకు రూ.14.01 లక్షలు చెల్లించాల్సి ఉంది. ఈ లెక్కన గడిచిన మూడేళ్ల నుంచి ప్రభుత్వం రూ.7 కోట్లు బకాయి పడింది. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకూ పని చేయించుకుంటారని, కానీ, వేతనాలు మాత్రం ఇవ్వడం లేదని ఆశా వర్కర్లు వాపోతున్నారు. ఎన్నిసార్లు విన్నవించినా అధికారులను స్పందించడం లేదని అంటున్నారు. మీకు రూ.3 వేలు వేతనం చెల్లిస్తున్నారుగా, మళ్లీ అలవెన్సులు ఎందుకు అని అధికారులు ఈసడించుకుంటున్నారని, తమకు రావాల్సిన ఇన్సెంటివ్‌లు (ప్రోత్సాహకాలను) సైతం సరిగా ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. త్వరలోనే దీనిపై తాడోపేడో తేల్చుకుంటామని ఆశావర్కర్ల సంఘం ప్రతినిధి ఒకరు చెప్పారు.  

మరిన్ని వార్తలు