భూమి లాక్కున్నారు.. డబ్బులివ్వలేదు!

17 Sep, 2019 12:25 IST|Sakshi
దరఖాస్తును చూపిస్తున్న బాధితులు

‘బాబు’ తీరుపై జగ్గయ్యపేట పేదల ఆక్రోశం

చంద్రన్న ఇళ్ల కోసం ఏడాదిన్నర క్రితం 20 ఇళ్లు తీసుకున్న ప్రభుత్వం

ఎకరాకు రూ.25 లక్షలు ఇస్తామని హామీ

ఆ స్థలంలో 1500 ఇళ్లు నిర్మాణం

నష్టపరిహారం చెల్లించని టీడీపీ ప్రభుత్వం

సాక్షి, విజయవాడ:  వారంతా రెక్కాడితే కాని డొక్కాడని నిరుపేదలు... రెండు, మూడు దశాబ్దల క్రితం ప్రభుత్వం ఇచ్చిన భూమిని సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్న దళిత, బలహీన, వెనుకబడిన వర్గాలకు చెందిన రైతు కుటుంబాలే. తమకు ఉన్న రెండెకరాల భూమి నే తమ సర్వస్వంగా భావించారు. అయితే అటువంటి 12 మందికి చెందిన 20.86 ఎకరాల భూమిని టీడీపీ ప్రభుత్వం బలవంతంగా లాక్కుంది. అదేమంటే నష్టపరిహారం ఇస్తామని చెప్పింది. ఇప్పటి వరకు ఒక్క రూపాయి కూడా రాకపోవడంతో ఆ పేదలంతా లబోదిబోమంటున్నారు.

రూ.5.21 కోట్లు బకాయి!
పేదలకు జగ్గయ్యపేటలోని బలుసుపాడు రోడ్డులో ఆర్‌ఎస్‌ నెం:  530/2,3,5, 531/1,2,4, 532/3, 537/1,2,3 12 మంది పేదలకు 20.86 ఎకరాల భూమి ఉంది. కొంత మందికి రెండు ఎకరాలు ఉండగా.. మరికొంత మందికి ఒక ఎకరా భూమి ఉండేది. వీటిని పేదలకు గతంలో ప్రభుత్వం కేటాయించింది. అప్పటి నుంచి సాగు చేసుకుంటున్నారు. అయితే ఇక్కడ పేదలకు చంద్రన్న, పీఎంఆర్‌వై ఇళ్లు నిర్మించాలని నిర్ణయించింది. దీంతో ఈ భూమిని ప్రభుత్వం తీసుకుంది. ఒక్కొక్క ఎకరాకు రూ.25 లక్షలు చొప్పున రూ.5,21,50,000 చెల్లిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. గత్యంతరం లేని పరిస్థితుల్లో భూమి ప్రభుత్వానికి అప్పగించారు.

ఆ స్థలంలో 1500 ఇళ్లు నిర్మాణం
పేదల వద్ద తీసుకున్న నిధులతో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులతో 1500కు పైగా చంద్రన్న పీఎంఆర్‌వై ఇళ్లు నిర్మించి ఆ ఇళ్లను పేద ప్రజలకు అప్పగించారు. ఈ ఏడాది జనవరి వరకు పేదల తమ డబ్బు కోసం అధికారులు చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. గత్యంతరం లేని పరిస్థితుల్లో 12 మంది తరుపున గారపాటి వెంకటేశ్వరరావు, ముత్యాల వెంకటేశ్వర్లు, కణితి విజయకుమార్, షేక్‌ గౌస్య తదితరులు సోమవారం సబ్‌ కలెక్టర్‌ కార్యాలయంలో జరిగిన స్పందన కార్యక్రమానికి హాజరై తమకు న్యాయం చేయమని ఆర్డీఓ చక్రపాణికి విన్నవించారు.

మరిన్ని వార్తలు