కాశీపట్నం చూడర బాబు

16 Mar, 2017 01:59 IST|Sakshi
కాశీపట్నం చూడర బాబు

రుణమాఫీతో ఆనందంగా ఉన్న రైతన్నను చూడు
సంతోషంతో గంతులేస్తున్న డ్వాక్రా మహిళలను చూడు..
బంగారం ఇంటికి తెచ్చుకున్న అక్కచెల్లెమ్మలను చూడు..
రెండువేలు అందుకుంటున్న నిరుద్యోగ తమ్ముళ్లను చూడు..


ఇదీ.. ఈ రకంగా సాగింది నారావారి నాలుగో బడ్జెట్‌ విన్యాసం
కానీ వాస్తవానికి వీటిలో ఏ ఒక్కటీ జరగలేదు.. అన్నీ బడాయి కబుర్లే హామీలలో ఒక్కటీ అమలు చేయలేదు..  రాజధాని అడుగు ముందుకు పడలేదు యనమలవారి బడ్జెట్‌ ప్రసంగం అంతా గారడి మాటలతో చేసిన విచిత్రమైన విన్యాసాలే.. అంకెలకు వాస్తవానికి పొంతనే లేదు.. బడాయి కబుర్లు.. బాబుగారికి వీరతాళ్లు..

అరచేతిలో వైకుంఠం చూపిస్తూ ఇచ్చిన హామీలన్నిటికీ చంద్రబాబు బడ్జెట్‌ సాక్షిగా మరోమారు మంగళం పలికారు. రైతులను, డ్వాక్రా మహిళా సంఘాలను యథాప్రకారం మళ్లీ మోసం చేశారు. వడ్డీలకే చాలని అరకొర విదిలింపులతో ఉసూరనిపించారు. నాలుగో బడ్జెట్‌లోనైనా కనికరిస్తారని ఆశగా ఎదురుచూస్తున్న లక్షలాది మంది నిరుద్యోగులను నిలువునా మోసం చేశారు. ఇంటికో ఉద్యోగం ఇస్తానని, అప్పటివరకు రూ. 2,000 నిరుద్యోగ భృతి ఇస్తానని వాగ్దానం చేసిన చంద్రబాబు రాష్ట్రంలోని నిరుద్యోగులకు నెలనెలా రూ. 3,500 కోట్ల మేర చెల్లించాల్సి ఉంది. మూడేళ్లు గడచినా... నాలుగు బడ్జెట్లు నడిచినా... వారికి ఒరిగింది శూన్యం. నిరుద్యోగ యువతకు ఆర్థిక సహాయం పేరుతో ఈ బడ్జెట్‌లో రూ.500 కోట్లు విదిలించారు.

వాటితో ఎంత మంది నిరుద్యోగులకు ఎంత భృతి ఇస్తారో వారికే ఎరుక.  చేనేత కార్మికులకు వెయ్యి కోట్ల రూపాయలతో నిధి ఏర్పాటు చేస్తామనే హామీని కూడా బాబు సర్కారు విస్మరించింది. ఆర్యోగ శ్రీకి అరకొర కేటాయింపులే చేశారు. వికలాంగులు, వృద్ధులు, వితంతు పింఛన్లదీ అదే పరిస్థితి. రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించేందుకు రూ. 5,000 కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తామన్న హామీకి ఈ బడ్జెట్‌లోను మంగళం పలికారు. గత మూడు బడ్జెట్‌లలో పూర్తిగా నిర్లక్ష్యం చేసిన బలహీన వర్గాల గృహ నిర్మాణానికి ఈ బడ్జెట్‌లో కూడా అదే అదే మొండిచేయి చూపిం చారు. ఏడు లక్షల బాత్‌రూమ్‌లు నిర్మించనున్నామని ఘనంగా ప్రకటించారు.

అందుకు రూ.1,050 కోట్లు అవసరమైతే రూ.100 కోట్లు కేటాయించారు. అదీ పరిస్థితి. ఫీజు రీయింబర్స్‌మెంట్‌కి అర్హులైన విద్యార్థుల సంఖ్యను దారుణంగా కోతవేస్తున్న ప్రభుత్వం.. ఆ కొద్దిమందికి కూడా అవసరమైనన్ని నిధులు విడుదల చేయకుండా వారి జీవితాలతో ఆడుకుంటున్నది.  ఈ బడ్జెట్‌లోనూ అదే కొనసాగింది. కొన్ని రంగాలకు అంకెలు ఘనంగా కనిపిస్తున్నప్పటికీ వాటికి నిధులు ఎక్కడి నుంచి వస్తాయనే స్పష్టత లేదు. దాంతో ఇవన్నీ కాగితాలకే పరిమితమని రాష్ట్రప్రభుత్వం చెప్పకనే చెప్పినట్లయింది. స్థూలంగా చూస్తే...  కబుర్లు కోటలుదాటాయి.. కాళ్లు పాతాళంలోనే ఉన్నాయి.... అదీ చంద్రబాబు నాలుగో బడ్జెట్‌ తీరు...

మరిన్ని వార్తలు