అంచనాలు పెంచి.. ఆశలను తుంచి

11 Nov, 2019 08:36 IST|Sakshi

సాక్షి, శ్రీకాకుళం : గత టీడీపీ ప్రభుత్వం అంచనాలకు మించి ఖర్చు చేసింది. కానీ ఆ డబ్బు సొంతవారి జేబుల్లోకే వెళ్లింది. మహానేత వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి తలపెట్టిన ప్రాజెక్టులను సకాలంలో పూర్తిచేయలేదు సరికదా అంచనాలను అమాంతంగా పెంచేసింది. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో తమ సన్నిహితులకు, బినామీలకు అంచనాలను పెంచేసిన కాంట్రాక్ట్‌లను అప్పగించి పెద్ద ఎత్తున సొమ్ము చేసుకున్నారు. ఇంత చేసినా ఆ పనులు మాత్రం పూర్తి చేయలేకపోయారు. 87 ప్యాకేజీ పనులు 64శాతం కాగా, 88 ప్యాకేజీ పనులు 81 శాతం, హిరమండలం రిజర్వాయర్‌ పనులు 88 శాతం, మహేంద్రతయన ఆఫ్‌షోర్‌ రిజర్వాయర్‌ పనులు 42 శాతం మాత్రమే జరిగాయి. కానీ చెల్లింపులు మాత్రం అంతకుమించి జరిగాయి. అంతేకాకుండా పనుల్లో అక్రమాలు, లోపాలు చోటు చేసుకున్నట్టు సమాచారం. కొత్త ప్రభుత్వం నియమించిన నిపుణుల కమిటీ ఇదే విషయాన్ని గుర్తించి నివేదికలు ఇచ్చినట్టు సమాచారం. ముడుపుల కోసం చూపించిన శ్రద్ధ ప్రాజెక్టులపై చూపించలేదన్న విషయం స్పష్టమైంది.  

ఇరిగేషన్‌పై విజి‘లెన్స్‌’  
అమాంతంగా అంచనాలు పెంచడం, పనులు అశించిన మేర జరగకపోవడం, అంతకుమించి బిల్లుల చెల్లింపులు చేయడం, రూ.1075 కోట్లతో తొలి అంచనాలు గల వంశధార, బాహుదా నదుల అనుసంధానం ప్రాజెక్టును రూ.6,326.62కోట్లకు పెంచి సింగిల్‌ టెండర్లతో ఎన్నికలకు ముందు ఖరారు చేయడంతో పెద్ద ఎత్తున ఫిర్యాదులు వెళ్లాయి. విజిలెన్స్‌ అధికారులకు లిఖితపూర్వకంగా ఫిర్యాదులు వెళ్లడంతో విచారణ కూడా ప్రారంభించారు. ముఖ్యంగా వంశధార ప్రాజెక్టు సర్కిల్‌ గత పర్యవేక్షక ఇంజినీర్‌ సురేంద్రరెడ్డిపై 33 అభియోగాలతో విజిలెన్స్‌కు ఫిర్యాదు వెళ్లింది. దానితో విచారణ షురూ అయింది. ఇప్పటికే సంబంధిత ప్రాజెక్టు పనుల రికార్డులను విజిలెన్స్‌ అధికారులు తీసుకుని వెళ్లి విచారణ జరుపుతున్నారు. దీంతో ఇరిగేషన్‌లో ఒక టెన్షన్‌ నెలకొంది. ఎవరి వల్ల ఎవరు బుక్‌ అయిపోతారోనన్న భయం పట్టుకుంది. సురేంద్రరెడ్డి కేంద్రంగానే ఎక్కువగా విచారణ జరుగుతోంది. గత ప్రభుత్వ హయాంలో ఆయన చేసిన హడావుడి, దందా అంతా ఇంతా కాదని ఇరిగేషన్‌ వర్గాలే చెప్పుకుంటున్నాయి. చాలా వరకు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహారాలు జరిగాయని, పనుల బిల్లుల చెల్లింపులు కూడా జరిగిన వాటికన్నా ఎక్కువగా చేశారన్న ఆరోపణలు ఉన్నాయి. అంతేకాకుండా అధికార దుర్వినియోగం కూడా చేశారన్న అభియోగాలు ఉన్నాయి. వీటిన్నింటిపైనా ప్రస్తుతం విచారణ జరుగుతోంది. ఇప్పుడిది ఇరిగేషన్‌లో కలకలంగా మారింది.   

⇔ చేయని పనులకు 87ప్యాకేజీలో రూ. 14.68కోట్ల, 88వ ప్యాకేజీలో రూ. 3.18కోట్లు మేర చెల్లింపులు చేశారు. నిర్దేశిత సమయంలో ఆయకట్టుకు నీళ్లందకపోవడమే కాదు ప్రభుత్వంపై పెద్ద             ఎత్తున భారం పడింది.  
⇔ హిరమండలం రిజర్వాయర్‌ పనులను తొలుత రూ. 353.50కోట్లకు అప్పగించా రు. ఇదే పనికి తర్వాత రూ. 407.99 కోట్లకు అంచనాలు పెంచేశారు. అయినప్పటికీ పనులు పూర్తి కాలేదు. 
⇔ మహేంద్ర తయన ఆఫ్‌షోర్‌ రిజర్వాయర్‌ పనులను 2007–08లో రూ. 123.25 కోట్లకు ఒప్పందం కుదిరింది. 2016లో ఇదే ప్రాజెక్టు అంచనాలను రూ. 466.28 కోట్లకు పెంచారు.  
⇔ ఎన్నికలకు ముందు హడావుడిగా టెండర్లు ఖరారు చేసిన వంశధార, బాహుదా నదుల అనుసంధానం ప్రాజెక్టును అయితే 2015లో రూ. 1075కోట్లతో అంచనాలు రూపొందించగా 2019 ఫిబ్రవరి 11న టెండర్లు పిలిచే నాటికి రూ. 6,326.62 కోట్లకు ప్రాజెక్టు వ్యయాన్ని పెంచారు.  
⇔ వంశధార ప్రాజెక్టు రెండో దశ అంచనా వ్యయాన్ని రూ. 933 కోట్ల నుంచి రూ. 1616.23 కోట్లకు 2016 ఫిబ్రవరి 26న పెంచారు. 
⇔ 87వ ప్యాకేజీ పనులను 2005లో హార్విన్‌ సంస్థకు రూ. 72.64కోట్లకు అప్పగించా రు. రూ. 11.48కోట్ల విలువైన పనులను ఆ సంస్థ చేసింది. 2016లో ఆ సంస్థపై సర్కార్‌ వేటు వేసి, రూ. 61.16కోట్ల పనుల వ్యయాన్ని రూ.181.58కోట్లకు పెంచేసి 18 నెలల్లో పూర్తి చేసేలా అప్పటి టీడీపీ ఎంపీ, చంద్రబాబు సన్నిహితుడు సీఎం రమేష్‌కు చెందిన రిత్విక్‌ ప్రాజెక్టు సంస్థకు అప్పగించారు. అంచనా వ్యయా న్ని ఒకేసారి 300 శాతం పెంచినా సీఎం రమేష్‌ సంస్థ సకాలంలో పనులు పూర్తి చేయలేదు. పనులు పూర్తి చేయని రిత్విక్‌ సంస్థకు అదనంగా రూ. 11.35కోట్ల విలువైన పని అప్పగించారు. పనులకు మించి బిల్లుల చెల్లింపు చేశారు.  
⇔ 88 ప్యాకేజీ పనులను 2005లో రూ. 66.68 కోట్లకు శ్రీనివాస కన్‌స్ట్రక్షన్‌ దక్కించుకుంది. 2016నాటికి అది రూ. 20.76కోట్ల విలువైన పనులు చేసింది. 2016లో ఆ సంస్థపై చం ద్రబాబు సర్కార్‌ వేటు వేసింది. మిగిలిన రూ. 45.92కోట్ల విలువైన పనుల వ్యయా న్ని రూ. 179.51కోట్లకు పెంచేసి సాయిలక్ష్మి కన్‌స్ట్రక్షన్‌ సంస్థకు అప్పగించింది. నేటికీ ఆ పనులు పూర్తి కాలేదు. సరికదా ఆ సంస్థకే అదనంగా రూ. 18.91 కోట్ల పనులను అప్పగిస్తూ చంద్రబాబు ప్రభుత్వం ఒప్పందం చేసింది.  

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు