పాలనపై చంద్రబాబుకు పట్టు లేదు

1 Jul, 2018 08:12 IST|Sakshi

రాష్ట్రంలో అవినీతి ప్రభుత్వం రాజ్యమేలుతోంది 

ఎమ్మెల్యేలు డబ్బు తీసుకుని అధికారులకు పోస్టింగులిస్తున్నారు 

సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ  

ఒంగోలు టౌన్‌: రాష్ట్రంలోని ప్రభుత్వ యంత్రాంగంపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పట్టు కోల్పోయారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ పేర్కొన్నారు. ఎమ్మెల్యేలు డబ్బులు తీసుకుని పోస్టింగ్‌లు ఇస్తున్నారని, దాంతో అధికారులు ఇష్టారీతిన అక్రమాలకు పాల్పడుతున్నారన్నారు. శనివారం ఇక్కడి మల్లయ్య లింగం భవన్‌లో నిర్వహించిన సీపీఐ జిల్లా విస్తృత స్థాయి సమావేశంలో, అంతకు ముందు విలేకర్ల సమావేశంలో పార్టీ విధానాలను వెల్లడించారు. రాష్ట్ర రాజకీయాలను ఒక మలుపు తిప్పుతామని, పవన్‌కల్యాణ్‌తోపాటు ఇతర సామాజిక శక్తులను కలుపుకొని ఉభయ కమ్యూనిస్టు పార్టీలు ముందుకు వెళ్తాయన్నారు. 

తమ పార్టీలు మూడు అంశాల్లో భావసారూప్యత కలిగి ఉన్నాయన్నారు. సామాజిక న్యాయం అమలు కాకపోవడం, ప్రాంతీయ అసమానతలు పెరిగిపోవడం, ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలను అమలు చేయకపోవడంపై ప్రజల్లోకి వెళ్లనున్నట్లు స్పష్టం చేశారు.రాష్ట్రంలో అవినీతి ప్రభుత్వం రాజ్యమేలుతోందని ధ్వజమెత్తారు. నెల్లూరులో ఒక అటెండర్‌ను ఏసీబీ వాళ్లు పట్టుకుంటే రూ.100 కోట్లు, విజయవాడలో ఒక టీపీఓని పట్టుకుంటే రూ.500 కోట్ల అక్రమాస్తులు బయటపడ్డాయంటే అవినీతి ఏవిధంగా ఉందో అర్థం చేసుకోవచ్చన్నారు. 

జిల్లా వెనుకబాటుపై 22న ఒంగోలులో భారీ సదస్సు
ప్రకాశం జిల్లా వెనుకబాటుతనంపై సీపీఐ, సీపీఎం ఆధ్వర్యంలో ఈ నెల 22వ తేదీన ఒంగోలులో భారీ సదస్సు నిర్వహించనున్నట్లు రామకృష్ణ వెల్లడించారు. సదస్సు తీర్మానాలకు అనుగుణంగా రాబోయే రోజుల్లో పెద్దఎత్తున ఉద్యమాలకు శ్రీకారం చుట్టనున్నట్లు తెలిపారు. కార్మికుల సమస్యలపై విశాఖపట్నంలో, చేతివృత్తిదారుల సమస్యలపై ఏలూరులో, దళితుల సమస్యలపై రాజమండ్రిలో, అర్బన్‌ సమస్యలపై విజయవాడలో, రైతుల సమస్యలపై గుంటూరులో, విద్యార్ధి – యువజన సమస్యలపై తిరుపతిలో, మహిళల సమస్యలపై అనంతపురంలో, మైనార్టీల సమస్యలపై కర్నూలులో, వ్యవసాయ కార్మికుల సమస్యలపై నెల్లూరులో, వెనుకబడిన ఉత్తరాంధ్ర సమస్యలపై శ్రీకాకుళంలో, వెనుకబడిన రాయలసీమ సమస్యలపై కడపలో సదస్సులు నిర్వహించనున్నట్లు తెలిపారు. సెప్టెంబర్‌ 15వ తేదీ విజయవాడలో భారీ ర్యాలీ, సదస్సు నిర్వహించనున్నట్లు చెప్పారు.

90 లక్షల మంది రోడ్డుపాలు
కేంద్రంలో అధికారంలోకి రాగానే ఏడాదికి రెండు కోట్ల మందికి ఉద్యోగాలు ఇస్తానని ప్రకటించిన ప్రధాని నరేంద్రమోదీ 2.64 లక్షల కంపెనీలు మూసివేయించి 90 లక్షల మందిని రోడ్డుపాలు చేశారని ధ్వజమెత్తారు. విదేశీ బ్యాంకుల్లో 70 లక్షల కోట్ల రూపాయల నల్లధనం ఉంటే దానిని ఇంతవరకు బయటకు తేలేదన్నారు. దేశంలో 73 శాతం సంపద కేవలం ఒక్క శాతం వ్యక్తుల చేతుల్లో ఉందని, మిగిలిన 27 శాతాన్ని కూడా వారికి కట్టబెట్టేందుకు కేంద్రం ప్రయత్నిస్తోందన్నారు. సమావేశంలో సీపీఐ రాష్ట్ర నాయకుడు పీజే చంద్రశేఖరరావు, జిల్లా కార్యదర్శి ఎంఎల్‌ నారాయణ, నాయకుడు ఆర్‌.వెంకట్రావు పాల్గొన్నారు.
 

మరిన్ని వార్తలు