నాడు స్వర్గం.. నేడు నరకం

1 Apr, 2019 10:57 IST|Sakshi

వైఎస్సార్‌ స్వర్ణయుగంలో బ్రాహ్మణుల సంక్షేమానికి పెద్దపీట

గత ఐదేళ్ల టీడీపీ పాలనలో బ్రాహ్మణులకు మొండిచెయ్యి

దరఖాస్తుల దశ దాటని పథకాలు

సాక్షి, ఒంగోలు: దివంగత ముఖ్యమంత్రి డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి పాలన ఓ స్వర్ణయుగం. ఆయన హయాంలో ప్రతిఒక్కరికీ పార్టీలతో సంబంధం లేకుండా సంక్షేమ పథకాల ఫలాలు అందాయి. అందులో భాగంగానే బ్రాహ్మణుల సంక్షేమానికి ఆయన పెద్ద పీట వేశారు. వారి కోసం 24 రకాల పథకాలను అమలు చేశారు. ఆలయాలను అభివృద్ధి చేసి రాష్ట్రవ్యాప్తంగా 30 వేల దేవాలయాల్లో ప్రభుత్వ ఖర్చులతో ధూపదీప నైవేద్యం సేవలను అందుబాటులోకి తెచ్చారు. తద్వారా అర్చకులకు ఎంతో మేలు చేశారు. 2004లో వైఎస్సార్‌ ముఖ్యమంత్రి కాకముందు తొమ్మిదేళ్ల టీడీపీ పాలనలో చంద్రబాబు హయాంలో బ్రాహ్మణుల గురించి పట్టించుకున్న దాఖలాలు లేవు.

ఆలయాల అభివృద్ధిని సైతం నిర్లక్ష్యం చేయడంతో ఎన్నో ఆలయాలు పాడుబడిపోయాయి. వాటిపై ఆధారపడి జీవించే అర్చకులు అష్టకష్టాలకు గురయ్యారు. బ్రాహ్మణులకు ఎలాంటి సంక్షేమ పథకాలూ అమలుచేయకపోవడంతో వారంతా సమాజంలో వెనుకబడ్డారు. ఆ తర్వాత వైఎస్సార్‌ స్వర్ణయుగంలో కోలుకున్నప్పటికీ గడిచిన ఐదేళ్ల టీడీపీ పాలనలో బ్రాహ్మణుల పరిస్థితి మళ్లీ మొదటికొచ్చింది. ఆలయాల గురించి ఆలోచించేవారే లేకపోవడంతో అర్చకుల భవిష్యత్తు ప్రస్తుతం ప్రశార్థకంగా మారిపోయింది.

బ్రాహ్మణ కార్పొరేషన్‌కు రూ.500 కోట్లు కేటాయిస్తామన్న ప్రభుత్వం.. ఎంత కేటాయించిందో, వాటిని ఎవరు కాజేశారో, అర్హులకు ఎంత లబ్ధి చేకూరిందో చెప్పాలని బ్రాహ్మణ పెద్దలు డిమాండ్‌ చేస్తున్నా.. పాలకులు మాత్రం పెదవి విప్పడం లేదు. ఈ విధంగా టీడీపీ ప్రభుత్వం అన్ని రకాలుగా బ్రాహ్మణులను మోసం చేసిన నేపథ్యంలో వారి పరిస్థితిని గమనించిన వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. అంతేగాకుండా నలుగురు బ్రాహ్మణులను ఎమ్మెల్యే అభ్యర్థులుగా ప్రకటించి ఆ సామాజికవర్గం పట్ల తనకున్న చిత్తశుద్ధిని జగన్‌ నిరూపించుకున్నారు. దీంతో బ్రాహ్మణులంతా హర్షం వ్యక్తం చేస్తూ వైఎస్సార్‌ సీపీకి మద్దతు ప్రకటిస్తున్నారు. 

బ్రాహ్మణుల కోసం వైఎస్సార్‌ అమలు చేసిన పథకాలివే...
దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి హయాంలో బ్రాహ్మణులు, అర్చకులు, అర్చకేతరుల కోసం అనేక సంక్షేమ పథకాలు అమలు చేశారు. వాటిలో కొన్ని పూర్తిగా గ్రాంటు రూపంలో ఇవ్వగా, మరికొన్ని గ్రాంటుతో పాటు రుణంగా ఇచ్చారు. గ్రాంటు రూపంలో ఇచ్చిన మొత్తాన్ని తిరిగి చెల్లించాల్సిన అవసరం లేకపోగా, రుణాన్ని మాత్రం స్వల్ప వడ్డీతో నెలసరి వాయిదాలలో తిరిగి చెల్లించారు. ఆ వివరాలు... 
♦ ఉపనయన గ్రాంటు కింద రూ.25 వేలు 
♦ రూ.5 వేలలోపు ఆదాయం కలిగిన అర్చకుని కుటుంబంలోని పిల్లలకు విద్యారుణం కింద రూ.33 వేల గ్రాంటు. 60 నెలల్లో తిరిగి చెల్లించే సౌకర్యం. 2 వేలలోపు ర్యాంకు వచ్చిన వైద్య విద్యార్థులకు, 5 వేలలోపు ర్యాంకు వచ్చిన ఇంజినీరింగ్‌ విద్యార్థుల చదువుకు, వసతి, భోజనం ఖర్చులన్నీ ప్రభుత్వమే భరించింది. రూ.5 వేల నుంచి రూ.12,500లోపు జీతం తీసుకుంటున్న వారికి రూ.33 వేలు వడ్డీలేని విద్యా రుణం.
♦  అర్చకుని కుమారుడు లేదా కుమార్తె వివాహం కోసం లక్ష రూపాయల రుణం.
♦ అర్చకుని సోదరి వివాహానికి రూ.60 వేల రుణం
♦ ఇల్లు కట్టుకునేందుకు రూ.2.50 లక్షల గ్రాంటు. 2015 ఏప్రిల్‌ 1 నుంచి రూ.2.50 లక్షల రుణం.
♦ ఇంటి మరమ్మతుల కోసం 4 శాతం వడ్డీకి లక్ష రూపాయల రుణం.
♦ 65 సంవత్సరాల వయసు దాటిన వారికి వృద్ధాప్యపు భృతిగా నెలకు రూ.1,500.
♦ 4 శాతం వడ్డీతో మోటారు సైకిల్‌కు రుణం.
♦ సొంతిల్లు లేని అర్చకునికి ఇంటి అద్దె, సామాజిక జీవిత బీమా పథకం కింద లక్ష రూపాయల వరకు పాలసీ.

చంద్రబాబు హయాంలో బ్రాహ్మణులను మోసం చేసింది ఇలా...
బ్రాహ్మణ కార్పొరేషన్‌కు రూ.500 కోట్లు ప్రకటించినప్పటికీ కేటాయింపులు కేవలం రూ.230 కోట్లే. అందులోనూ రూ.15 కోట్లకుపైగా అవినీతి. బీఎస్సీ, బీఈడీ చేసిన యువతులు జీవనం కోసం మామిడికాయల కొట్టుపెట్టుకునేందుకు రుణం ఇస్తామన్నారు. వారు దరఖాస్తు చేయగా, టీడీపీ నేతలతో సంతకం పెట్టించుకుని వస్తే మంజూరు చేస్తామన్నారు. దీంతో వారు రుణ ప్రయత్నాలను విరమించుకున్నారు. 
♦ ఓవర్‌సీస్‌ పథకం అంటూ ఘనంగా చెప్పుకుంటున్న ప్రభుత్వం.. 2015–16 మొదలు 2018–19 వరకు రుణం మంజూరు చేసింది కేవలం ముగ్గురికే.
♦ గాయత్రీ పథకం కింద అకడమిక్‌ ఎక్సలెన్సీ కింద టాపర్‌గా నిలిచిన వారికి రూ.10 వేలు మొదలు రూ.20 వేల వరకు ఇవ్వాలి. కానీ మూడు సంవత్సరాలలో ప్రకటించింది 55 మందికి మాత్రమే.
♦ గ్రూప్‌–1 కోచింగ్‌లకు వశిష్ట స్కీము కింద సాయం అందించాలి. కానీ, నాలుగేళ్లలో 64 మంది దరఖాస్తు చేసుకుంటే ఒక్కరికి కూడా సాయం అందలేదు.
♦ ద్రోణాచార్య స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కింద నాలుగేళ్లలో 23 మంది దరఖాస్తు చేసుకోగా, ఒక్కరికీ సాయం అందలేదు. 
♦ చాణుక్య పథకం కింద ఇ–ఆటోలు, టాక్సీలు కొనుగోలు చేసుకునేందుకు రుణం అందించాలి. వాటికి 869 మంది దరఖాస్తు చేసుకుంటే కేవలం 185 మందికే మంజూరు చేశారు.
♦ కశ్యప పథకం కింద 1,186 మంది అనాథలు, వికలాంగులు, వితంతువులు, వృద్ధులు దరఖాస్తు చేసుకోగా, 850 మందికే ఇస్తున్నారు. వీరికి పెన్షన్‌ కేవలం వెయ్యి రూపాయలు మాత్రమే. 
♦ గరుఢ అంత్యక్రియలకు సంబంధించి 129 మందికి మాత్రమే ఇచ్చారు.

శివార్చకులను మోసం చేసిన ఘనత చంద్రబాబుదే

2014 ఎన్నికల టీడీపీ మేనిఫెస్టోలో బ్రాహ్మణ డిక్లరేషన్‌ అంశాలలో శివార్చకులను బీసీ డీగా చేస్తామన్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తర్వాత నేటికీ వారిని పట్టించుకోకుండా మోసం చేశారు. చంద్రబాబు మోసానికి ప్రస్తుత ఎన్నికల్లో శివార్చకులు, బ్రాహ్మణులు ఓటు ద్వారా గుణపాఠం చెప్పాలి. 
- వైఎస్సార్‌ సీపీ బ్రాహ్మణ అధ్యయన కమిటీ రాష్ట్ర సభ్యుడు రెంటచింతల మధుసూదనశర్మ, మార్కాపురం

వైఎస్సార్‌ హయాంలోనే ధూపదీప నైవేద్యాలు ప్రారంభం
ఆలయాల్లో ప్రస్తుతం సంప్రదాయబద్ధంగా జరుగుతున్న ధూపదీప నైవేద్య కార్యక్రమాలను దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి హయాంలోనే ప్రారంభించారు. అలాగే ఉపనయనం, ఇంట్లో పెళ్లి ఖర్చులకు సాయం చేసేవారు. ప్రస్తుతం ఆ విధంగా బ్రాహ్మణుల సంక్షేమానికి జగన్‌ పలు హామీలివ్వడం ఆనందంగా ఉంది. 
– శ్రీనివాస దీక్షితులు

బ్రాహ్మణుల సంక్షేమానికి జగన్‌ హామీ అభినందనీయం
 

బ్రాహ్మణుల సంక్షేమానికి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఇటీవల జరిగిన బ్రాహ్మణ ఆత్మీయ సమావేశంలో హామీలు ఇవ్వడం అభినందనీయం. బ్రాహ్మణుల కార్పొరేషన్‌కు చట్టబద్ధత, రూ.వెయ్యి కోట్ల నిధులు కేటాయించాలని జగన్‌ను కోరగా, సానుకూలంగా స్పందించడం హర్షనీయం. ప్రస్తుత ప్రభుత్వంతో కార్పొరేషన్‌ పథకాలకు చెందిన నిధులు కూడా బ్రాహ్మణులకు రాకుండా జన్మభూమి కమిటీలు అడ్డుకున్నాయి.
- కె.వి.రవికిరణ్‌శర్మ, అర్చక, పురోహిత విభాగం రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి, బొట్లగూడూరు

జీవో నంబర్‌ 76 అమలు చేయాలి
వైఎస్సార్‌ పాలనలో జీవో నంబర్‌ 76 ఇవ్వడం ద్వారా వంశపారంపర్యంగా ఆలయాల్లో విధులు నిర్వహించేందుకు అవకాశం కల్పించారు. ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వాలు వాటిని అమలుచేయడంలో నిర్లక్ష్యం వహించాయి. దానిని అమలుచేయాలంటూ టీడీపీ ప్రభుత్వానికి అనేక సార్లు విజ్ఞప్తి చేసినా ఫలితం లేకుండా పోయింది. ధూపదీప నైవేద్యాలను కూడా కొన్ని ఆలయాలకే పరిమితం చేశారు. బ్రాహ్మణ కార్పొరేషన్‌కు వెయ్యి కోట్లు ఇస్తామని జగన్‌ ప్రకటించడం హర్షణీయం.
- డాక్టర్‌ జి.శ్రీనివాసమూర్తి

మరిన్ని వార్తలు