అభివృద్ధి మాటల్లోనే..

27 Mar, 2019 14:35 IST|Sakshi
శిథిలావస్థకు చేరిన బుడమేరు వాగుపై లోలెవల్‌ వంతెన, బుడమేరుపై వంతెన నిర్మాణానికి వేసిన శిలాఫలకం

కలగానే ఇళ్ల స్థలాలు

యూజీడీ ఊసే లేదు

సాక్షి, గన్నవరం (కృష్ణా): ఓడ దాటే దాక ఓడమల్లయ్య.. ఓడ దాటిన తర్వాత బోడి మలయ్య’ అన్నట్లు ఉంది టీడీపీ నాయకుల తీరు. ఎన్నికల ముందు ఓట్ల కోసం ప్రజలకు హామీల వర్షం కురిపించడం.. ఆ తరువాత ఇచ్చిన వాగ్ధానాలను విస్మరించడం ఆ పార్టీకి పరిపాటిగా మారింది. పేదలకు నివేశన స్థలాల పంపిణీ కలగానే మిగిలిపోయింది. నియోజకవర్గంలో సుమారు 20 వేల వరకు పేద కుటుంబాలు ఉన్నాయి. వీరంతా పేద ప్రజలు. ఐదేళ్లలో ప్రతి జన్మభూమి సభలో, ప్రతి సోమవారం జరిగే మీకోసం కార్యక్రమాల్లో స్థలాల కోసం అర్జీలు సమర్పించినా ప్రయోజనం లేకపోయింది. నియోజకవర్గంలోని అత్యధిక గ్రామాల్లో అందుబాటులో ప్రభుత్వ భూములు ఉన్నప్పటికి పేదలకు పంపిణీ చేసేందుకు పాలకులు ముందుకురాలేదు. గన్నవరం విమానాశ్రయ విస్తరణలో ఇళ్లు కోల్పోతున్న నిర్వాసితులందరికీ ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజి కింద పక్కాగృహాలు నిర్మిస్తామనే పాలకుల హామీ కూడా కార్యారూపం దాల్చలేదు. ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజి పనులకు శంకుస్థాపన చేసి ఏడాది గడుస్తున్నా మెరక పనులు మినహా రోడ్లు, డ్రైయిన్లు, తాగునీరు వంటి కనీస మౌళిక సదుపాయలు కల్పించే దిశగా చర్యలు తీసుకోలేదు.

అలంకారప్రాయంగా శిలాఫలకాలు
ఉంగుటూరు–ఇందుపల్లి మధ్య బుడమేరు కాలువపై ఉన్న లోలెవల్‌ వంతెన ప్రతిసారి వాగు పొంగినప్పుడు ముంపునకు గురై తేలప్రోలు–ఉయ్యూరు ప్రధాన రహదారిపై రోజుల తరబడి రాకపోకలు నిలిచిపోయేవి. 2006లో బుడమేరు అధునికీకరణలో భాగంగా ఈ వంతెన నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేసినప్పటికి కార్యరూపం దాల్చలేదు. టీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత రూ.24 కోట్లతో బుడమేరుపై వంతెన నిర్మాణానికి 2018 ఫిబ్రవరి 22న రాష్ట్ర మంత్రి నారా లోకేష్‌ చేతుల మీదుగా శంకుస్థాపన చేశారు. భూమిపూజ చేసి నెలలు గడుస్తున్న ఇంతవరకు పనులు ప్రారంభంకాలేదు. గన్నవరం, ఆగిరిపల్లి మండలల్లోని మెట్ట ప్రాంత ప్రధాన సాగునీటి వనరైన బ్రహ్మయ్య లింగం చెరువును రిజర్వాయర్‌గా అభివృద్ధి చేస్తామనే పేరుతో రెండేళ్లుగా భారీగా మట్టి దోపిడికి పాలకులు తెరతీశారు. ఎన్నికలు సమీపించిన వేళ హడవుడిగా రిజర్వాయర్‌ పనులకు శంకుస్థాపన చేసి మొక్కుబాడిగా పనులు చేపట్టారు.

రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యంతో.. 
ఉంగుటూరు మండలం తేలప్రోలు గ్రామంలో అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజీ(యూజీడీ) నిర్మిస్తామనే పాలకుల హామీ అమలుకు నోచుకోలేదు. యూజీడీ కోసం ఉపాధి హామీ పథకం నిధులు 70శాతం మంజూరు చేసేందుకు కేంద్రం ముందుకువచ్చింది. అయితే రాష్ట్ర ప్రభుత్వం 20శాతం, గ్రామ పంచాయతీ 10శాతం వాటాగా నిర్ణయించారు. దీంతో అధికారులు తేలప్రోలులో రూ.3.75కోట్లతో 25 కిలోమీటర్లు భూగర్భ డ్రైనేజీ నిర్మాణం చేసేందుకు అచనాలు రూపొందించి అధికారులు ప్రభుత్వానికి నివేదించారు. 30 శాతం నిధులు మంజూరు చేయాల్సిన రాష్ట్ర ప్రభుత్వం, గ్రామపంచాయితీలు మిన్నకుండటంతో అంతర్గత డ్రైనేజీ వ్యవస్థ కలగానే మిగిలింది.

మరిన్ని వార్తలు