ఓటుపై వేటు

28 Feb, 2019 08:27 IST|Sakshi

సార్వత్రిక ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న అధికార పార్టీ పోలింగ్‌ బూత్‌ల వారీగా వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు, సానుభూతిపరుల ఓట్లను తొలగించేందుకు బరితెగించింది. టీడీపీకి వ్యతిరేకంగా పోలయ్యే ఓట్లను గుర్తించి గంపగుత్తగా తొలగించి గెలుపొందా లన్న వ్యూహాన్ని అమలుపరుస్తున్నట్టుగా స్పష్టం అవుతోంది. నిన్నటి వరకు చంద్రగిరి నియోజకవర్గంలోని పరిస్థితే మిగిలిన నియోజకవర్గాల్లోనూ బుధవారం వెలుగుచూసింది. ‘‘నేను ఊరిలో ఉండడం లేదు. దయచేసి నా ఓటు తొలగించండి’’ అంటూ జాతీయ ఎన్నికల కమిషన్‌ వెబ్‌ పోర్టల్‌లో అధికార యంత్రాంగానికి దరఖాస్తులు అందుతున్నాయి. సంబంధిత ఓటరుకు ప్రభుత్వ యంత్రాంగం నోటీసులివ్వడంతో ఖంగు తింటున్నారు. తాము 
దరఖాస్తు చేయకుండా నోటీసులు ఎలా ఇస్తారని నిలదీస్తున్నారు.  

సాక్షి, తిరుపతి: టీడీపీ వ్యతిరేక ఓటర్లే లక్ష్యంగా కొందరు గుర్తుతెలియని వ్యక్తులు రెచ్చిపోతున్నారు. ఓటరుకు తెలియకుండానే తన ఓటును తొలగించేలా కుట్రలు చేస్తున్నారు. మొన్నటి వరకు కేవలం చంద్రగిరికే పరిమితమైన ఓట్ల దొంగలు జిల్లావ్యాప్తంగా పర్యటిస్తూ అధికార పార్టీకి అనుకూలంగా లేని ఓటర్లను జాబితానుంచి తొలగించే పనిలో నిమగ్నమయ్యారు. జిల్లాలో ఓట్ల దొంగలు ఉన్నారని తెలిసినా.. అధికారయంత్రాంగం వారిపై చర్యలు తీసుకోకపోగా.. దొంగలను పట్టించిన వారిపైనే తిరిగి కేసులుపెట్టి అరెస్టు చేయిస్తోంది. గుట్టుచప్పుడు కాకుండా జరుగుతున్న ఓట్ల తొలగింపు ప్రకియపై వైఎస్సార్‌సీపీ కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదుచేసింది. అయినా అధికార పార్టీ అండతో దొంగలు రెచ్చిపోతున్నారు.
 
విజయావకాశాలు లేకపోవడంతో..
తాజా ఓట్ల సవరణ ప్రకారం జిల్లాలో మొత్తం 30,25,222 మంది ఓటర్లు ఉన్నారు. ఎన్నికలు సమీపిస్తుండడంతో అధికార పార్టీ జిల్లాలో జయాపజయాలపై సర్వే నిర్వహించింది. ఆ సర్వేలో టీడీపీకి విజయావకాశాలు లేకపోవడంతో అధినాయకత్వం ఆందోళనకు గురైంది. టీడీపీకి వ్యతిరేక ఓటర్లను తమవైపు తిప్పుకునేందుకు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించిన నవరత్నాల పథకాలను కాపీ కొట్టి కొన్నింటిని ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. ఆ తరువాత పరిస్థితులపై అధికారపార్టీ నేతలు మరోసారి సర్వే నిర్వహించారు. ఆ సర్వేలోనూ అధికార పార్టీకి వ్యతిరేకంగానే ఫలితాలు కనిపించాయి. ఆ పార్టీ నేతలు అడ్డదారులు వెతకడం ప్రారంభించారు.

అందులో భాగంగా కొందరు యువకులకు డబ్బులు ఇచ్చి గ్రామాల్లో సర్వే పేరుతో టీడీపీ వ్యతిరేక ఓటర్లను గుర్తించేందుకు రంగంలోకి దింపారు. సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గమైన చంద్రగిరిపై మొదట దృష్టి సారించారు. జనవరి 12 నుంచి ఫాం–7 ద్వారా ఓట్లు తొలగించాలంటూ ఓటరుకు తెలియకుండానే తన ఓటును తొలగించేందుకు ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేశారు. ఒక్క చంద్రగిరి నియోజకవర్గ పరిధిలోనే 10,833 ఓట్లు తొలగించమని దరఖాస్తులు అందాయి. అప్రమత్తమైన స్థానిక ఎమ్మెల్యే చెవిరెడ్డి జిల్లా అధికారులు, ఎన్నికల కమిషన్‌ను కలిశారు. అయినా ప్రయోజనం కనిపించలేదు. అయితే ఓట్ల దొంగల పట్ల గ్రామస్తులు అప్రమత్తమయ్యారు. గ్రామాల్లో పర్యటిస్తూ ఓట్లను తొలగించే ప్రయత్నం చేస్తున్న వారిని గుర్తించి పట్టుకుని పోలీసులకు అప్పగించడం ప్రారంభించారు. అంతటితో ఆగని ఓట్ల దొంగలు జిల్లా వ్యాప్తంగా టీడీపీ వ్యతిరేక ఓటర్లను తొలగించే కార్యక్రమాన్ని వేగవంతం చేశారు.

అధికారులపై అనుమానం
జిల్లా వ్యాప్తంగా బుధవారం వరకు 34,088 ఓట్లను తొలగించమని దరఖాస్తు చేసుకున్నట్లు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు అందాయి. ఆ దరఖాస్తుల విషయాన్ని కలెక్టర్‌ ప్రద్యుమ్న కూడా ధ్రువీకరించారు. అయితే ఓట్ల దొంగల కట్టడికి చర్యలు తీసుకుంటున్నట్లు పలుమార్లు చెప్పినా.. క్షేత్రస్థాయిలో ఓట్ల దొంగలకు అడ్డుకట్టవేయలేకపోతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. జిల్లాలో యథేచ్ఛగా కొనసాగుతున్న ఓట్ల తొలగింపు ప్రక్రియపై జిల్లా అధికార యంత్రాంగంపైనే గ్రామస్తులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఓట్ల దొంగలను పట్టిస్తున్నా జిల్లా ఉన్నతాధికారులు వారిని కాపాడే ప్రయత్నం చేస్తున్నారు తప్పితే... చర్యలు తీసుకోవడం లేదని అభిప్రాయం వ్యక్తంచేస్తున్నారు. జిల్లాలో కొందరు అధికారులు టీడీపీ ఏజెంట్లుగా మారారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ విషయంపై సంబంధిత అధికారులు గట్టి చర్యలు తీసుకోవాలని ఓటర్లు కోరుతున్నారు. 

>
మరిన్ని వార్తలు