వంతెనకు.. నయ వంచన

14 Mar, 2019 13:14 IST|Sakshi
వశిష్ట వంతెనకు వైఎస్‌ శంకుస్థాపన చేసిన శిలాఫలకం

సాక్షి, నరసాపురం : వశిష్ట వంతెన.. ఉభయగోదావరి జిల్లాలను కలుపుతూ నరసాపురంలో వశిష్ట గోదావరిపై బ్రిడ్జి నిర్మించాలన్నది బ్రిటీష్‌ హయాం నుంచి ఉన్న డిమాండ్‌. ప్రతి ఎన్నికల సమయంలోనూ రాజకీయ నేతలు జిల్లాలో మొదటిగా ప్రస్తావించే అంశం. గత 2014 ఎన్నికల్లో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వశిష్ట వంతెన విషయంలో స్పష్టమైన హామీ ఇచ్చారు. గడిచిన ఐదేళ్లలో అదిగో వంతెన, ఇదిగో వంతెన అంటూ హడావుడి తప్ప మరొకటి జరగలేదు.

వంతెన మంజూరైందంటూ టీడీపీ నేతలు అనేకసార్లు స్వీట్లు పంచుకున్నారు గానీ ప్రజలకు మాత్రం తీపి కబురు రాలేదు. 2016 ఫిబ్రవరి 18న నరసాపురం పక్కనే ఉన్న తూర్పుగోదావరి జిల్లా అంతర్వేదిలో డ్రెడ్జింగ్‌ హార్బర్‌ నిర్మిస్తున్నట్టు కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రకటన వచ్చింది. అప్పటి నుంచి వంతెన విషయంలో టీడీపీ నేతల హైడ్రామా మొదలైంది. హార్బర్‌ నిర్మాణానికి రూ.1,800 కోట్లు విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు.

సరిగ్గా అదే నెలలో స్థానిక ప్రజాప్రతినిధుల నుంచి మరో ప్రకటన వచ్చింది. డ్రెడ్జింగ్‌ హార్బర్‌ నిధుల్లో రూ.200 కోట్లు ఖర్చు చేసి ఉభయగోదావరి జిల్లాలను కలుపుతూ నరసాపురం వశిష్ట గోదావరిపై వంతెన నిర్మాణం చేపడుతున్నట్టు ప్రకటించారు. ఈ మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కేంద్రమంత్రి నితిన్‌గట్కరీని ఒప్పించారని స్థానిక ఎమ్మెల్యే బండారు మాధవనాయుడు చెప్పుకొచ్చారు.

నితిన్‌గట్కరీకి ఈ మేరకు చంద్రబాబునాయుడు రాసిన లేఖంటూ ఓ లెటర్‌ను కూడా పత్రికలకు విడుదల చేశారు. ఇంకేముంది కేంద్రం సహకారంతో కలల వారధి ఈ సారి కచ్చితంగా నిర్మాణం జరిగి తీరుతుందని అందరూ భావించారు. వంతెన నిర్మాణం జరుగుతుందంటూ టీడీపీ నాయకులు గోదావరి రేవు వద్ద మిఠాయిలు పంచారు. బాణాసంచా కాల్చారు.

18 నెలల తరువాత మరో డ్రామా
ఇదంతా జరిగిన తరువాత సీన్‌ కట్‌ చేస్తే మరో 18 నెలలకు ఉభయగోదావరి జిల్లాల ఎంపీలు, ఎమ్మెల్యేల బృందం ఢిల్లీ వెళ్లింది. ఇదే కేంద్రమంత్రి నితిన్‌గట్కరీని కలిశారు. డ్రెడ్జింగ్‌ హార్బర్‌ నిర్మాణం, వంతెనకు నిధుల మళ్లింపు అంశాన్ని పక్కకు పెట్టారు. చించినాడ నుంచి నరసాపురం మీదుగా 216 జాతీయ రహదారి విస్తరణ పనులు సాగుతున్నాయి.

ఈ నేపథ్యంలో తూర్పుగోదావరి జిల్లా కాకినాడ, సఖినేటిపల్లి రాష్ట్ర రహదారిని జాతీయ రహదారిగా మార్పు చేసి, సఖినేటిపల్లి నుంచి నరసాపురంలో 216కు అనుసంధానం చేయాలని, నరసాపురంలో వశిష్ట గోదావరిపై వంతెన నిర్మించాలని వినతిపత్రం ఇచ్చారు. దీనికి నితిన్‌గట్కరీ ఒప్పుకున్నారని, నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారని ఎమ్మెల్యే బండారు మాధవనాయుడుతో సహా ఢిల్లీ వెళ్లిన బృందంలోని నాయకులు చెప్పారు.

1986లో వంతెన నిర్మాణానికి బీజం 
నరసాపురం వశిష్ట వంతెన అనేది దశాబ్ధాల పోరాటం. బ్రిటిష్‌ హయాంలోనే ఇక్కడ వంతెన నిర్మించాలని యోచించారు. మొదటిగా నీలం సంజీవరెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా మొదటిసారి వంతెన ప్రతిపాదన తెరమీదకు వచ్చింది. ఎన్టీ రామారావు హయాంలో వంతెనకు బీజం పడింది. 1986లో ఎన్టీఆర్‌ వశిష్ట వంతెనకు నరసాపురంలోనూ, తూర్పుగోదావరి జిల్లాలోనూ రెండు చోట్లా శంకుస్థాపనలు చేశారు. సాంకేతిక ఇబ్బందులు ఉన్నాయంటూ నరసాపురంలో నిర్మించాల్సిన వంతెనను చించినాడలో నిర్మించారు. 2003లో అప్పటి మంత్రిగా ఉన్న కొత్తపల్లి సుబ్బారాయుడు ఫ్లోటింగ్‌ బ్రిడ్జి అంటూ వంతెన పనులకు శంకుస్థాపన చేసి హడావిడి చేశారు.

వైఎస్‌ హయాంలో రూ.194 కోట్లతో టెండర్లు
నరసాపురం వశిష్ట వంతెన విషయంలో వైఎస్‌ రాజశేఖరరెడ్డి మాత్రమే చొరవ చూపారు. 2008 ఏప్రిల్‌ 15న వశిష్ట వంతెనకు తూర్పుగోదావరి జిల్లా సఖినేటిపల్లిలో శంకుస్థాపన చేశారు. రూ.194 కోట్లతో టెండర్‌ పిలిచి నిర్మాణ పనులను సత్యంకు అనుబంధ సంస్థగా ఉన్న మైటాస్‌ కంపెనీకి అప్పగించారు. ప్రాథమికంగా సర్వేలన్నీ పూర్తి చేసిన వంతెన పనులు ప్రారంభమవుతాయనగా సత్యం సంస్థ సంక్షోభంలోకి వెళ్లింది. దీంతో పనులు నిలిచిపోయాయి. అయితే వైఎస్‌ వేరే కంపెనీకి నిర్మాణ బాధ్యతలు అప్పగించారు. అంతలో ఆయన మృతిచెందడం జరిగింది. మైటాస్‌ వద్ద సబ్‌ కాంట్రాక్ట్‌ తీసుకున్న వేరే కంపెనీ పనులు చేపట్టడానికి ముందుకు వచ్చినా కూడా తరువాత వచ్చిన ముఖ్యమంత్రులు శ్రద్ధ చూపించలేదు

పాదయాత్రలో జగన్‌ హామీ
గత మే నెలలో నియోజకవర్గంలో పాదయాత్రకు వచ్చిన వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నరసాపురంలో జరిగిన బహిరంగ సభలో మొదటగా వంతెన విషయాన్నే ప్రస్తావించారు. వశిష్ట వంతెన నిర్మాణంలో ముఖ్యమంత్రి సినిమా చూపిస్తున్నారని, ఆ సినిమాకు తాను అధికారంలోకి రాగానే తెరవేస్తానని హామీ ఇచ్చారు. తన తండ్రి ప్రారంభించిన వంతెన పనులు పూర్తి చేసి చూపిస్తానన్నారు.

మరిన్ని వార్తలు