టీడీపీ పాలనలోనే హత్యా రాజకీయాలు

16 Mar, 2019 07:44 IST|Sakshi
వైఎస్‌ వివేకానందరెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పిస్తున్న ఎమ్మెల్సీ ఆళ్ల నాని

ఎమ్మెల్సీ ఆళ్ల నాని

సాక్షి, ఏలూరు(పశ్చిమ గోదావరి) : టీడీపీ అధికారంలో ఉంటే రాష్ట్రంలో హత్యా రాజకీయాలు పెచ్చుమీరుతాయని, రాష్ట్రంలో ప్రతిపక్ష నాయకులు, కార్యకర్తలపై దాడులు, హత్యలు, హత్యాయత్నాలు పెరిగిపోయాయని, ఇటువంటి ప్రభుత్వానికి ప్రజలు బుద్ధి చెప్పాలని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఏలూరు పార్లమెంట్‌ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ ఆళ్ల నాని పిలుపునిచ్చారు. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చిన్నాన్న వైఎస్‌ వివేకానందరెడ్డిని హత్య చేసిన నేపథ్యంలో స్థానిక కార్యాలయంలో పార్టీ నేతలు సంతాపం ప్రకటించారు.

వివేకానందరెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆళ్ల నాని మాట్లాడుతూ రాజకీయంగా వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని ఎదుర్కోలేని ప్రత్యర్థులు ఈ విధంగా హత్యకు పాల్పడ్డారని, ఇటువంటి చర్యలు ప్రజాస్వామ్య వ్యవస్థకు విఘాతంగా మారుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలు స్వేచ్ఛగా జీవించలేని పరిస్థితి నేడు రాష్ట్రంలో నెలకొందన్నారు. టీడీపీ ప్రభుత్వాన్ని గద్దె దించితే తప్ప ప్రజల మానప్రాణాలకు రక్షణ ఉండదని ఆయన అన్నారు.

ఈ కార్యక్రమంలో పార్టీ నగర అధ్యక్షుడు బొద్దాని శ్రీనివాస్, మండల అధ్యక్షుడు మంచెం మైబాబు, ఉభయగోదావరి జిల్లాల మహిళా సమన్వయకర్త పిల్లంగోళ్ల శ్రీలక్ష్మి, నాయకులు గుడిదేశి శ్రీనివాస్, బాలిన ధనలక్ష్మి, మున్నుల జాన్‌గురునాధ్, కిలాడి దుర్గారావు, మోటమర్రి సదానందకుమార్, ప్రముఖ న్యాయవాదులు కృష్ణారెడ్డి, ఆచంట వెంకటేశ్వరరావు, ఎస్‌ఎంఆర్‌ పెదబాబు, కోలా భాస్కరరావు, నూకపెయ్యి సుధీర్‌బాబు తదితరులున్నారు. 

మరిన్ని వార్తలు