ముస్లింల శత్రువు చంద్రబాబు

9 Sep, 2018 07:56 IST|Sakshi

ముస్లింలను టీడీపీ ప్రభుత్వం మోసం చేసింది

నిరసన తెలిపిన మైనార్టీలపై అక్రమ కేసులు పెట్టింది

వైఎస్సార్‌ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి అంబటి రాబాబు మండిపాటు

సత్తెనపల్లి: ముస్లింలకు ప్రధాన శత్రువు చంద్రబాబు అని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి అంబటి రాంబాబు అన్నారు. శనివారం ‘ హర్‌ దిల్‌ మే వైఎస్సార్‌’ కార్యక్రమంలో భాగంగా ఈద్గా నుంచి ఆర్టీసీ బస్టాండ్‌ వరకు భారీ ప్రదర్శన నిర్వహించారు. అనంతరం నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు.  నారా హమారా ... టీడీపీ హమారా సభలో ప్రశ్నించిన మైనార్టీ యువకులపై ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరించిందన్నారు. ఎన్నిక సమయంలో మళ్లీ మైనార్టీలను మభ్యపెట్టేందుకే ‘నారా హమారా – టీడీపీ హమారా’ సభ నిర్వహించారని విమర్శించారు. మైనార్టీల ప్రాతినిధ్యంలేని కేబినెట్‌ ఆంధ్రప్రదేశ్‌లో మాత్రమే ఉందని పేర్కొన్నారు.

 ముస్లింల స్థితిగతుల గురించి సీఎంగానీ, టీడీపీ నాయకులుగానీ ఆలోచన చేయకపోవడం దౌర్భాగ్యమన్నారు. వెన్నుపోటు రాజకీయాలకు చంద్రబాబు పెట్టింది పేరని దుయ్యబట్టారు. వాజ్‌పేయి ఒక్క ఓటుతో ఓడిపోవడంతో సానుభూతి ఓట్లు పడతాయని 1999లో బీజేపీతో పొత్తు పెట్టుకుని అధికారంలోకి వచ్చారని గుర్తు చేశారు. ఆ తరువాత బీజేపీతో పొత్తు పెట్టుకుని తప్పు చేశానని చెప్పి.. 2004లో మోదీ హవా చూసి మళ్లీ బీజేపీతో పొత్తు పెట్టుకుని ముస్లిలను మోసం చేశారని మండిపడ్డారు. 2002లో గుజరాత్‌ అల్లర్లు జరిగినప్పుడు మోదీని గుజరాత్‌లో అడుగు పెట్టనీయబోనని బీరాలు పలికిన చంద్రబాబు.. అదే మోదీ కాళ్లు పట్టుకుని ఎన్నికల్లో పోటీ చేశారని పేర్కొన్నారు. నాలుగున్నరేళ్లుగా రాష్ట్రంలో ముస్లింలు ఉన్నారన్న సంగతి మరిచిపోయి ఇప్పుడు మంత్రి పదవి ఇస్తానని చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. 

ముస్లింలకు మేలు చేసింది వైఎస్‌ మాత్రమే..
దివంగత ముఖ్యమంత్రి డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన నాలుగు శాతం రిజర్వేషన్‌తో ఎంతో మంది ఎంబీబీఎస్‌ వంటి ఉన్నత చదవులు చదువుతున్నారన్నారు. కోడెల గెలుపుతో ఏటా ఆయనకు, ఆయన తనయుడు, కుమార్తెకు పుట్టిన రోజులు చేయాల్సిన దుస్థితి టీడీపీ నాయకులకు ఏర్పడిందన్నారు. చిన్న పనికి క్యాష్, పెద్ద పనికి ఆస్తులు రాసివ్వాలని ఎద్దేవా చేశారు. వివాదాస్పద భూముల్లో ప్రవేశించి పంచాయతీల్లో కోడెల తనయుడు మొత్తం మింగేస్తున్నారన్నారు. సత్తెనపల్లి క్లబ్‌పై ఆయన కన్ను పడిందని చెప్పారు. ప్రజల ఆస్తులు దోచుకునే వారిని గెలిపిస్తే ప్రజాస్వామ్యం బతకదన్నారు. గుంటూరులో దేవాదాయ భూమికి చెందిన ఎకరన్నర గుంట స్థలంలో డీమార్ట్‌ వచ్చేసిందని, దానిలో ప్రతి పైసా సత్తెనపల్లి నుంచి దోచిందేనని చెప్పారు. మున్సిపల్‌ కార్మికులు డీమార్ట్‌లో పని చేసి స్థానికంగా మచ్చర్ల వేయించుకుంటున్నారన్నారు. కోడెలను సాగనంపాలని పిలుపునిచ్చారు.

 సభలో మైనార్టీ సెల్‌ రాష్ట్ర అధ్యక్షుడు ఖాదర్‌ బాషా, రిటైర్డ్‌ ఐజీ ఇక్బాల్, నంద్యాలకు చెందిన హబీబుల్లా, పార్టీ రాష్ట్ర కార్యదర్శులు డాక్టర్‌ ఆరిమండ వరప్రసాద రెడ్డి, నిమ్మకాయల రాజనారాయణ, మైనార్టీ సెల్‌ నరసరావుపేట పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు సయ్యద్‌ మహబూబ్, పట్టణ పార్టీ అధ్యక్షుడు షేక్‌ నాగుర్‌మీరాన్, పట్టణ పార్టీ అధికార ప్రతినిధి ఎస్‌ఎం యూనస్, పిడుగురాళ్లకు చెందిన ఉస్మాన్‌ మేస్త్రీ మాట్లాడారు. ముందుగా చేపట్టిన భారీ ర్యాలీకి విశేష స్పందన లభించింది. ఆయా కార్యక్రమాల్లో వైఎస్సార్‌ సీపీ వివిధ విభాగాల నాయకులు చల్లంచర్ల సాంబశివరావు, ఆతుకూరి నాగేశ్వరరావు, మర్రి సుందరరామిరెడ్డి, బాసు లింగారెడ్డి, భవనం రాఘవరెడ్డి, రాయపాటి పురుషోత్తమ రావు, ఇందూరి నరసింహారెడ్డి, వేపూరి శ్రీనివాసరావు, షేక్‌ జానీ, అచ్యుత శివప్రసాద్, కళ్ళం వీరభాస్కర్‌రెడ్డి, షేక్‌ అన్వర్‌బాషా, కళ్ళం విజయభాస్కర్‌రెడ్డి, దూదేకుల మీరావలి తదితరులు పాల్గొన్నారు.  

మరిన్ని వార్తలు