పార్టీ అండగా ఉంటుంది

18 Nov, 2018 10:14 IST|Sakshi
మహేష్‌బాబుతో మాట్లాడుతున్న మాజీ ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి

పులివెందుల : టీడీపీ నాయకులు పోలీసుల అండతో  వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలపై అక్రమ కేసులు నమోదు చేస్తే వారికి పార్టీ అండగా ఉంటుందని..వారి కోసం ఎందాకైనా పోరాటం చేస్తామని కడప మాజీ ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి స్పష్టం చేశారు. ఇటీవల టీడీపీ  ప్రభుత్వం అవలంభిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను సోషల్‌ మీడియా ద్వారా మంత్రులు లోకేష్, ఆదినారాయణరెడ్డిలను ప్రశ్నించినందుకు సింహాద్రిపురం మండలం చెర్లోపల్లె గ్రామానికి చెందిన యువకుడు మహేష్‌బాబుపై  పోలీసులు అక్రమంగా కేసు నమోదు చేశారు. బెయిల్‌పై విడుదలైన ఆయన శనివారం  మాజీ ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డిని కలిశారు. 

మంత్రి ఆదేశాలతో తనపై అక్రమంగా కేసు నమోదు చేశారని.. అయితే పార్టీ తనకు అన్నివిధాలుగా అండగా ఉండి సహకరించిందని మహేష్‌బాబు మాజీ ఎంపీకి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా వైఎస్‌ అవినాష్‌రెడ్డి మాట్లాడుతూ పార్టీ కార్యకర్తలకు ఎల్లప్పుడు అండగా ఉంటామన్నారు. అధికార మదంతో తెలుగుదేశం నాయకులు రెచ్చిపోతున్నారన్నారు. వారి అవినీతి ఏ స్థాయిలో ఉందో రెండు రోజుల క్రితం చంద్రబాబు జారీ చేసిన జీఓను బట్టే తెలుస్తోందన్నారు. తమ అవినీతిపై ఎక్కడ దాడులు జరుగుతాయోనని టీడీపీ నాయకులకు భయం పుట్టుకుందన్నారు. 
  
ప్రజా సంక్షేమమే వైఎస్సార్‌సీపీ ధ్యేయం
 వేంపల్లె : ప్రజా సంక్షేమమే వైఎస్సార్‌సీపీ ధ్యేయమని కడప మాజీ ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి పేర్కొన్నారు. శనివారం వేంపల్లె పట్టణ పరిధిలోని మదీనాపురం, రామలింగయ్య కాలనీలలో మండల కన్వీనర్‌ చంద్ర ఓబుళరెడ్డి, ఎంపీపీ రవికుమార్‌రెడ్డిల ఆధ్వర్యంలో రావాలి జగన్‌ – కావాలి జగన్‌ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీ  ప్రజలకు నవరత్నాల గురించి వివరించారు. ముందుగా బైపాస్‌ రోడ్డులోని దివంగత సీఎం వైఎస్‌ రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. 

అనంతరం  ఆయన మాట్లాడుతూ వైఎస్‌ రాజశేఖరరెడ్డి పాలన మళ్లీ రావాలంటే జననేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సీఎం కావాలన్నారు.. ప్రజా సంక్షేమం కోసం అలుపెరగని పోరాటం సాగిస్తున్నారన్నారు. హత్యాయత్నం జరిగినా లెక్క చేయకుండా తిరిగి ప్రజలతోనే తిరుగుతున్న ధీశాలి జగనన్న అని పేర్కొన్నారు.  అన్ని వర్గాల ప్రజలకు మేలు చేకూరాలనే నవరత్నాల పథకాలను రూపొందించారని.. ఆరోగ్య శ్రీ, ఫీజు రీయింబర్స్‌మెంట్, అమ్మ ఒడి తదితర పథకాలను అమలు చేస్తారన్నారు. పింఛన్‌ సొమ్ము రూ.2వేలకు పెంచుతారన్నారు. ఫీజురీయింబర్స్‌మెంట్‌ ద్వారా ఎంతో మంది పేద విద్యార్థుల ఉన్నత చదువులకు అవకాశం కలుగుతుందన్నారు.

మరిన్ని వార్తలు