అభివృద్ధి ముసుగులో ‘స్మార్ట్‌’గా దోపిడీ

22 Jun, 2019 10:02 IST|Sakshi

అక్రమాలపై దృష్టి పెట్టిన  కొత్త ప్రభుత్వం

అధికారుల గుండెల్లో గుబులు

 సాక్షి, కాకినాడ( తూర్పు గోదావరి) : దేశవ్యాప్తంగా తొలి విడతలోనే జిల్లా కేంద్రం కాకినాడ ఆకర్షణీయ నగరంగా ఎంపికైందన్న ఈ ప్రాంతవాసుల ఆనందంపై గత తెలుగుదేశం పాలకులు నీళ్లు చల్లారు. వచ్చిన నిధులను సద్వినియోగం చేసుకుని కాకినాడ నగరాన్ని అభివృద్ధి వైపు నడిపించాల్సిన పాలకులు ఆ నిధులను కైంకర్యం చేసేందుకే ప్రాధాన్యతనివ్వడంతో అభివృద్ధిపై పెట్టుకున్న ఆశలన్నీ ఆవిరైపోయాయి. 2016లో కాకినాడ నగరాన్ని స్మార్ట్‌సిటీగా ఎంపిక చేశాక తొలివిడతగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యం ద్వారా రూ.384 కోట్లు విడుదలయ్యాయి. ఒక్కసారిగా అంతమొత్తంలో నిధులు విడుదల కావడంతో వాటిని ఎలా స్వాహా చేయాలనే అంశంపైనే అప్పటి టీడీపీ ప్రజాప్రతినిధులు దృష్టి సారించారు. సరైన అంచనాలు, పర్యవేక్షణ లేకుండా ఇష్టానుసారంగా పనులు మంజూరు చేయించి అందిన కాడకు దోచుకున్నారు.

వేసిన రోడ్లపైనే మళ్లీమళ్లీ రోడ్లు వేయడం, లోపభూయిష్టమైన టెండరింగ్‌ విధానాన్ని అనుసరిస్తూ ఇష్టారాజ్యంగా టెండర్లు పిలవడం ద్వారా కోట్లాది రూపాయలను బొక్కేశారని ఆరోపణలు వెల్లువెత్తాయి. నగరంలో అనేకచోట్ల రహదారులు ధ్వంసమైనప్పటికీ పట్టించుకోని అధికారులు శుభ్రంగా ఉన్న రహదారులపై మళ్లీ మళ్లీ రోడ్లు వేయడం విమర్శలకు తావిచ్చింది. ప్రజాప్రతినిధుల ధన దాహానికి స్మార్ట్‌సిటీలో పనిచేసి ఇటీవలే పదవీ విరమణ చేసిన ఓ కీలక అధికారి అండదండలు ఉండడంతో ఇక ఆ నేతల అవినీతికి అడ్డు అదుపు లేకుండా పోయింది. మంజూరైన రూ.384 కోట్లలో ఇప్పటి వరకు దాదాపు రూ.290 కోట్ల వరకు సొమ్ములు కూడా చెల్లించేశారు. 

కొత్త ప్రభుత్వం రాకతో బెంబేలు
స్మార్ట్‌సిటీ నిధులను అడ్డంగా బొక్కేసిన నేతలకు ప్రభుత్వం మారడంతో షాక్‌ తగిలింది. ఇష్టారాజ్యంగా పనులు చేయించి నిధులు దిగమింగిన నేతల అక్రమాలు ఇప్పుడు బయటపడతాయన్న భయం వారిలో నెలకొంది. అప్పటి ప్రజాప్రతినిధి ఆదేశాలకు జీ హుజూర్‌ అంటూ తలాడించిన అధికారులకు ఇప్పుడు దడ పట్టుకుంది. కొత్త ప్రభుత్వం వచ్చాక స్మార్ట్‌సిటీ ద్వారా జరుగుతున్న ఆరు ప్రాజెక్టులకు సంబంధించి రూ.198 కోట్ల పనులు నిలుపుదల చేయాల్సిందిగా ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలందాయి. దీంతో ఎక్కడి పనులు అక్కడే నిలిచిపోయాయి. సిటీ ఎమ్మెల్యేగా ఎన్నికైన  ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి ఎన్నికల ముందే స్మార్ట్‌సిటీపనుల్లో అక్రమాలను ఉన్నత స్థాయి వరకు తీసుకువెళ్లడంతో అప్పట్లోనే పనులను నిలుపుదల చేసి విచారణకు ఆదేశించారు.

మరోవైపు ప్రభుత్వం కూడా మారిన నేపథ్యంలో నాటి అక్రమాలు వెలుగుచూసే పరిస్థితి కనిపిస్తోంది. దీంతో అధికారులు చేసిన తప్పులు ఎక్కడ బయటపడతాయోనని ఆందోళన చెందుతున్నారు. ఎన్నికల షెడ్యూల్‌ విడుదలయ్యాక, ఎన్నికల పూర్తయ్యాక కూడా ఆగమేఘాలపై రేయింబళ్లు, రాత్రి, పగలు కూడా పనిచేసి అనేక రోడ్డు నిర్మాణాలను పూర్తి చేసేశారు. వందలకోట్ల నిధులతో నగరాన్ని అభివృద్ధిలో అగ్రగామిగా చేసే అవకాశాన్ని నీరుగార్చి స్వార్థంగా వ్యవహరించి నిధులు బొక్కేసిన పాలకుల అవినీతి త్వరలోనే వెలుగు చూసే అవకాశం ఉందంటున్నారు.   

మరిన్ని వార్తలు