‘సాఫ్ట్‌నెట్‌’ చాటున రాజకీయ ప్రచారం

3 Jul, 2018 03:33 IST|Sakshi
మన టీవీ

సాక్షి, అమరావతి : రాష్ట్రంలో విచ్చలవిడిగా అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్న చంద్రబాబు సర్కారు తమ ద్వారా పొందుతున్న సేవలను సైతం రాజకీయ ప్రయోజనాల కోసం వినియోగించు కోవడంపై తెలంగాణ ప్రభుత్వం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘మన టీవీ’ లో టీడీపీ సర్కారు రాజకీయ కార్యక్రమాలను ప్రసారం చేయడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ ‘సాఫ్ట్‌నెట్‌’ ద్వారా ఏపీకి అందిస్తున్న బ్యాండ్‌విడ్త్‌ సర్వీసులను సస్పెండ్‌ చేసున్నట్లు ప్రకటించింది. టీడీపీ సర్కారు అధికార దుర్వినియోగాన్ని ఎండగడుతూ గవర్నర్‌కు సైతం తెలంగాణ ప్రభుత్వం లేఖ రాయడం గమనార్హం.

విద్య, వైజ్ఞానిక సేవల కోసమే..
‘సాఫ్ట్‌నెట్‌’ (సొసైటీ ఫర్‌ తెలంగాణ స్టేట్‌ నెట్‌వర్క్‌) ‘మనటీవీ’ ద్వారా విద్య, వైజ్ఞానిక, టెలి మెడిసిన్‌ సేవలను ఉపగ్రహ ప్రసారాలతో అందించేందుకు ఇస్రోతో ఒప్పందం చేసుకుంది. సమాచార, సాంకే తిక పరిజ్ఞానాన్ని పెంపొందించుకోవడానికే ఈ బ్యాండ్‌విడ్త్‌ను వినియోగించాలి. ఏపీ ప్రభుత్వం డీఎస్‌ఎన్‌జీ ద్వారా బ్యాండ్‌విడ్త్‌ను రాజకీయ పార్టీ సమావేశాలకు వినియోగించుకుంటున్నట్లు తెలం గాణ సర్కారు గుర్తించింది. రాజకీయ అవసరాలు, పార్టీ సమావేశాలకు దీన్ని వాడుకోవడం బ్యాండ్‌ విడ్త్‌ కేటాయింపుల నిబంధనల ఉల్లంఘనే అవుతుందని తెలంగాణ ప్రభుత్వం స్పష్టం చేసింది. 

టీడీపీ రాజకీయ సమావేశాలకు ‘సాఫ్ట్‌నెట్‌’
సాఫ్ట్‌నెట్‌ పరిపాలనా కేంద్రం తెలంగాణ ఐటీ శాఖ పరిధిలో ఉంది. దీన్ని పునర్విభజన చట్టం 10వ షెడ్యూల్‌లో కూడా చేర్చారు. 2014 జూన్‌ 2వ తేదీ నుంచి సాఫ్ట్‌నెట్‌ ఆంధ్రప్రదేశ్‌కు సేవలను అందిం చాల్సి ఉంది. ఇందుకు అనుగుణంగా ఇస్రోతో మన టీవీ ఛానల్‌ ఒప్పందం చేసుకుంది. టీడీపీ నిర్వహించిన మహానాడుకు కొద్ది రోజులు మందుగా అంటే మే 24వ తేదీన సాఫ్ట్‌నెట్‌ను పార్టీ రాజకీయ సమావేశం కోసం చంద్రబాబు ప్రభుత్వం వినియోగించుకున్నట్లు తెలంగాణ సర్కారు గుర్తిం చింది. ఇది బ్యాండ్‌విడ్త్‌ నిబంధనలను ఉల్లం ఘించడమేనని తెలంగాణ సర్కారు పేర్కొంది.

తెలంగాణ సర్కారుపై అభ్యంతర వ్యాఖ్యలు
‘మన టీవీ 1’ బ్యాండ్‌ విడ్త్‌ను వినియోగించుకుని రాజకీయ పార్టీ సమావేశాలను ప్రసారం చేయడంతోపాటు తెలంగాణ సర్కారుపై అభ్యంతర కర వ్యాఖ్యలను కూడా ప్రసారం చేసినట్లు గుర్తిం చారు. ఈ నేపథ్యంలో సాఫ్ట్‌నెట్‌ను టీడీపీ రాజకీయ అవసరాల కోసం దుర్వినియోగం చేస్తున్నందున ఏపీకి బ్యాండ్‌విడ్త్‌ సర్వీసులను సస్పెండ్‌ చేస్తున్నట్లు తెలంగాణ సర్కారు ప్రకటించింది. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌.కె. జోషి ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి లేఖ రాశారు. లేఖ ప్రతులను గవర్నర్‌ నరసింహన్‌ ముఖ్య కార్యదర్శి, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ముఖ్యకార్యదర్శికి కూడా పంపించారు.   

మరిన్ని వార్తలు