నీరు–చెట్టు.. గుట్టురట్టు!

20 Aug, 2019 08:13 IST|Sakshi
పెదవేగి మండలంలోని చెరువులో నీరు–చెట్టు పథకంలో భాగంగా పొదల తొలగింపు (ఫైల్‌)

సకల జీవరాశుల మనుగడకు నీరు–చెట్టు అత్యవసరం. అయితే వీటి పేరుచెప్పి గత ప్రభుత్వ హయాంలో కోట్లాది రూపాయలను అక్రమార్కులు బొక్కేశారు. నీరు–చెట్టు పథకాన్ని అడ్డం పెట్టుకుని అక్రమాలకు 
పాల్పడ్డారు. టీడీపీ ప్రజాప్రతినిధులే ఈ అవకతవకల్లో కీలకంగా వ్యవహరించడంతో అధికారులూ ఏమీ చేయలేక మిన్నకుండిపోయారు.  అవినీతి, అక్రమాలు కళ్లముందు జరిగిపోతున్నా.. అడ్డుకోలేక పోయారు. 

సాక్షి, ఏలూరు(పశ్చిమగోదావరి) : ముఖ్యమంత్రిగా వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి బాధ్యతలు చేపట్టిన అనంతరం నీరు–చెట్టు పథకంలో అవినీతి బాగోతాన్ని బయట పెట్టేందుకు, నిధులను మేసిన నేతల గుట్టురట్టు చేసేందుకు అధికార యంత్రాంగం కదులుతోంది.  

ప్రగల్భాలు పలికి.. రూ.కోట్లు బొక్కి.. 
నీరు–చెట్టు పథకం ద్వారా భవిష్యత్తులో సాగు, తాగునీటికి ఎటువంటి ఇబ్బంది లేకుండా చేస్తున్నామని ప్రగల్భాలు పలికిన టీడీపీ నేతలు వాస్తవానికి ఆ పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వ ఖజానా కొల్లగొట్టడానికి వాడుకున్నారు. జిల్లా వ్యాప్తంగా నీరు–చెట్టు పథకంలో ఎన్నో అక్రమాలు జరిగాయి.  చెరువుల్లో పూడిక తీయడం ద్వారా గట్లను పటిష్టం చేయాలనే ఉద్దేశంతో చేపట్టిన పనుల్లో రూ.వందల కోట్లు అక్రమార్కులు వెనకేసుకున్నారు. గ్రామస్థాయి నేతల నుంచి ఎమ్మెల్యేల స్థాయి నాయకుల వరకూ ఈ అక్రమాల్లో భాగస్వాములయ్యారు. ఒకవైపు ప్రభుత్వం నుంచి నిధులు కాజేస్తూనే.. మరోవైపు చెరువుల్లో తవ్విన మట్టినీ అక్రమార్కులు అమ్ముకుని రూ.కోట్లు సంపాదించారు.

ఈ పథకం ద్వారా చెరువులో తవ్విన మట్టిని సామాజిక అవసరాలకు వినియోగించాలని ఆదేశాలు ఉన్నా.. వాటిని బేఖాతరు చేశారు. చెరువు తవ్వకాలు, రిటెయినింగ్‌ వాల్‌ నిర్మాణాలు ఇలా రకరకాల పనుల్లో నిధులు స్వాహా చేశారు. పనులను నాసిరకంగా.. తూతూమంత్రంగా మమ అనిపించారు. కొన్నిచోట్ల నామినేషన్‌ పద్ధతిలో టీడీపీ నేతలే పనులను దక్కించుకుని నిధులు కాజేశారు. చెరువు తవ్వకాల పనుల్లో క్యూబిక్‌ మీటర్‌ మట్టి తీతకు ప్రభుత్వం రూ.29 చెల్లించింది. ఈ లెక్కన ప్రభుత్వం ఇచ్చే మొత్తం తోపాటు అదనంగా మట్టి విక్రయాలు చేసి వచ్చిన సొమ్మునూ అక్రమార్కులు మింగేశారు. 

అక్రమాలపై ప్రత్యేక దృష్టి 
గత ప్రభుత్వ హయాంలో జరిగిన అక్రమాలపై వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం దృష్టిసారించింది. నీరు–చెట్టు పథకం అవకతవకలపై విచారణకు ఉపక్రమించింది. పథకంలో పెండింగ్‌లో ఉన్న బిల్లుల చెల్లింపులను తాత్కాలికంగా నిలిపి వేయాలంటూ ఆదేశాలు జారీ చేసింది. ప్రారంభం కాని పనులను రద్దు చేసింది.  

మొదలైన విచారణ
జిల్లావ్యాప్తంగా నీరు–చెట్టు పథకం పేరుతో ఎన్ని చెరువుల పనులు చేపట్టారు? ఎన్ని కోట్ల మేర నిధులు దుర్వినియోగమయ్యాయి? ఎన్ని కోట్ల మేర పనులు నిర్వహించారు? అనే అంశాలపై విజిలెన్స్‌ విచారణకు ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఈ నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా చెరువులను గుర్తించే పనిలో అధికారయంత్రాంగం నిమగ్నమైంది. 20 రోజులుగా విజిలెన్స్‌ అధికారులు పనులను పరిశీలిస్తున్నారు. జిల్లాలో ఇప్పటికే 70 శాతం పనులను పరిశీలించి జరిగిన అక్రమాలపై విజిలెన్స్‌ అధికారులు ఓ అంచనాకు వస్తున్నారు. జిల్లావ్యాప్తంగా పూర్తి స్థాయిలో విచారణ నిర్వహించి అక్రమార్కులు బొక్కినదంతా కక్కించేందుకు చర్యలు చేపట్టనున్నారు. దీంతో టీడీపీ నేతల్లో వణుకు మొదలైంది.  

పథకం నిర్వహణ ఇలా..
ఈ పథకాన్ని 2015 ఫిబ్రవరి 19న ప్రారంభించారు. 2014–15లో జిల్లాలో ఏ పనీ చేపట్టలేదు. తర్వాత నాలుగేళ్లలో రూ.263.94 కోట్లతో పనులు చేశారు. ఈ ఖర్చులో సుమారు 70 శా తం దుర్వినియోగమైందని అంచనా. 

మరిన్ని వార్తలు