కలగానే ఇరిగేషన్‌ సర్కిల్‌!

7 Sep, 2019 11:50 IST|Sakshi
బొబ్బిలి సర్కిల్‌ కార్యాలయం

ఒక డివిజన్‌ జిల్లాలో...  మరోటి వేరే సర్కిల్‌ పరిధిలో...

ఒకే గొడుకు కిందకు రాని  జిల్లా నీటిపారుదలశాఖ

ప్రతిపాదనలను బుట్టదాఖలు చేసిన గత సర్కారు

పనుల పర్యవేక్షణకోసం అధికారులు సతమతం

సాక్షి, విజయనగరం గంటస్తంభం: విజయనగరంలో ఇరిగేషన్‌ సర్కిల్‌ కార్యాలయం ఏర్పాటు గత ప్రభుత్వం కలగా మార్చేసింది. బొబ్బిలి సర్కిల్‌ కార్యాలయం నుంచి శ్రీకాకుళం వేరు పడిన తరువాత జిల్లాలోని ఇరిగేషన్‌శాఖను ఒకే సర్కిల్‌ పరిధిలోకి తీసుకురావాలన్న అధికారుల ఆలోచన నెరవేరలేదు. దీనిపై రెండున్నరేళ్ల క్రితమే జిల్లా పరిషత్‌ సర్వసభ్య సమావేశంలో తీర్మానించి పంపినా గత ప్రభుత్వం పట్టించుకోకపోవడమే ఈ పరిస్థితికి కారణం. దీనివల్ల ఇటు అధికారులు, అటు రైతులు కూడా ఇబ్బందులు పడుతున్నారు.

బొబ్బిలి నుంచి వేరు పడిన శ్రీకాకుళం..
విజయనగరం నీటిపారుదలశాఖలో వింత పరిస్థితి ఉంది. జిల్లాలో ఉన్న నీటిపారుదల శాఖ అంతా ఒక గొడుగు కింద లేదు. మధ్య, చిన్ననీటిపారుదలశాఖకు విజయనగరం, పార్వతీపురం డివిజన్‌లు ఉన్నాయి. ఇందులో విజయనగరం డివిజన్‌ విశాఖపట్నం సర్కిల్‌ పరిధిలో ఉంది. ఈ సర్కిల్‌లో పనులను విశాఖపట్నం ఎస్‌ఈ పర్యవేక్షిస్తున్నారు. జిల్లాకు సంబంధించి బొబ్బిలిలో సర్కిల్‌ కార్యాలయం ఉన్నా విజయనగరం డివిజన్‌ను అందులోకి తీసుకురాలేదు. ఒకప్పుడు పార్వతీపురం డివిజ న్‌తోపాటు శ్రీకాకుళం జిల్లా అందులో ఉండేది. మూడేళ్ల క్రితం శ్రీకాకుళంలో ప్రత్యేకంగా ఒక ఇరిగేషన్‌ సర్కిల్‌ కార్యాలయం ఏర్పాటు చేసి ఆ జిల్లా ఇరిగేషన్‌ శాఖను ఆ పరిధిలోకి  తీసుకొచ్చారు. అయినా విజయనగరం జిల్లాలో రెండు డివిజన్లను ఒకే సర్కిల్‌ పరిధిలోకి తీసుకురాలేదు.

రెండు సర్కిళ్లతో ఇబ్బందులు..
వాస్తవానికి విజయనగరం చిన్న జిల్లా. బొబ్బిలి డివిజన్‌లో గతంలో శ్రీకాకుళం మొత్తం ఉండడంతో పని భారం వల్ల విజయనగరం డివి జన్‌ను విశాఖపట్నంలో కలిపారు. కానీ బొబ్బిలి సర్కిల్‌ ఒక్క పార్వతీపురానికి పరిమితమైన నేపథ్యంలో విజయనగరంలో కలిపితే భౌగోళికంగా, పరిపాలనాపరంగా ఇబ్బందులు తొలుగుతాయి. ఇలా కాకుండా రెండు వేర్వేరు సర్కిల్‌లో డివిజన్‌లు ఉండడం వల్ల అధికారులకు, రైతులకు కొంత ఇబ్బంది ఏర్పడుతోంది. విజయనగరం డివిజన్‌కు చెందిన రైతులు విశాఖపట్నం వెళ్లాల్సి వస్తోంది. అంతేగాకుండా నీటిపారుదల వనరుల అభివృద్ధికి సంబంధించి స్పష్టత లేకపోయింది. రెండు డివిజన్‌లకు సంబంధించి ఇద్దరు ఈఈలతోపాటు ఇద్దరు ఎస్‌ఈలను అడిగితేగానీ కుదరట్లేదు. దీనివల్ల ప్రగతి కొంతవరకు కుంటుపడుతోంది. ఈ విషయం గుర్తించిన అప్పటి కలెక్టర్‌ ఎం. ఎం.నాయక్‌ రెండు డివిజన్లను ఒక సర్కిల్‌ పరిధిలోకి తీసుకురావాలని, ఇందుకు చర్యలు తీసుకోవాలని నీటిపారుదల అధికారులకు ఆదేశించారు. 
ఈ మేరకు ఉన్నతాధికారులకు సిఫా ర్సు కూడా చేశారు. ఈ నేపథ్యంలో బొబ్బిలిలో ఉన్న ఇరిగేషన్‌ సర్కిల్‌ కార్యాలయం విజయనగరానికి మార్చాలని కోరారు. దీనిపై జెడ్పీ సమావేశంలో చర్చ జరిగింది. అప్పుడు విజయనగరంలో సర్కిల్‌ కార్యాలయం ఏర్పాటు చేయాలని తీర్మానించి ప్రభుత్వానికి పంపించారు.

ఉన్నతాధికారులు ఆలోచించాల్సిందే...
గత ప్రభుత్వంలో పని చేసిన జిల్లాకు చెందిన మంత్రి, ఇతర పాలకులు పట్టించుకోకపోవడం కారణమైతే జెడ్పీ సమావేశంలో చేసిన తీర్మానంపై ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కరించేలా చేయడంలో ఏ ఎమ్మెల్యేగానీ, ఎమ్మెల్సీగానీ ప్రయత్నించలేదు. దీనివల్ల విజయనగరంలో సర్కిల్‌ ఏర్పాటు, ఒకే గొడుకు కిందకు మొత్తం ఇరిగేషన్‌ డిపార్టుమెంట్‌ రాలేదు. కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చినందున సమస్య గుర్తించి విజయనగరానికి సర్కిల్‌ ఇస్తారన్న ఆశతో జిల్లా రైతాంగం భావిస్తోంది.

>
మరిన్ని వార్తలు