నిత్యం భయం.. జీవనం దుర్భరం

27 Aug, 2019 07:28 IST|Sakshi
అభివృద్ధికి నోచుకోని మండపల్లి గ్రామం

పింఛన్లు రద్దు చేసిన గత ప్రభుత్వం

తాగునీరు, రహదారి సౌకర్యం లేక ఇక్కట్లు 

తరచూ మావోయిస్టులు, పోలీసుల రాకతో భీతిల్లుతున్న మండపల్లి వాసులు

సాక్షి, గూడెంకొత్తవీధి(పాడేరు): అదో గిరిజన కుగ్రామం. ఆ గ్రామం పేరు మండపల్లి. తూర్పు గోదావరి, విశాఖపట్నం జిల్లాల సరిహద్దులో ఉంది. జిల్లా సరిహద్దుతో పాటు గూడెంకొత్తవీధి, కొయ్యూరు మండలాలకు కూడా ఇదే సరి హద్దు గ్రామం. సరిహద్దు ప్రాంతంలో అత్యంత మారుమూల ప్రాంతంలో ఉండడంతో మండపల్లి రెండింటికీ చెడ్డ రేవడిలా ఉంది. దశాబ్దాలుగా కనీస అభివృద్ధి నోచుకోకుండా తల్లడిల్లుతోంది ఈ గ్రామం. ఈ గ్రామంలో సుమారు 50 కుటుంబాలు నివాసం ఉంటున్నాయి. ఈనెల 19న ఈగ్రామం వద్దే పోలీసులు, మావోయిస్టు లకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి, గతంలో ఈ గ్రామానికి సమీపంలో మావోయి స్టులు శిక్షణ ఇవ్వడంతో అప్పుడో సారి గ్రామం పేరు ప్రముఖంగా వార్తల్లోకి వచ్చింది. తరచూ మావోయిస్టులు, పోలీసులు గ్రామ పరిసరాల్లో  సంచరిస్తుండడంతో గ్రామస్తులు  బితుకు బితుకు మంటూ జీవనం సాగిస్తున్నారు.  ఆ గ్రామాన్ని మావోయిస్టులు, పోలీసులు  తప్ప అధికారులు సందర్శించిన దాఖలాలు లేవు. దీంతో కనీస సౌకర్యాలకు నోచుకోక దుర్భర పరిస్థితుల్లో మండపల్లితో పాటు చుట్టుపక్కల గ్రామస్తులు బతుకులు వెళ్లదీస్తున్నారు.

దారుణంగా రోడ్డు..
మండపల్లి గ్రామం దట్టమైన కొండల మధ్య సుదూర ప్రాంతంలో ఉంది. భౌగోళికంగా ఈ గ్రామాన్ని కొయ్యూరు మండలంలో విలీనం చేశారు. మండపల్లి గ్రామస్తులు కొయ్యూరు మండల కేంద్రానికి వెళ్లాలంటే   కాలిబాటే శరణ్యం. కొండలు ఎక్కి, వాగులు దాటి సుమారు 40 కిలోమీటర్లు ప్రయాణించాల్సి ఉంటుంది. అదే జీకే వీధి మండలానికి రావాలంటే  దారుణంగా ఉన్న మార్గంలో 20 కిలోమీటర్లు ప్రయాణించాలి. గతంలో ఈ గ్రామానికి చెందిన గిరిజనులు శ్రమదానంతో రహదారి బాగు చేసుకున్నారు. అయితే గతంలో కురిసిన భారీ వర్షాలకు రహదారి అంతా కొట్టుకుపోయింది. కొండల పైనుంచి వర్షపు నీరు ప్రవాహానికి రహదారి కోతకు గురై రాళ్లమయంగా మారింది. దీంతో ఈ మార్గంలో ద్విచక్ర వాహనం కూడా వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది.

విద్యుత్, తాగునీరు గగనమే..
మారుమూల గ్రామం కావడంతో పాటు రహదారి సౌకర్యం లేక ఈ గ్రామానికి విద్యుత్, తాగునీరు వంటి సదుపాయాలేవీ దరిచేయడం లేదు. విద్యుత్‌ సదుపాయం లేనికారణంగా ప్రత్యామ్నాయంగా గతంలో ప్రభుత్వం సోలార్‌ ప్లాంటు ఏర్పాటు చేశారు. కానీ ఇది సక్రమంగా పనిచేయడం లేదు. దీంతో గ్రామంలో విద్యుత్‌ సౌకర్యం లేక చీకటిలోనే మగ్గుతున్నారు. తాగునీటికి కూడా దయనీయ పరిస్థితి.  పొలం గట్ల వద్ద వచ్చే నీరు, వాగుల నుంచి వచ్చే నీటిని తాగునీటికి వినియోగించడంతో రోగాల బారినపడి ప్రతి ఏటా పదుల సంఖ్యలో మృత్యువాత పడుతున్నారు.

పింఛన్లు రద్దు..
గత పాలకుల నిర్లక్ష్యం కారణంగా గ్రామానికి చెందిన 15 మంది వరకు వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలకు రావాల్సిన ఫించన్‌ పూర్తిగా రద్దయింది. ఈ విషయంపై అధికారులకు పలుమార్లు విన్నవించుకున్నా పట్టించుకున్న నాథుడే కరువయ్యారు. గత ఐదేళ్లలో గ్రామంలో ఏఒక్క ఉపాధి పనికూడా నిర్వహిం చకపోవడంతో తాము ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నామని, రహదారి  లేకపోవడం వల్లే ఏ ఒక్క అధికారి కూడా తమ గ్రామానికి రావడం లేదని, కొయ్యూరు మండలానికి వెళ్లి అధికారులకు తమసమస్య చెప్పుకున్నా కనీసం పట్టించుకోలేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే గ్రామ సచివాలయాల ఏర్పాటుతో గ్రామాలు అభివృద్ధి చెందుతాయన్న నూతన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి ప్రకటించడంతో ఈ సారైనా తమ గ్రామాలు బాగుపడతాయన్న నమ్మకం వ్యక్తం చేస్తున్నారు.   కొత్తపాలెం, కొమ్ము సంపంగి, కోతిగొంది, వెదురులంక, పుత్తకోట తదితర గ్రామాల పరిస్థితి కూడా ఇలాగే ఉంది. ఇప్పటికైనా అధికారులు స్పందించి తమ గ్రామాల్లో కనీస సౌకర్యాలు కల్పించాలని ఆయా గ్రామస్తులు  కోరుతున్నారు.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు