ఉప్పు బతుకులు చప్పగా..

21 May, 2018 13:07 IST|Sakshi
కొత్తపాలెంలో ఉప్పుమడుల్లో పనులు చేస్తున్న మహిళా కూలీ

ఉప్పు సాగుకు ప్రభుత్వ  ఆదరణ కరువు

ప్రతి ఏటా నష్టాలుమిగులుతున్న వైనం

సాగుకు దూరమవుతున్న రైతులు

ఆదుకోవాలని కోరుతున్న  సాగుదారులు

రేపల్లె: ప్రభుత్వ నిర్లక్ష్యంతో ఉప్పు సాగు రైతుల బతుకులు చప్పబడుతున్నాయి. తీర ప్రాంతంలో ఉప్పు సాగును జీవనాధారంగా అనేక మంది రైతులు జీవిస్తున్నారు. నిజాంపట్నం మండలం దిండి, కొత్తపాలెం, నిజాంపట్నం, రేపల్లె మండలంలోని లంకెవానిదిబ్బ, మోళ్లగుంట గ్రామాల పరిధిలో సుమారు 2 వేల ఎకరాల్లో ఉప్పు సాగు చేసేవారు. ప్రభుత్వం నుంచి ఎటువంటి ప్రోత్సాహం లేకపోవడంతో రోజురోజుకు ఉప్పు సాగు విస్తీర్ణం తగ్గిపోతోంది. ప్రస్తుతం కొత్తపాలెంలో మాత్రమే 150 ఎకరాల్లో సాగు చేస్తున్నారు. ప్రతి ఏడాది 6 నెలలపాటు చేసే ఉప్పు సాగుపై ఆధారపడి సుమారు 500 కుటుంబాలు జీవిస్తున్నాయి.

బస్టా అమ్మితే మానికెడు బియ్యం రాని పరిస్థితి
పండించిన ఉప్పు బస్తా అమ్మితే మార్కెట్‌లో కనీసం మానికెడు బియ్యం రావడం లేదని ఉప్పు సాగు రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 80 కేజీల ఉప్పు బస్తా మార్కెట్‌లో కేవలం రూ.60కు మాత్రమే కొనుగోలు చేస్తున్నారు. ఈ సాగుకు ఇంటిల్లపాది రెక్కలు ముక్కలు చేసుకుని కష్టపడాల్సి వస్తోంది. పండించిన ఉప్పు పంటకు మార్కెట్‌లో గిట్టుబాటు ధర లేకపోవడంతో రైతులు కష్టానికి తగ్గ ఫలితం రాడం లేదు. ఒక్కో ఎకరానికి కూలి కాకుండానే పెట్టుబడి రూ. 40 వేల వరకు అవుతుంది. అదే ఎకరం కౌలు రూ. 10  వేలు నుంచి రూ. 15 వేల వరకు ఉంటుంది. ఈ ప్రాంతంలో కౌలు రైతులే అధికంగా ఉన్నారు.

సాగు విధానం ఇలా..
ఒక సెంటు స్థలాన్ని మడిగా ఏర్పాటు చేస్తారు. ఇలా ఎకరం స్థలంలో 100 మడులను ఏర్పాటు చేసి రైతులు ఉప్పు సాగు చేపడతారు. మొదటిగా బంకమట్టిని కొనుగోలు చేసి మడుల్లో పోస్తారు. దీనిలో ఉప్పు నీటిని పెట్టి కాళ్లతో తొక్కుతారు. నేల పూర్తిగా గట్టిబడిన తర్వాత దింసెతో అనగకొట్టి ఉప్పునీటిని పెడతారు. ఈ పనులు మొత్తం చేసేందుకు అధిక మొత్తంలో కూలీలకు నగదు చెల్లించవలిసి ఉంటుంది. అదే విధంగా మడుల్లో పెట్టే ఉప్పు నీటిని దొరువుల్లో నుంచి డీజల్‌ ఇంజన్ల ద్వారా తోడతారు.

6 నెలల పంట
ప్రతి ఏడాది ఫిబ్రవరి నుంచి జూలై వరకూ ఉప్పు సాగు చేస్తుంటారు. మొదటి నెలలో మడుల నుంచి ఉప్పు రాదు . రెండో నెల నుంచి ఒక్కోమడిలో 15 రోజులకు ఒకసారి రెండు బస్తాల ఉప్పు వస్తుంటుంది. ఇక్కడ పండించిన ఉప్పును నిజాంపట్నం, మచిలీపట్నం వంటి ప్రాంతాల్లోని హార్బర్‌లకు అధికంగా తరలిస్తారు. ఉప్పును కొనుగోలు చేసిన దళారులు నెల రోజులకో రెండు నె లలకో నగదును చెల్లిస్తుంటారని ఉప్పు సాగు రైతులు చెబుతున్నారు.

వర్షాలు వస్తే ఇంతే సంగతులు
పండించిన ఉప్పును తాటాకుతో ఏర్పాటు చేసి గిడ్డంగుల్లో నిల్వ ఉంచుతున్నారు. వర్షాలు వస్తే తాటాకుల్లోకి నీళ్లు వెళ్లి ఉప్పు కరిగిపోతోంది. ప్రభుత్వం ఇప్పటికైనా గిడ్డంగులు నిర్మించాలని రైతులు కోరుతున్నారు. 

గిట్టుబాటు కావడం లేదు
రెక్కలు ముక్కలయ్యేలా కష్టపడి పండించిన ఉప్పునకు గిట్టుబాటు ధర లేకపోవడంతో నష్టాలను చవిచూడాల్సి వస్తోంది. బస్తా ఉప్పు కేవలం మార్కెట్‌లో రూ.60 రూపాయలు ధర ఉంది. పెట్టుబడులు కూడా రావడం లేదు. తరతరాలుగా ఇదే వృత్తిని నమ్ముకున్నాం. పక్కకుపోలేక.. పస్తులతోనే గడుపుతున్నారు. బస్తాకు రూ. 200 వస్తేనే గిట్టుబాటు అవుతుంది -మీరాసాహెబ్, కొత్తపాలెం

మరిన్ని వార్తలు