షరతుల్లేని పరిహారం

12 Mar, 2019 11:30 IST|Sakshi
బాధిత రైతు కుటుంబీకులతో ముచ్చటిస్తున్న జగన్‌

అన్నదాతలు చనిపోయినా ఆదరించని ప్రభుత్వమిది!

రాష్ట్ర విభజన అనంతరం ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఏర్పడ్డాక 2017 జనవరి వరకు 960 మంది రైతులు వివిధ సంఘటనలలో మృత్యువాత పడ్డారు. అందరికీ నష్టపరిహారం అందిస్తానని వాగ్దానం చేసి, అందుకు అనుగుణంగా జీవో నంబర్‌ 62ను తెచ్చింది ప్రభుత్వం. అయితే, దురదృష్టం ఏమిటంటే కేవలం 96 మంది రైతు కుటుంబాలకు మాత్రమే నష్టపరిహారం అందింది. నిజానికిలా చేయడం రైతుల్ని ఆదుకునేందుకు ఉద్దేశించిన ఆ జీవోను తుంగలో తొక్కడమే. ఇంకా విచారకరమైన విషయమేమిటంటే, ప్రకాశం జిల్లాలో 78 మంది రైతులు బలవన్మరణాలకు పాల్పడితే ఆరుగురికి మాత్రమే సాయం ఇచ్చారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.. (మానవ హక్కుల ఫోరం నివేదిక)నేలను నాశనం చేసే వాడు నింగికి ఎదుగుతుంటే మట్టిని ప్రేమించే వాడు కృంగి కృశించి చివరికి అర్ధంతరంగా ఆ మట్టిలోనే కలిసిపోవడం అంటే ఇదేనేమో.. ఆంధ్రప్రదేశ్‌లో రైతుల చావుడప్పు మోగుతోంది. పత్తి రైతులతో మొదలయిన ఈ పరంపర ఇప్పుడు అన్ని వర్గాల రైతులను చుట్టేస్తోంది. విధాన నిర్ణేతల తప్పిదాలు, వ్యవసాయ పరపతి లభించక, గిట్టుబాటు ధర రాక, పెట్టుబడులు పెరిగి అప్పుల పాలైన రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు.

రాష్ట్రంలో ఏదోమూల ప్రతిపూట ఓ అన్నదాత కన్నుమూస్తున్నాడు. వ్యవసాయ సంక్షోభంపై చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత స్వయంగా రాధాకృష్ణ కమిషన్‌ను నియమించి సంక్షోభ కారణాలను గుదిగుచ్చినా పరిష్కారం దిశగా ఏ చర్యా చేపట్టకపోగా కాలయాపన చేశారు. వ్యవసాయ రంగాన్ని ప్రాథమిక రంగంలో చేర్చానని ఘనంగా ప్రకటించుకున్నా తాను తొలిసంతకం చేసిన రుణమాఫీకే ఇంతవరకు గతి లేకుండా పోయింది. వ్యవసాయ సంక్షోభాన్ని, అన్నదాతల ఆత్మహత్యలను గుర్తించి నిరాకరించిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఆయన చంద్రబాబు ఒక్కరే. ఆత్మహత్యలు వ్యక్తిగత వ్యవహారంగా కొట్టిపారేయడం చంద్రబాబుకే చెల్లింది. గత నాలుగేళ్లలో  రెండు వేల మంది రైతులు చనిపోయారు.  దీనిపై దృష్టి సారించాల్సిన ముఖ్యమంత్రి నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారు. చనిపోయిన కుటుంబాల పట్ల అమర్యాదకరంగా ప్రవర్తిస్తున్నారు. వ్యవసాయం దండగ, టూరిజమే పండగని చెప్పే చంద్రబాబుకు చివరకు ఆత్మహత్యలు చేసుకున్న కుటుంబాలకు పరిహారం ఇచ్చేందుకు కూడా చేతులు రాకపోవడం గమనార్హం. చంద్రబాబు అధికారాన్ని చేపట్టిన 2014లో 164 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే 2015లో ఆ సంఖ్య 516కి చేరింది. డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి హయాంలో ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు లక్షన్నర పరిహారం అందించారు.

చంద్రబాబు తిరిగి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ మొత్తాన్ని పెంచడానికి సైతం ఇష్టపడలేదు. ప్రధాన ప్రతిపక్షమైన వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అసెంబ్లీలో పదేపదే డిమాండ్‌ చేయడంతో రైతు ఆత్మహత్యలపై తప్పనిసరి పరిస్థితుల్లో పరిహారాన్ని పెంచుతున్నట్టు ప్రకటించి రకరకాల ఆంక్షలు పెట్టారు.  చావును పరిగణనలోకి తీసుకోవడానికి బదులు వయసు తారతమ్యాలు పెట్టారు. 18 నుంచి 50 ఏళ్ల మధ్య వయస్కులైన రైతులకు ఒక రేటు, ఆపై వయసున్న వారికి మరో రేటు, ఇలా వివిధ రకాలుగా నిబంధనలు పెట్టి గరిష్టంగా రూ.5 లక్షలని చెబుతూ వచ్చారు. ఇలా చెప్పి మూడేళ్లు గడిచినా çకనీసం 200 మందికి కూడా సాయం అందలేదు. ఈ పరిస్థితుల్లో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రైతుభరోసా పథకాన్ని ప్రకటించారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రైతులకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తామన్నారు. అప్పుల భారంతో అన్నదాతలు మరణించడానికి వీలు లేకుండా చూస్తామని భరోసా ఇచ్చారు. ఒకవేళ ఎవరైనా రైతు దురదృష్టవశాత్తు బలవన్మరణానికి పాల్పడినా, ప్రమాదవశాత్తు మరణించినా ఆ రైతు కుటుంబానికి వైఎస్సార్‌ బీమా ద్వారా రూ.5 లక్షలు ఇస్తామని ప్రకటించారు. ఈ మొత్తాన్ని అప్పుల వాళ్లకు చెందకుండా అసెంబ్లీలో చట్టాన్ని తీసుకువచ్చి ఆ రైతు కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. చనిపోయిన రైతు కుటుంబ పునరావాసానికి ఆర్థికంగా చేయూత ఇవ్వడంతో పాటు ఆ కుటుంబాన్ని అన్నివిధాలుగా ఆదుకుంటామని జగన్‌ ఇచ్చిన హామీ పట్ల రైతుల హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.– ఎ.అమరయ్య,చీఫ్‌ రిపోర్టర్, సాక్షి

>
మరిన్ని వార్తలు