త్యాగానికి బహుమానం అవమానం 

5 Jan, 2019 05:00 IST|Sakshi

సాగునీటి ప్రాజెక్టుల వల్ల ముంపునకు గురవుతున్న 499 గ్రామాలు  

నిర్వాసితులుగా మారిన 1.62 లక్షల కుటుంబాల్లోని  ఏడు లక్షల మంది ప్రజలు 

భూసేకరణ చట్టం–2013ను     తుంగలో తొక్కిన వైనం 

నిర్వాసితులను దోపిడీ చేస్తున్న టీడీపీ ప్రజాప్రతినిధులు, దళారీలు 

పరిహారం ఇవ్వకుండానే పోలీసులను ప్రయోగించి గ్రామాల్ని ఖాళీ చేయిస్తున్న సర్కారు 

సాక్షి, అమరావతి: సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణానికి సర్వస్వాన్ని త్యాగం చేసిన నిర్వాసితులకు మెరుగైన రీతిలో పునరావాసం కల్పించాల్సిన ప్రభుత్వం భిన్నంగా వ్యవహరిస్తోంది. సాగునీటి ప్రాజెక్టుల ముంపు గ్రామాలకు చెందిన వేలాది నిర్వాసిత కుటుంబాలకు పునరావాసం కల్పించకుండా ఖాళీ చేయించింది. తద్వారా ఈ కుటుంబాల్లోని దాదాపు లక్షలాదిమంది నిర్వాసితులను రోడ్డున పడేసింది. పోలవరం, వంశధార ప్రాజెక్టు రెండో దశలో భాగమైన హిరమండలం రిజర్వాయర్, గాలేరు–నగరి సుజల స్రవంతి పథకం తొలి దశలో భాగమైన గండికోట రిజర్వాయర్‌ నిర్వాసితులకు పునరావాస ప్యాకేజీని అమలు చేయకుండానే పోలీసులను ప్రయోగించి, బలవంతంగా ఉన్న ఊళ్ల నుంచి ఖాళీ చేయించింది. 

భూసేకరణ చట్టాన్ని అపహాస్యం చేసి.. 
భూసేకరణ చట్టం–2013 ప్రకారం.. నిర్వాసితులకు సహాయ, పునరావాస ప్యాకేజీని అమలు చేయాలి. మార్కెట్‌ విలువకు రెండున్నర రెట్లు అధికంగా పరిహారాన్ని చెల్లించి భూములను సేకరించాలి. భూసేకరణలో నిర్వాసితులను దోచేస్తున్న టీడీపీ ప్రజాప్రతినిధులు.. వారికి పునరావాసం కల్పించే విషయంలోనూ లూటీ చేస్తున్నారు. భూసేకరణ చట్టం ప్రకారం.. నిర్వాసితులకు జీవనోపాధి, ఇంటి సామగ్రి రవాణా, ఏడాది పనిదినాల కల్పనతో కలిపి ఒక్కో నిర్వాసిత కుటుంబానికి రూ.6.36 లక్షలు, గిరిజన కుటుంబాలకు రూ.6.86 లక్షల చొప్పున పరిహారం చెల్లించాలి. పునరావాస కాలనీని నిర్మించి, అన్ని మౌలిక సదుపాయాలతో వారికి ఆశ్రయం కల్పించాలి. ఇళ్లు నిర్మించుకోవడానికి నిధులు ఇవ్వాలని కోరితే.. నిర్మాణానికయ్యే మొత్తాన్ని నిర్వాసితులకు అందజేయాలి. ముంపు గ్రామాల్లో 18 ఏళ్లు నిండిన యువతీయువకులు ఉంటే వారిని ప్రత్యేక కుటుంబంగా గుర్తించి.. ఇదే రీతిలో ప్యాకేజీని వర్తింపజేయాలి.  

పోలవరం ప్రాజెక్టులోనే 371 గ్రామాలు 
రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం వల్ల 499 గ్రామాలు ముంపునకు గురవుతాయి. ఇందులో పోలవరం ప్రాజెక్టులోనే 371 గ్రామాలు ఉండటం గమనార్హం. ప్రాజెక్టుల వల్ల 1,62,870 కుటుంబాలకు చెందిన ఏడు లక్షల మంది ప్రజలు నిర్వాసితులుగా మారుతున్నారని అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. లబ్ధిదారులను ఎంపిక చేయడానికి గ్రామసభలు నిర్వహించాలి. తర్వాత గ్రామ పంచాయతీ కార్యాలయంలో లబ్ధిదారుల జాబితాను అందుబాటులో ఉంచాలి. కానీ.. టీడీపీ కీలక నేతలతో కుమ్మక్కైన ఉన్నతాధికారులు గ్రామసభలకు మోకాలడ్డారు. తాము నియమించుకున్న దళారీల ద్వారా ముడుపులు ఇచ్చేందుకు అంగీకరించినవారు నిర్వాసితులైనా, కాకున్నా లబ్ధిదారుల జాబితాలో చోటు కల్పిస్తున్నారు. ఆ జాబితా మేరకే పరిహారం చెల్లిస్తూ నిలువుదోపిడీ చేస్తున్నారు. 

నిర్వాసితుల జీవితాలతో చెలగాటం 
ప్రభుత్వం పునరావాస కాలనీల్లో ఐదు సెంట్ల భూమిని కేటాయించి పక్కా గృహాన్ని నిర్మించి ఇవ్వాలి. పోలవరం నిర్వాసితులకు మాత్రమే ఇళ్లను నిర్మిస్తున్న సర్కార్‌.. మిగిలిన ప్రాజెక్టుల నిర్వాసితులకు ఇళ్ల స్థలాలను కేటాయించి.. నిర్మాణానికి రూ.60 వేల నుంచి రూ.70 వేలను మాత్రమే ఇస్తోంది. కానీ.. సర్కార్‌ నిర్మిస్తోన్న ఇళ్లు పిచ్చుక గూళ్లను తలపిస్తున్నాయి. కేవలం సెంటు సెంటున్నర భూమిలో ఇరుకైన ఒకే గది, దానికి అనుబంధంగా చిన్న వంట గది, మరుగుదొడ్డి నిర్మించి ఇస్తున్నారు. వాస్తవంగా ఈ ఇంటి నిర్మాణానికి రూ.లక్షకు మించి వ్యయం కాదు. కానీ.. ఒక్కో ఇంటి నిర్మాణానికి రూ.3.9 లక్షల నుంచి రూ.4.25 లక్షల వరకూ అంచనా అవుతుందని లెక్కలు వేసి ఆ పనులను గంపగుత్తగా టీడీపీ ఎమ్మెల్యేలకు అనుకూలురైన కాంట్రాక్టర్లకు అప్పగిస్తున్నారు. ఇందులో రూ.వందలాది కోట్ల కమీషన్‌లు చేతులు మారుతున్నాయి.  

ఒక్కో చోట.. ఒక్కో రీతిలో పరిహారం 
ప్రభుత్వం నిర్వాసితులకు ఒక్కో ప్రాజెక్టులో ఒక్కో రీతిలో పరిహారం అందజేస్తోంది. పోలవరం ప్రాజెక్టు నిర్వాసిత గిరిజనులకు రూ.6.86 లక్షల చొప్పున పరిహారం ఇస్తుంటే.. గిరిజనేతరులకు రూ.6.36 లక్షల చొప్పున అందజేస్తోంది. గండికోట నిర్వాసితులకు కొందరికి రూ.3.75 లక్షల చొప్పున, మరికొందరికి రూ.4.89 లక్షల చొప్పున పరిహారాన్ని మంజూరు చేసింది. ఇక హిరమండలం రిజర్వాయర్‌ నిర్వాసిత కుటుంబాల్లో ఒక్కో కుటుంబానికి రూ.5 లక్షల చొప్పున పరిహారం ఇచ్చింది.

భూమి ఒక చోట.. ఇళ్లు మరో చోట 
పోలవరం, హిరమండలం పునరావాస కాలనీలకు సమీపంలోనే గిరిజనులకు ఒక్కో కుటుంబానికి కనీసం 2.5 హెక్టార్ల సాగు భూమికి బదులుగా అంతే స్థాయిలో సాగు భూమి కేటాయించాలి. కానీ.. సర్కార్‌ తద్భిన్నంగా వ్యవహరిస్తోంది. నిర్వాసితులను బస్సులో తీసుకొస్తున్న అధికారులు పునరావాస కాలనీల సమీపంలోని భూములను చూపించి.. వాటినే మీకు ఇస్తున్నామని చెప్పి నమ్మబలుకుతున్నారు. ఆ తర్వాత పునరావాస కాలనీకి 25 కి.మీ.ల దూరంలో కొండలు, గుట్టల్లోని భూములను కేటాయిస్తున్నారు. ఒక్కో గిరిజనుడికి గరిష్టంగా ఐదు ఎకరాల భూమిని ఒకే చోట చూపించాలి. కానీ.. ఎకరం, అరెకరం చొప్పున సర్కార్‌ ఐదారు చోట్ల భూమిని కేటాయిస్తుండటంతో వాటిని తామెలా సాగు చేసుకోగలుగుతామని నిర్వాసితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గిరిజన ట్రిబ్యునల్‌ విచారణలో ఉన్న భూములను సర్కార్‌ సేకరించకూడదు. కానీ.. కోర్టుల్లో విచారణలో ఉన్న భూములను కూడా సేకరించిన అధికారులు.. నిర్వాసితులకు కేటాయిస్తున్నారు. భూములను స్వాధీనం చేసుకోవడానికి వచ్చిన గిరిజనులను స్థానికులు అడ్డుకుంటున్నారు. 

>
మరిన్ని వార్తలు